ఈట‌ల ఓ బ‌చ్చా.. చాలా చిన్న‌వాడు. వాడితో వ‌చ్చేది లేదు.. స‌చ్చేది లేదు. అని చాలా తేలిక‌గా హుజురాబాద్ ఎల‌క్ష‌న్‌ను తీసి పాడేశాడు కేసీఆర్‌. కానీ పైకి చెప్పినంత, మాట్లాడినంత ఈజీగా మాత్రం తీసుకోవ‌డం లేదు. పైకి మాట్లాడే మాట‌లు మేక‌పోతు గాంభీర్య‌మేన‌ని తేలిపోయింది. శ‌క్తివంచ‌న లేకుండా ఆయ‌న శ‌క్తుల‌న్నీ ఏకం చేస్తున్న వైనం విస్తుగొలుపుతున్న‌ది. త‌న ప‌ట్ల త‌న‌కున్న అభ‌ద్ర‌త భావాన్ని ప‌ట్టిస్తున్న‌ది. ఈ ఎన్నికలో విజ‌యాన్ని కేసీఆర్ ప్ర‌గాఢంగా ఆకాంక్షిస్తున్నాడు. ఆ గెలుపు కోరిక హ‌ద్దులు దాటింది. ఎంత వ‌ర‌కంటే.. ఏ చిన్న శ‌క్తిని, స‌హాయాన్ని కూడా ఆయ‌న వ‌దులుకోద‌లుచుకోవ‌డం లేదు. దీని పై కొంద‌రు మేథావులు త‌మ‌దైన భాష్యాన్ని వ‌ల్లేవేస్తున్నారు. ఏ ఎన్నికైనా మేమింతే శ‌క్తుల‌న్నీ ఖ‌ర్చుచేశామంటున్నారు. ఓడిపోతామ‌ని అనుకున్న ఎమ్మెల్సీని గెలిచి చూపించ‌లేదా? అని కూడా స‌మ‌ర్థించుకుంటున్నారు. వాళ్ల‌కు తెలియ‌కుండానే మేం భ‌య‌ప‌డుతున్నాం..అందుకే ప్ర‌లోభాల‌ను న‌మ్ముకుంటున్నాం.. గెలిచి తీరుతున్నామ‌ని ప‌రోక్షంగా ఒప్పుకుంటున్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక రాక‌ముందే… ఇప్ప‌టి నుంచే అప‌సోపాలు ప‌డుతున్నాడు కేసీఆర్‌. త‌న‌పై త‌న‌కు అపార‌మైన విశ్వాసం. త‌ను ఏదైతే వ్యూహం ప‌న్నుతాడో.. ఓ ప్ర‌ణాళిక ర‌చిస్తాడో దానికి తిరుగుండ‌ద‌నుకుంటాడు. కానీ ఇక్క‌డ అ మాట‌ల గార‌డీలు న‌డ‌వ‌డం లేదు. సోష‌ల్ మీడియాలో నిల‌దీత‌ల ప‌ర్వం… ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర‌లు కొన‌సాగుతున్నాయి. మేథోమ‌థ‌నం జ‌ర‌గుతున్న‌ది. భ‌యం లేదంటూనే కేసీఆర్ ప్ర‌ద‌ర్శిస్తున్న మేక‌పోతు గాంబీర్యాన్ని అంద‌రూ ప‌సిగ‌డుతున్నారు.

ద‌ళిత బంధును కూడా ఇక్క‌డ నుంచే పైల‌ట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తా… ఏం మాకు రాజ‌కీయ ల‌బ్ది జ‌ర‌గ‌కూడ‌దా? అని అహంకారంగా మాట్లాడి …ప‌లుచ‌న‌య్యాడాయ‌న‌. ద‌ళిత‌బంధు ప‌థ‌కం డొల్ల‌త‌న‌మే అనే రీతిలో ఆ విధంగా ఫ‌క్తు రాజ‌కీయ అవ‌స‌రాల‌ను మాట్లాడ‌టం వివాద‌స్ప‌ద చ‌ర్చ‌కు దారి తీసింది. దీనిపై ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఆ త‌ర్వాత నాలుక్క‌ర్చుకుని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో దీన్ని త్వ‌ర‌లో పైల‌ట్ ప్రాజెక్టు కింద అమ‌లు చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించాడు. కానీ దృష్టంతా హుజురాబాద్ మీదే.

ఉప ఎన్నిక‌ల ముందు భారీగా హామీలు గుప్పించ‌డం…. వ‌రాలు వెద‌జ‌ల్ల‌డం కేసీఆర్ కు అల‌వాటే. అవి అమ‌లుకు నోచుకుంటాయా..? మ‌నం ఎన్ని చూడ‌లేదు.? ఇలాంటి ప్ర‌శ్న‌లు కేసీఆర్‌ను చుట్టుముడుతున్నాయి. మాట మీద విశ్వాసం పోతున్న‌ది. న‌మ్మ‌కం స‌న్న‌గిల్లుతున్న‌ది. అందుకే ఇప్పుడు ఆ అగ్ని ప‌రీక్ష‌ను ఎదుర్కునేందుకు సిద్ధ‌ప‌డుతున్నాడు కేసీఆర్. ఇటీవ‌ల జ‌రిగిన నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో ఇచ్చిన హామీల అమ‌లు పై స‌మీక్ష జ‌రిపేందుకు వెళ్ల‌నున్నాడు.

అవును కేసీఆర్‌కు హుజురాబాద్ పాఠాలు నేర్పుతున్న‌ది.
నేర్చుకుంటాడా?
నేర్చుకున్న‌ట్టు న‌టిస్తాడా ? తెలియ‌దు.
ఒడ్డెక్కినంక బోడిమ‌ల్ల‌న్న అంటాడా? చూడాలి.