Dandugula Srinivas
తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు.. పుట్టనేమీ వాడు గిట్టనేమీ….! వేమన శతకం తాత్పర్యం ఇక్కడ మార్చబడింది. పిల్లలను కనడం, ఎవరి బిజీ లైఫ్‌లో వారు గడపటం. పొట్ట చేతబట్టుకున్న వాడి నుంచి కోట్లకు పడగలెత్తేందుకు పరుగులెత్తే వారి దాకా అంతా అదే తీరు. కనడం, వదలియేడం. ఏమన్నా అంటే పిల్లల్ని కన్నందుకు పెంచుతున్నాం కదా. చదవిస్తున్నం. బట్టలు కొనిస్తున్నం. తిండిపెడుతున్నం. ఏదో మా తాహతుకు దగ్గట్టు మేము పెంచుతున్నామండీ.. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు…! ఇదే అంటారంతా. అది ఏ కేటగిరీ అయినా. ఒక పట్టాన తమ తప్పొప్పుకోరుగా. అందరూ అంతే. అందులో మనమూ ఉన్నాం. కాదనలేం.
మనం కన్న పిల్లలు పెరుగుతుంటే జరిగే పరిణామాలేమిటీ? మారుతున్న కాలం తగ్గట్టు తెలియకుండానే పిల్లల్ని చెడగొడుతున్న పరిస్తితులేమిటీ? ఇవి తెలుసుకోం. చదవుకున్నవాళ్లే కాదు. చదవులేని వాళ్లు. పేదవాళ్లు వీళ్లు వాళ్లు అని కాదు అంతా ఇందులోనే ఉన్నారు. అందరినీ కలపడం ఎందుకో తెలుసా…? అందరి చేతులోనూ ఓ స్మార్ట్‌ఫోన్ కంపల్సరీ కాబట్టి. అందులో అన్‌లిమిటెడ్ డాటా శరవేగంగా , యమ స్పీడుగా మెదళ్లను తొలిచే పురుగులా పనిచేస్తుంది కాబట్టి. అందుకే ఇందులో వాళ్లు వీళ్లు అనే తేడా లేదు. అంతా అవే జాతు పక్షులు. అందరూ ప్రమాదం అంచున ఉన్న మనుషులే. పెరుగుతన్న పిల్లలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనించి, వారిని కంట్రోల్‌లో పెట్టకపోతే అది మంది పాణాలు తీసే వరకు తెలియదు.
మొన్నటి వరకు ఎంత అమాయకంగా ఉన్న నా కొడుకునే ఇలా చేసింది…? నా బిడ్డెనా ఇంతటి ఘాతుకానికి పాల్పడింది…? అని నోరెళ్లబెట్టడం తప్ప చేసేదేముండదు. ఆ తరువాత కూడా పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. ఎందుకంటే అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది కాబట్టి. సహస్ర మర్డర్ కేస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ఓ పదో తరగతి పోరడు.. పట్టుమని పదహారేండ్లు కూడా నిండని బాలుడు.. మరో మైనర్ అమ్మాయి దారుణంగా చంపేదాక పోయిండంటే.. ఆ నేర ప్రవృత్తిని పెంచిపోషించింది నిత్యం చేతిలో ఉండే ఆ స్మార్ట్ ఫోన్. ఆ స్మార్ట్ ఫోన్‌లో సులువుగా, విరివిగా దొరికే సినిమాలు.
దీన్ని అంత విచ్చలవిడిగా, స్వేచ్చగా చూసేందుకు అనుమతిచ్చిన తల్లిదండ్రులు.. వాడిపై నిఘా పెట్టి చూడలేని ఆ పేరెంట్సు. కొడుకు ఏం చేస్తున్నాడో వారి ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించకుండా తమ ఉరకుల పరుగుల జీవితంలోనే బతుకుతూ .. పిల్లల బతుకులు కళ్లముందే నాశనమవుతున్నా పట్టించుకోని అమ్మానాన్నలు. తాము పెంచిన ఆ మొక్కే పిచ్చికుక్కై పక్కోళ్ల ప్రాణాలు తీసే దాకా పోతుందని అంచనా కూడా వేయలేని వెర్రిబాగుల మమ్మీడ్యాడీలు.
ఇప్పుడు న్యాయం జరగాలంటున్నాం. ఎన్ కౌంటర్ చేయాల్సిందేనని రోడ్డెక్కుతున్నాం. పోలీసుల గల్లా పట్టుకుని అడిగి కడిగేస్తున్నాం. కానీ ఇంకా మనం తెలుసుకోలేకపోతున్నాం.. ఇది ఎన్‌కౌంటర్లతో ముగిసే దారుణాలు కావని. హంతకుడి ప్రాణాల తీయడమే న్యాయమనే కసి తీరినంత సులువు కాదని. ఎన్ని ఎన్‌కౌంటర్లు చేసినా ఇది మారదని. మారాల్సింది మనం. మన పెంపకం. పిల్లల ప్రవర్తనపై మన ప్రభావం. మొక్కై వంగనిది మానై వంగునా..?
Dandugula Srinivas
Senior Journalist
8096677451

