అల్లారుముద్దుగా పెంచిన చిన్న కూతురు ఆమె. అందరి పెళ్ళిళ్లు అయిపోయాయి. ఆ కుటుంబంలో ఇది చివరి పెళ్లి. అంగరంగ వైభవంగా చేయాలని ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. పెళ్లి రోజు రానే వచ్చింది. అదే రోజు ఆ తండ్రికి బీపీ ఎక్కువై ఆసుపత్రి పాలయ్యాడు. ఇక మళ్లి తిరిగి రాలేదు. అక్కడే తనువు చాలించాడు. సాయంత్రం వివాహానికి ముహూర్తం ఉండగా మధ్యాహ్నం ఆ తండ్రి కన్నుమూశాడు. కళ్లారా కన్న కూతురు పెళ్లి చూడాలనుకుని కలలను కన్న ఆ తండ్రి కానరాని లోకాలకు కనుమరుగయ్యాడు. ఎన్నో కలలతో వివాహా బంధంలో అడుగిడేందుకు ముస్తాబైన పెళ్లి కూతురు తండ్రి లేడనే వార్త తెలిసి గుండె పగిలినంత పనైంది. ఓ వైపు కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు శుభలగ్నం సమీపించిన ఆనంద గడీయాల్లోనే కన్న తండ్రి ఇక లేడనే విషాదం చోటు చేసుకోవడం అందరినీ కన్నీరు పెట్టిచ్చింది. ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన గూడూమియా (50) చిన్న కూతురు టభాసుమ్ పెళ్లి ఈ రోజు సాయంత్రం బాన్సువాడలో సాయంత్రం జరగాల్సి ఉంది. కానీ గూడూమియాకు బీపీ ఎక్కువ కావడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఆయనక్కడే తనువు చాలించాడు. ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాడు.