దళితబంధుపై కేసీఆర్ గంపెడాశలు పెట్టుకున్నాడు. దీని వెనుక కఠోర శ్రమ కూడా చేసినట్లు కనిపించింది. అధికారులతో కూర్చుని గంటలు గంటలు సమీక్ష కూడా చేశాడు. ఈ పథకం అల్లాటప్పా కాదన్నాడు. దీని వెనుక పెద్ద ప్లానింగ్ ఉందన్నాడు. దేశానికే ఆదర్శమన్నాడు. ప్రపంచం అబ్బురపడి చూస్తుందన్నాడు. అంతా అని హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్ గా అమలు అనే సరికి చాలా మందికి డౌట్ వచ్చింది. అదే చెప్పారు. కానీ కేసీఆర్ తనదైన స్టైల్లో స్పందించాడు. అవును ఓట్లు రాలొద్దా? డౌటేముంది అన్నాడు. ఇక ఆశలు సన్నగిల్లాయి దీనిపై. అనుమానాలు మొదలయ్యాయి.
హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత ఇది ఉంటుందా? జీహెచ్ఎంసీ వరద సాయంలాగా బురదలో కలిసిపోతుందా? అని ప్రశ్నార్థకముఖాలతో ఉండిపోయారు. అనుకోకుండా ఇయాళ కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రికి పోయి.. అక్కడ ఆదరబాదర ఈ పథకాన్ని ప్రకటించేసి ప్రారంభించేశాడు. చాలా ప్రష్టేషన్‌లో కనిపించాడు. చిరాకు పడుతూ మాట్లాడాడు.
హుజురాబాద్ ఎన్నిక నోటిఫికేషన్‌పై కేసీఆర్‌కు స్పష్టత వచ్చి ఉంటుంది. మరో వారంలోగా అది వెలువడే అవకాశం ఉంది. దీంతో ఈనెల 16న హుజురాబాద్‌లో అనుకున్న లాంచింగ్ ప్రోగ్రాం కాస్తా వాసాలమర్రికి మారింది. అక్కడ 76 మందే అర్హులని తేలింది. వారితో సరిపెట్టాడు. రేపే బ్యాంకులో పది లక్షలు పడతాయి అన్నాడు. కానీ పథకం ఉద్దేశ్యం ఏందీ? ఇప్పటి వరకు ఏం చెప్తూ వచ్చారు? దాని సీరియస్‌నెస్ లేకుండా తూతూ మంత్రంగా దీన్ని కేసీఆర్ ప్రకటించేయడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు.
మీరేమన్నా చేసుకోండి. ప్లానింగ్ చేసుకోండి. మీ ఇష్టం. అమ్మలక్కలు మీరు జర కనిపెట్టుకొని ఉండుండ్రి. పైసలు పక్కదారి పట్టగాలా. మీకు ఎప్పుడు సమ్మతైతే అప్పుడు కలెక్టర్ దగ్గరికి వచ్చి పైసలు తీసుకుపోండి. ఇయ్యాల ఇంట్ల అందరూ కూసోని ఏం చేసుకోవాలో మాట్లాడుకోండ్రి.. ప్రజాప్రతినిధులు మీరట్ల పోయి చూసి రండ్రి.. ఏం చేస్తున్నారో…. ఇలా సాగింది కేసీఆర్ ప్రసంగం.
ఈ పథక అమలు ఎంత డొల్లతనంగా ఉందో ఆయన మాటలే చెప్తున్నాయి. మరి మీరు ఇన్ని రోజులు ఏం కసరత్తు చేశారు? ఏమేమివ్యాపారాలు చేపిద్దామని ప్రణాళికలు వేశారు. ఆర్థికంగా వారెదిగేందుకు ఏమైనా ఆప్షన్లు మీ తరపున ఇచ్చారా? వారి మానానా వారిని వదలేసి మీరే ఆలోచించుకోండంటే… ఇప్పటి వరకు అప్పులు చేశారు. ఫస్టు అప్పులే కట్టుకుంటరు. కట్టుకోమంటారా? మీ ఇష్టం అంటారా?
మీరు మంచిగా ఈ పథకాన్ని వాడుకోకపోతే ఈ మండలంలోని దళితుల కర్మకాలినట్టే అని కూడా అన్నాడు. ఇక వారికి అమలు చేయరన్నమాటన. అంతే మరి. ఇదంతా ట్రయల్ రన్. సక్సెస్ అయితేనే అందరికీ దాని ఫలాలు అందుతాయన్నమాట. వాసాలమర్రి స్పీచ్‌లో చాలా విషయాలకు కేసీఆర్ క్లారిటీ ఇచ్చాడు. అర్థమయ్యేవాళ్లకు అర్థమై ఉంటుంది.