క‌రోనా మ‌హమ్మారి యావ‌త్భార‌త దేశాన్ని క‌బ‌ళిస్తున్న వేళ ఆ మ‌హ్మ‌మారి నుంచి ప్ర‌జ‌ల ప్రాణాల‌ను ర‌క్షించుకోవ‌డానికి ఆధునిక వైద్య శాస్త్రం తీవ్రంగా కృషి చేస్తుంటే మ‌రోవైపు అభివృద్ధి నిరోధ‌క శ‌క్తులు ఆ విజ్ఞాన శాస్త్రం మీద‌నే దాడి చేస్తున్నాయి. ” క‌రోనాకు ఆధునిక వైద్యం అక్క‌ర‌లేదు. ఆవు పేడ‌, ఆవు మూత్రం, చిట్కా వైద్యాలు చాల‌ని” ఆర్ ఎస్ ఎస్బీ జేపీ అనుయాయులు ప‌నిగ‌ట్టుకుని ప్ర‌చారం చేస్తున్నారు. ఆయుర్వేదం పేరుతో వేల కోట్ల రూపాయ‌ల వ్యాపారం చేస్తున్న బాబా రామ్‌దేవ్ క‌రోనాను సాకుగా చూపించి శాస్త్రీయ వైద్య విధానాన్నే ప్ర‌శ్నిస్తున్నారు. క‌రోనాకు మందు పేరుతో ఆయ‌న త‌యారు చేసిన‌ట్టు చెబుతున్న ఆయుర్వేద మందు క‌రోనిల్ కు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ స‌ర్టిఫికెట్ ఇచ్చింద‌ని చేసిన త‌ప్పుడు ప్ర‌చారాన్ని ఆ సంస్థ ఖండించింది. క‌రోనిల్ బోగ‌స్ అని తేలిపోయింది. వాస్త‌వానికి ఆయుర్వేదంతో స‌హా ఇత‌ర వైద్య ప‌ద్ధ‌తుల‌న్నీ కొన్ని రోగాల‌ను న‌యం చేస్తే చేసి ఉండొచ్చుగాక .. కానీ క‌రోనాను అరిక‌ట్టే విష‌యంలో ఇంత వ‌ర‌కూ ఆ విధానాలు ఉప‌యోగ‌ప‌డ‌లేదు.

క‌రోనాను అరిక‌ట్ట‌డంలో ఘోరంగా విఫ‌ల‌మైన ఆరెస్సెస్ , బీజేపీ ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించ‌డానికి నానా ర‌కాల త‌ప్పుడు ప్ర‌చారాల‌ను చేస్తూనే ఉంది. నెల్లూర్ జిల్లా కృష్ణప‌ట్నంలో ఆనంద‌య్య నాటు మందు క‌రోనాను త‌గ్గిస్తుంద‌ని వ‌చ్చిన ప్ర‌చారాన్ని కూడా దానిలో భాగంగానే చూడాలి. ఆనంద‌య్య నాటు మందు వల్ల న‌ష్టం లేదు క‌దా, త‌ప్పో ఒప్పో క‌రోనా రోగులు వాడితే పోలా అని వాదించిన వారికి త‌రువాత అక్క‌డ జ‌రిగిన ప‌రిణామాలే స‌రైన స‌మాధానం చెబుతున్నాయి. ఆనంద‌య్య మందుతో కోలుకున్నాన‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేసిన పాఠ‌శాల ఉపాధ్యాయుడు కోట‌య్య రోగం ముదిరి చనిపోయాడు. చాలా మంది ఆసుప‌త్రుల్లో తీవ్ర స్థితి లో చికిత్స పొందుతున్నారు. ఇది చాల‌దా నాటు మందు చేసే న‌ష్టాల గురించి తెలుసుకోవ‌డానికి?

