వాట్సాప్ అనుకోకుండా ఆగిపోయింది. పనిచేయలేదు. ఎవరికీ అంతు చిక్కలేదు. ఏందీ..? ఈ ఉపద్రవం నాకేనా..? అందరికా..? అనే అనుమానం వచ్చింది. ఓ సారి చెక్ చేసుకున్నారు. లేదు.. అందరికీ అంట…. అని తెలుసుకోగానే హమ్మయ్య…! అనుకున్నాం. ఇప్పుడు కొంత భయం పోయింది. భారం తగ్గింది. అందరికీ వచ్చినప్పుడు నాకూ వస్తుందిలే అనుకున్నాం. అనుకున్నామైతే అనుకున్నాం కానీ… ఇంకా ఎంతకీ రాదేం. పదే పదే మనసంతా దారి చుట్టే. ఓసారి చెక్ చేసుకంటే పోలా..? అరే ఇప్పుడు రెండు క్షణాల కిందనే కదా చెక్ చేసుకుంది. ఏమో వచ్చిందేమో..! సరే చూసుకుని చావు.. మనసు తిడుతోంది. అయినా మనం మనసు మాట ఎప్పుడు పట్టించుకున్నాం గనుక. చెక్ చేసుకున్నాం. కానీ ఇంకా రాదే . ఆగిపోయింది.

వార్నీ ఇదే పోయేం కాలం రా. ఓవైపు సూర్యగ్రహణం ఇంట్లో ఎక్కడికి వెళ్లొద్దనే కండిషన్. కాళ్లు కట్టేసినట్టయ్యింది. అన్నీ లేకపోయినా భరిస్తాం గానీ చేతిలో ఫోన్ .. అందులో సోషల్ మీడియా ఆన్.. ఇవి రెండు ఉండాలే. అప్పుడు కదా మన పంచేద్రియాలు పనిచేసేవి. అందులో ఒకటి వాట్సాప్. ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది మనకు. మరి అది లేకుంటే ఎలా..? అవునూ.. వాట్సాప్‌కు గ్రహణం పట్టిందా..? గడ్డి పర్క ఒకటి వేస్తే వస్తుందా..? చూద్దాం.. ఇంకెంత సేపు. ఈ నరకం భరించలేం రా బాబు..? ఇలాగైతే బతికేదెలా..? ఏందీ.. అప్పుడే ఈ సమస్య చావు బ్రతుకుల దాకా పోయిందా..? అవును మరి..! వాట్సాప్ లేకుండా ఉండగలమా..? జీవనాధారం, ప్రాణాదారం, సమాచారాధారం, టైంపాస్‌కు ఆధారం, టైం వేస్ట్ చేసి కాలాన్ని హరించే సాధనం.. అడ్డమైన ముచ్చట్లన్నీ ఒక్కదగ్గరికి తెచ్చే సమాచారం, చాటింగులు.. గ్రూపులు.. మార్ఫింగులు, వ్యంగ్యాలు, బూతులు, వీడియోలు… అబబ్బ ఇవన్నీ ఎందుకు…? వాట్సాప్ ఎప్పుడు ఆన్ అవుతుందో చెప్పవోయ్…! ఏమో నాకేం తెలుసు..! నాదీ అదే ప్రాబ్లెం కదా.. ! ధిమాక్ పనిచేస్తలేదు. బాస్. అగో వచ్చిందంటగా.. పనిచేస్తుందంట.. చూసుకో… చూసుకో… అవ్ అవ్ వచ్చింది వచ్చింది. …. హమ్మయ్య…
దీనిబ్బా దీనికి రోజుకొక ఐదారు గంటలు గ్రహణం పడితే బాగుండు…
అమ్మో ఐదారుగంటలా..? పోనీ మూడు నాలుగంటలు… అంతసేపా..?
పోనీ…. రెండు మూడు గంటలు…… ఆగడం కష్టమే..
పోనీవోయ్.. కనీసం ఒక గంట… ఉహూ..
అద్దగంట…. పోవోయ్.. పో ఒక్క నిమిషం ఆగినా కష్టమే అంతే…. ఇంగ ఎక్కువ మాట్లాడకు…
