“ఏమైందీ తెలంగాణ ఉద్యమకారుడికి?” ఆయన పేరు కరుణాకర్ దేశాయి కేతిరెడ్డి. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసిన వాడు. చైతన్యం సోయి ఉన్నవాడు. ప్రశ్నించే మనస్తత్వం ఉన్నవాడు. అధికార పార్టీయైన, మరేపార్టీయైనా తెలంగాణకు వ్యతిరేకంగా ప్రవర్తించిన, వ్యవహరించినా, సోషల్ మీడియా వేదికగా కడిగిపాడేసేవాడు. ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా, సూటిగా, ఘాటుగా చెప్పేవాడు. ఆయనకు అభిమానులు కూడా ఉన్నారు.
కానీ ఈ రోజు రాత్రి తన ఫేస్ బుక్ వాల్ మీద ఓ పోస్టింగ్ దర్శనమిచ్చింది. అది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తీవ్ర చర్చనీయాంశమైంది. సమైక్యాంధ్ర మ్యాప్ ఒకటి పెట్టి… “రెండు రాష్ట్రాలు ఏకం చేసే ఉద్యమము వస్తే! నేను ముందుండి పోరాటం చేస్తాను?” అని రాశాడు. దీనిపై నెటిజన్లు ఆయనపై విరుచుకుపడ్డారు. సగం మంది ఆగ్రహం వ్యక్తం చేయగా కొందరు లైక్‌లు కొట్టారు. మళ్లీ దీని తర్వాత “ఒరే కరుణాకర్, ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నావ్…? ఎందుకు ఇబ్బందులు పడుతున్నావ్..? బాగయ్యిందని నా అంతరాత్మ ఎతేశికం చేస్తుంది.” అని మళ్లీ ఓ పోస్టు పెట్టాడు. ఈ పోస్టుకు గంగారాజేందర్ గుప్తా అనే వ్యక్తి “తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నం అనే బాధ ప్రతి ఒక్కరిలో ఉంది.” అని కామెంట్ చేశాడు.
ఉన్నపళంగా కరుణాకర్ ఈ పోస్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత వైరాగ్యమెందుకు వచ్చింది? ఎప్పుడూ పాలకులను ప్రశ్నిస్తూ, ప్రతిపక్షాలను విమర్శిస్తూ .. తెలంగాణ సోయితో మాట్లాడే కరుణాకర్ లాంటి ఓ విద్యావేత్త, తెలంగాణ ఉద్యమకారుడు ఇలా పోస్టు చేయడం వెనుక ఆంతర్యమేమిటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇదిప్పుడు చర్చకు దారి తీసింది.