క‌రోనా అనేది గ‌తంలో మాన‌వాళి ఎరుగ‌ని కొత్త ర‌కం వైర‌స్ వ‌ల్ల సంభ‌విస్తున్న వ్యాధి. ఏడాది క్రితం మాన‌వుల్లో ఈ కొత్త వైర‌స్ వెలుగు చూసిన వెనువెంట‌నే శాస్త్ర‌వేత్త‌లు దాని జ‌న్యుక్ర‌మాన్ని క‌నుగొన్నారు. అనేక ర‌కాల టెక్నాల‌జీల‌ను ఉప‌యోగించి నెల రోజుల్లోనే వైర‌స్‌ను అరిక‌ట్ట‌గ‌లిగే వ్యాక్సిన్‌ను రూపొందించారు. మామూలుగా అనేక సంవ‌త్స‌రాలు ప‌ట్టే వ్యాక్సిన్ ప‌రీక్ష‌ల‌ను ఏడాదిలోపుకు కుదించి డ‌జ‌నుకు పైగా వ్యాక్సిల‌ను వినియోగంలోకి తీసుకువ‌చ్చారు. కానీ మ‌న‌దేశంలో దానికి భిన్నంగా జ‌రిగింది.
న‌రేంద్ర‌మోదీ నాయ‌క‌త్వంలోని బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యం వ‌ల్ల మ‌హమ్మారి తీవ్ర స్థాయిలో
వ్యాప్తి చెందింది. రోగుల‌కు ఆసుప‌త్రులు చాల లేదు. బెడ్లు లేవు. ఆక్సిజ‌న్‌, మందులు, వ్యాక్సిన్‌లు దొర‌క్క
ఆరోగ్య సంక్షోభం ఏర్ప‌డింది. ప్రైవేట్ ద‌వాఖాన‌ల దోపిడీ, మందులు, ఆక్సిజ‌న్ త‌దిత‌రాల బ్లాక్ మార్కెటింగ్‌తో ప్ర‌జ‌ల‌కు వైద్య వ్య‌వ‌స్థ మీద‌నే న‌మ్మ‌కం పోయే ప‌రిస్థితి వ‌చ్చింది.

ఈ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుకుని ముందుకు పోవ‌డం కాకుండా వెన‌క్కి, ప్రాచీన కాలంలోకి న‌డిస్తే మెరుగైన జీవితం ల‌భిస్తుంద‌ని చీక‌టి శ‌క్తులు చేస్తున్న ప్ర‌చారాన్ని ప్ర‌జ‌లు సులువుగా న‌మ్మే ప‌రిస్థితి ఏర్ప‌డింది.
కానీ క‌రోనా మ‌హమ్మారి దేశంలో సృష్టించిన ఈ సంక్షోభానికి కార‌ణం ఆధునిక వైద్యం కాదు. ఆ వైద్యాన్ని ప్రైవేట్‌కు అప్ప‌గించి వ్యాపారంగా మార్చిన ప్ర‌భుత్వాల‌ది. ప్ర‌జారోగ్యం ప్ర‌భుత్వం చేతుల్లో ఉన్న ఏ దేశంలోనూ మ‌న దేశంలో లాంటి ద‌య‌నీయ ప‌రిస్థితులు త‌లెత్త‌లేదు, ఎందుకు? ప్ర‌భుత్వ ఆరోగ్య సంస్థ‌
అక్క‌డి ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం క‌లిగించింది కాబ‌ట్టి.

భార‌త దేశంలోనూ, మ‌న రాష్ట్రంలోనూ ఏ శ‌క్తులైతే ప్ర‌జా ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టు ప‌ట్టించాయో ఆ శ‌క్తులే నేడు ప్ర‌జ‌ల్లోని అభ‌ద్ర‌త భావాన్ని ఉప‌యోగించుకుని ఆధునిక వైద్యం పై దాడి చేస్తున్నాయి. ఆధునిక వైద్యం త‌ర‌త‌రాల ప్ర‌జ‌ల విజ్ఞానం నుంచి పుట్టిన‌ది. దాన్ని పెట్టుబ‌డిదారి వ్య‌వ‌స్థ వ్యాపారంగా మార్చినందున అది ప్ర‌జ‌ల‌కు దూర‌మైన కొన్ని సందర్భాల్లో వారిని భ‌య‌పెడుతోంది. దాన్ని పూర్తిగా ప్ర‌జాశ్రేయ‌స్సు కోసం ఉప‌యోగించుకోవాలంటే వైద్యాన్ని మార్కెట్ మాయాజాలం నుంచి విముక్తి చేయాలి. వైద్య రంగాన్ని ప్ర‌భుత్వ ప‌రం చేయ‌డానికి ఉద్య‌మించడమొక్క‌టే దీనికి మార్గం.

ఎస్. వెంకట్రావు
“మర్క్సిస్టు” మాసపత్రిక
ఎడిటోరియల్
03.06.2021

You missed