ఖజానా ఖాళీ అయ్యింది. నెల నెలా జీతాలు కూడా టంచన్‌గా ఇవ్వలేని పరిస్థితి. ఇది చాలా రోజులుగా ఉంది. పరిస్థితి నానాటికీ దిగజారుతూనే ఉంది గానీ మెరుగు పడటం లేదు. ప్రతీనెలా ఉద్యోగుల జీతాలు విడతల వారీగా జిల్లాలకు విడుదల చేస్తున్నారు. కొన్ని జిల్లాలకు మొదట… ఆ తర్వాత మరికొన్ని జిల్లాలు.. ఆ తర్వాత ఇంకొన్ని ఇలా నెలా పొడువుగా జీతాలు వేస్తూ మొత్తానికి ఆ నెలాఖరు వరకు జీతాలిచ్చేస్తున్నారు. ఎప్పుడు జీతాలు పడతాయో.. వారి జిల్లా ఎన్నో విడతలో ఉందో ఎవరికీ తెలియదు. వేచి చూడాలంతే. ఇప్పుడు ఇదే పరిస్థితి ఆసరా పింఛన్లకు వచ్చింది.
ఇంతకు ముందు ఆసరా పింఛన్లు ఒక నెల ఆపుకునేది. ఇంకోనెలది కూడా ఆ ఆఖరున ఇచ్చేవారు. ఇప్పుడు అదీ లేదు. రెండు నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఆసరా పింఛన్లు అకౌంట్లో క్రెడిట్ కాలేదు. దీనికి కారణం.. జీతాల మాదిరిగానే వీటినీ జిల్లాల వారీగా విడతల వారీగా పంపుతున్నారట. పైసల్లేక. దీంతో ఆసరా కూడా మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే కొత్త పింఛన్లు ఆగస్టు నుంచి ఇస్తామని కేటీఆర్ ప్రకటించి ఉన్నాడు. కానీ అది ఇంత వరకు అతీగతీ లేదు. ఇప్పట్లో అవి వచ్చేలా కూడా లేవు. ఉన్న పింఛన్లే రెండు నెలలు ఆలస్యంగా వస్తున్నాయి. ఎప్పుడు ఆసరా మొత్తం అకౌంట్లో పడుతుంతో తెలియక కొందరు.. కొత్తవి ఎప్పుడిస్తారో అని ఆశగా మరికొందరు ఎదురుచూస్తున్నారు.
