సర్కారు వారి పాట.. టైటిల్ కొత్తగా ఉండి ఆసక్తిని రేకెత్తించేదిగా ఉంది. కానీ పరుశురాం రాసుకున్న కథ యమ బోరింగ్, కంగాళీ, క్లారిటీ లేని సినిమాగా మిగిలిపోయింది. వరుసగా ఈ మధ్యన వచ్చిన భీమ్లానాయక్ నుంచి ఆచార్య వరకు….. పనికి రాని , పస లేని సినిమా లిస్టులోనే ఇదీ చేరింది. అసలు తెలుగు సినిమాలకు కథలు దొరకడం లేదో… డైరెక్టర్లు చెప్పిన కథలు హీరోలు ఎలా ఒప్పుకుంటున్నారో తెలియడం లేదు కానీ….. కథలో ఏమాత్రం బలం లేకుండా ఏదో కిచిడీ కథలు అల్లేసి ఓ రెండు పాటలు.. అర డజను ఫైట్లు పెట్టేసి, రక్తపాతంతో స్క్రీన్ నింపేసి… బూతు డైలాగులు చెప్పించేసి……… అవే ఇప్పుడు తెలుగు సినిమా కథలు. పైగా ఈ సినిమాలు చూడటానికి వందలకు వందలు పెట్టి మరీ పోవాలట. అందుకే చిరంజీవి సినిమా అయితే ఏందీ…. రాజమౌళి అయితే ఏందీ…? మహేశ్ బాబు సినిమా అయితే మాకేందీ….? అని మొదటి రోజే సినిమా థియేటర్లలో సీట్లు ఖాళీగా వెక్కిరిస్తున్నాయి. అయినా మనవాళ్లు మారరు. ప్రేక్షకులు ఎప్పుడో మారార్రా బాబు…. అని మొత్తుకున్నా.. అవే పాతచింతకాయ పచ్చడి ఫార్మూలా సినిమాలే. వాటిని తీసేసి అలా ముఖాన కొట్టేసి……. ఎర్రటి ఎండలో మీ చావు మీరు చావండ్రా అనేస్తున్నారు.
ఇక సర్కారు వారి పాట సినిమా కథకు వస్తే…. బ్యాంకుల చుట్టూ తిప్పాడు.లోన్ రికవరీ పేరుతో బ్యాంకుల దోపిడీని ఎండగడ్దామని అనుకున్నట్టున్నాడు ఆవేశంగా పరుశురాం. కానీ కథ కంట్రోల్ తప్పి ఎక్కడో లోయలో పడి పోయి కనబడకుండా పోయింది. ఫస్ట్ ఆఫ్‌లో డబ్బే లోకంగా బతికిన హీరో…. ఆ తర్వాత బ్యాంకుల దోపిడీ, తన తల్లిదండ్రులు చనిపోవడాన్ని గుర్తు చేసుకుంటూ ఏవేవో నీతి సూత్రాలు…… పూర్తి కాంట్రాస్టు… ఇక్కడ బ్యాంకులు దోచుకున్నట్టే … అక్కడ అమెరికాలో వడ్డీ వ్యాపారం పేరుతో హీరో తుక్కు తుక్కు కింద కొట్టి మరీ వసూలు చేస్తాడు. హీరోయిన్ తన వద్ద తీసుకుని మోసం చేసిన పదివేల డాలర్ల కోసం ఇండియాకు వచ్చి…… ఇక్కడ బ్యాంకు దోపిడీపై పోరాడుతాడన్నమాట. ఇందులో కొన్ని ట్విస్టులు… ఏదో చెప్పబోయి.. ఏదో చెప్పి.. ఏదీ సరిగా చెప్పలేకపోయాయని చేతులెత్తేశాడు పరుశురాం. మాటలు కూడా సారే రాశాడంట. మాట్లాడితే బొక్క అన్నాడు. బొక్క అతని ఊతపదమేమో. హీరోయిన్ పై చేయి చేసుకోవడమే కాదు.. కాలు కూడా లేపుతాడు.. అదీ ఈ సినిమాలో డెవలప్మెంట్. పూరీ మార్క్ సినిమాల్లో హీరోలు ఇట్లనే చేస్తరు కదా… అందుకే మహేశ్ ఇది మరో పోకిరీ అన్నట్టున్నాడు.
ఇద్దరి మధ్య ప్రేమ చిగురించే సీన్లు మరీ జుగుప్సాకరం. హీరోయిన్‌పై కాలేసి పడుకునే సీన్లు కడుపులో దేవినట్టుగా రోత పుట్టించేవిగా ఉన్నాయి. పాపం…. కీర్తి సురేశ్… ఎక్కడి మహానటి… ఎక్కడి సర్కారు వారి పాట. ఓ వ్యాంపు పాత్ర కన్నా ఘోరం. ఆ తమిళ విలన్ యాక్టింగ్‌ను వాడుకునే తెలుగు డైరెక్టరే లేకుండా పోయాడు. అడ్డమైన పాత్రలిచ్చి అతని నటనను పదిశాతం కూడా వాడుకోలేని దౌర్బాగ్యులు మనోళ్లు. మన డైరెక్టర్లు కథలు రాసుడు మానుకుంటే మంచి కథలు వస్తాయేమో. మీ ముఖాలు మండ… మీకు డైరెక్షనే సక్కగ రాదు.. పైగా మీరే కథలు రాసుకోవడం….. ఆ హీరోలకు బుద్ది మోకాళ్లలోకి జారుకుంటున్నట్టున్నది వాళ్లు వాటిని ఒప్పుకోవడం.. సరిపోయింది ఇద్దరికీ… మధ్యలో ప్రేక్షకుడు బలి.
