ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు చేసే విషయం బీజేపికి పులి మీద స్వారీయే అని ముందే చెప్పుకున్నాం. కానీ బీజేపీ ఆ పులి మీద నిన్నటి దాకా స్వారీ చేసి ఈ రోజు ఆ పులికే బలైయ్యింది. కొండంత రాగం తీసి .. అన్నట్టు పదిన్నర గంటల పాటు ఏకధాటిగా విచారణ పేరుతో సర్వత్రా ఉత్కంఠను రేకెత్తించిన బీజేపీ.. చివరకు కవితను వదిలేసింది. అరెస్టు చేయలేదు. అంతా అనుకున్నారు. ఇక కవిత అరెస్టు తథ్యమని. అలాంటి ఉత్కంఠ, నరాలు తెగే వాతావరణాన్ని నెలకొల్పడంలో బీజేపీ సక్సెసయ్యింది. ఇక్కడ ఈడీని ప్రత్యేకంగా చూడాల్సిన పనిలేదు. అది అమిత్‌షా, మోడీ ఎలా చెబితే అలా నడిచే సంస్థలే అని చాలా సార్లు నిరూపితమైంది.
అదే వాస్తవం కూడా. అయితే తెగేదాకా తీసుకొచ్చిన కేంద్రం.. ఇక కవితను టార్గెట్ చేసి జైలుకు పంపిగానీ తను ప్రశాంతంగా ఉండదని అంతా అనుకున్నారు. కానీ మోడీ ప్రభుత్వం అలా చేయలేదు. దేశం యావత్తు ఈ కేసుపై దృష్టి కేంద్రీకరించేలా.. కేసీఆర్, కవిత, తెలంగాణ పేర్లు మార్మోగేలా చేసి.. తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను మోరల్‌గా దెబ్బతీయాలని మోడీ ప్రభుత్వం యోచించింది. ఈడీ ద్వారా అదే చేయించింద. ఆ విషయంలో సక్సెస్ అయినా… ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టు .. కవితను వదిలేయడం వల్ల ఆమెకు పరోక్షంగా క్లీన్ చిట్ ఇచ్చినట్టే. అదే ఇప్పుడు చర్చకు వస్తోంది. మున్ముందు ఈ కేసులు ఏ మలుపులు తిరుగుతుందో… ఇక్కడే సమాప్తం చేస్తారో… ఇంకా కేసీఆర్‌ను బెదిరించేందుక వాడుకుంటారో తెలియదు.. కానీ మళ్లీ ఇప్పటికైతే విచారణ లేదు.