2023 దిశగా…
ఎన్నికల వ్యూహరచన లో తెలంగాణ ముఖ్య మంత్రి కే సీ ఆర్ కి కేసీఆరే సాటి. ఆబ్జెక్టివ్ గా విశ్లేషించాల్సి వచ్చినప్పుడు ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని విశ్లేషిస్తున్నప్పుడు ఈ వాస్తవాన్ని తప్పక అంగీకరించాల్సిందే. మొన్న రాత్రి క్యాబినెట్ మీటింగ్ అనంతరం పాడి కౌశిక్ రెడ్ది పేరును గవర్నర్ కోటా లో ఎమ్మెల్సీ గా నామినేట్ చేయాలని సిఫార్సు చేస్తూ చేసిన తీర్మానం తాలూకు వార్త బయటకు వచ్చింది. ఆ సిఫార్సు ను ఒక ఎత్తుగడ గా మాత్రమే పరిగణించే అవకాశం లేదు. అందులో చాలా ముందస్తు ఆలోచన ఉన్నదనిపిస్తున్నది. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, స్వయం గా ముఖ్యమంత్రి కూడా ఇప్పటికిప్పుడు కొట్టి పారేస్తున్న కేటీఆర్ ను ముఖ్యమంత్రి గా అభిషిక్తున్ని చేసే అంశం భవిష్యత్తులో ఆచరణాత్మకం కావల్సి వస్తే ఏం చెయ్యాలో కే సీ ఆర్ తన వ్యూహ రచన ద్వారా ఆచరణాత్మకం చేస్తున్నాడనిపిస్తున్నది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో మృతిచెందిన ఎమ్మెల్యే కొడుకు నోముల నర్సిం హయ్య కొడుకు భగత్ ను బరిలోకి దించిన నాటి నుంచి కేసీ ఆర్ వ్యూహాల్లో చతురత కనిపిస్తున్నది. హుజురాబాద్ ఎన్నిక కోసం దళిత బంధు ను వోట్ల కోసం తెచ్చాడా, లేక ఇతర అవసరాలకు తెచ్చాడా అనే మాటటుంచితే దుబ్బాక ఉప ఎన్నిక నాడు కొరవడిన ద్వితీయ శ్రేణి నాయకత్వ లేమిని అధిగమించేందుకు హుజురాబాద్ ను ఒక కార్యక్షేత్రం గా ఎంచుకోబోతున్నాడనే వాస్తవం కనిపిస్తున్నది.
ఈ క్రమం లోనే కౌశిక్ రెడ్డి ఎంపికను గానీ, హుజురాబాద్ అభ్యర్థి ఎంపికను గానీ మనం గమనం లోకి తీసుకోవచ్చు. చాలామంది ఈ విశ్లేషణను అపరిపక్వ వాదనగా కొట్టిపారెయ్యవచ్చుగానీ కేసీ ఆర్ 2023 కోసం పార్టీల్లో యువతరాన్ని ఎక్కువగా ప్రోత్సహించవచ్చనిపిస్తున్నది. ఇప్పటికే దళిత ఎమ్మెలెల్యేల్లో అనేకులు యువతరం ప్రతినిధులుగా ఉన్నారు. హుజురాబాద్ లో కూడా యువ అభ్యర్థి రావచ్చని అనుకుంటున్నారు. 119 నియోజకవర్గాల్లో రానున్న ఎన్నికల్లో కనీసం మూడోవంతు యువతరాన్ని ప్రయోగించవచ్చని ఒక అంచనా. వాస్తవానికి ప్రతిపక్షానికి విశ్లేషణలకు అంచనాకందని రీతిలో అభ్యర్థులనెంచుకోవడమే కేసీ ఆర్ వ్యూహాత్మక రాజకీయాల్లో ఒక ఎత్తుగడ. ఇప్పటికిప్పుడు యువతను ఎంచుకోవడం అసాధ్యమని ఎవరనుకున్నా వచ్చే ఎన్నికల గురించి కేసీఆర్ ఓ పదడుగులు ముందే ఉన్నారనిపిస్తున్నది. రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్న వర్గాలను అనూహ్యంగా తెర పైకి తెచ్చే రీతిలో ఆయన చర్యలున్నా ఆశ్చర్యం లేదు.
రైతు బంధు అమలు తర్వాత ఏడాదిన్నరకే ఎన్నికలు తెచ్చిన కేసీఆర్ ఈ సారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళోచ్చు . అప్పుడు బహుజనులు, దళితులు, మహిళలు అంతా యువతరం నుంచి చట్టసభలోకి వెళ్ళే రీతిలో ఆయన వ్యూహం వుండొచ్చేమో.
P V Kondal Rao
