బీజేపీపై మంత్రి ప్రశాంత్ రెడ్డి విరుచుకు పడ్డాడు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఎంత పింఛన్ ఇస్తున్నారో సోదాహరణంగా వివరించి చెప్పిన ఆయన… ఇక్కడ రెండు వేల పింఛన్ ఇస్తున్న కేసీఆర్‌ను పోగొట్టుకుంటరా..? ఆరేడు వందల పింఛన్ ఇచ్చేటోడిని తెచ్చుకుంటరా..? అని ప్రజలను ప్రశ్నించారు. కమ్మర్‌పల్లి మండలంలో ఇవాళ ఆయన ఎమ్మెల్సీ కవితతో కలిసి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడాడు. ఇక్కడ ఉన్న సంక్షేమ పథకాలు ఒక్కటీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం లేదని, కానీ నెత్తి ఉన్నోడు, లేనోడు వచ్చి ఏదో చెబితే మనం నమ్మాలా..? వాళ్ల మాటలకు మోసపోవాల్నా అని అని హితవు పలికాడు. లఫంగని, మంచోడిని ఒక్క గాటన జమ చేయద్దని వేడుకున్నాడు ప్రజలను. పోశమ్మ పోతం చేస్తే మైసమ్మ మాయం చేసినట్టు కేసీఆర్ సంక్షేమ పథకాల పేరుతో పేద ప్రజలకు ధనం చేరేలా చేస్తే.. ఆ ధనాన్ని పెట్రోల్, డిజీల్, గ్యాస్ ధరల పెంపుదల రూపంలో మోడీ తన్నుక పోతున్నాడని విమర్శించాడు.
సీఎం సహాయ నిధి లెక్క.. ప్రధాని సహాయనిధి కూడా ఉంటది కదా.. ఏనాడైనా అర్వింద్ ఆ సహాయ నిధి కింద జనాలకు మేలు చేశాడా..? ఒక్క రూపాయయైనా ఇప్పించాడా.?? అని ప్రశ్నించిన ప్రశాంత్…. అసోంటి ఎంపీనీ మీరు ఎన్నుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంపీ గా కవిత ఉన్నప్పుడు ఎంతో మందికి సీఎం సహాయ నిధి కింద ఆదుకున్నారని గుర్తు చేశాడు.తను ఓడిపోతే నష్టపోయేదేమీ లేదని, బిల్డింగులు కట్టుకుంటానని, సీఎం కేసీఆర్ ఓడిపోతే ఆయన కూడా కాపుదనపోడు కాబట్టి వ్యవసాయం చేసుకుంటాడని, కానీ ఇక్కడ బీజేపీ వస్తే ఎంత మోసపోతామో తెలివి తెచ్చుకుని మసలు కోవాలని ప్రజలకు హితవు పలికాడు ప్రశాంత్ రెడ్డి.