ప్రైవేటు స్కూళ్ల‌లో ప‌నిచేస్తున్న టీచ‌ర్ల బ‌తుకులు మ‌ళ్లీ అగ‌మ్య‌గోచ‌రంగా మారాయి. క‌రోనాతో ప్రైవేటు పాఠ‌శాల‌లు ఆన్‌లైన్ క్లాసుల‌కే ప‌రిమిత‌మ‌వుత‌న్న నేప‌థ్యంలో నిర్వాహ‌కులు కొద్ది మంది టీచ‌ర్ల‌తోనే నెట్టుకొస్తున్నారు. దీంతో చాలా మంది ఉద్యోగం లేక‌, జీతాలు రాక‌.. అవే ఇబ్బందులు ఇంకా ఎదుర్కొంటున్నారు. ఓ మూడునెల‌ల పాటు సీఎం కేసీఆర్ రెండు వేల చొప్పున జీవ‌న భృతి అందించాడు. 25కిలోల చొప్పున బియ్యాన్ని ఇచ్చాడు. ఆ త‌ర్వాత వీరి గురించి మ‌రిచిపోయాడు. ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో కొంద‌రు ముక్కుపిండి మ‌రీ వ‌సూలు చేస్తున్నారు. ఆన్‌లైన్ క్లాసులు ఆపేస్తామ‌ని కూడా బెదిరిస్తున్నారు. దీంతో నెల‌వారీ ఫీజులు క‌ట్టుకుంటున్నారు. పాత‌వి పెండింగ్ ఉంటే వాటినీ వ‌సూలు చేసుకుంటున్నారు. ఎప్ప‌ట్లోగా క‌డుతారంటూ హామీ ప‌త్రాల‌ను కూడా రాయించుకుంటున్నారు. కానీ వారి న‌ష్టాన్ని పూడ్చుకునేందుకే ట్రై చేస్తున్నారు త‌ప్పితే.. టీచ‌ర్లంద‌రికీ జీతాలు ఇవ్వడం లేదు. ఎంత మందితో ఆన్‌లైన్ క్లాసులు తీసుకుంటున్నారో.. వారికే అర‌కొరా ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. గ‌త రెండు నెల‌లుగా వీరిక‌చ్చే భృతిని ప్ర‌భుత్వం నిలిపివేసింది. దీంతో మ‌ళ్లీ ప్ర‌భుత్వ సాయం కోసం ఎదురుచూసే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇప్ప‌ట్లో పాఠ‌శాల‌లు తెరిచే ఆలోచ‌న‌లు కూడా ప్ర‌భుత్వం చేస్తున్న‌ట్లు లేదు. దీంతో ఏం చేయాలో వారికి పాలుపోవ‌డం లేదు. కొంద‌రు లేడీ టీచ‌ర్లు టైల‌రింగు చేసుకుంటున్నారు. ఇలా ఎవ‌రికి దొరికిన ప‌నులు వారు చేసుకుంటున్నా.. అంద‌రికీ ఉపాధి అవ‌కాశాలు దొర‌క‌డం లేదు. దీంతో దిక్కుతోచ‌ని స్థితిలో ఉండిపోయారు. కేటీఆర్‌కు ప‌లుమార్లు సంఘాల నాయ‌కులు తెలియజేసినా.. ఆయ‌న పెద్ద‌గా స్పందించ‌లేదు.