ముందు ఊహించినట్టే జరిగింది. కథ ఎంపిక జరిగినప్పుడే ఇదేదో చరిత్ర వక్రీకరణ జరుగుతోందని అనిపిచింది. అచ్చంగా అదే చేసి కూర్చున్నాడు రాజమౌళి. కొమరం భీం… అల్లూరి సీతారామారాజు ల చరిత్రను బేస్ చేసుకుని.. దానికి కల్పితం అని ఓ సాకు జోడించి.. చరిత్రను వక్రీకరించి… ఇద్దరు హీరోలకు సమ ప్రాధాన్యత ఇచ్చేందుకు కిందామీదా పడి కథను కిచిడీ కిచిడీ చేసి అలా గ్రాఫిక్స్‌లతో అయిందనిపించి జనాలకు మీదకు వదలాడు.
కొమరం భీం( ఎన్టీఆర్)ను ఓ పిరికివాడిగా .. ఓసారి ధీరో దాత్తుడిగా.. బాంచన్ దొర అని అతని నోటి వెంట డైలాగులు పలికించి కథ రాసిన విజయేంద్ర ప్రసాద్, తీసిన డైరెక్టర్లకు ఏ మాత్రం అవగాహన లేదని తేల్చేసుకున్నారు. హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ఆదిలాబాద్ గోండుల నాయకుడు కొమరం భీంకు బ్రిటీషులకు అస్సలు సంబంధం లేదు. అది చరిత్ర. కొమురం భీం పోరాడింది. నిజాం అక్రమాలపై , దౌర్జన్యాలపై . కానీ ముందే కథ కల్పితం అన్నారు కాబట్టి…. ఏకంగా బ్రిటీష్ పరిపాలనలోకి ఈ పాత్రను తీసుకుపోయాడు రాజమౌళి. అదీ…. ఓ చిన్నపిల్లను బ్రిటీషు ప్రభువు తీసుకుపోయాడనే కారణంతో. ఆ అమ్మాయిని తీసుకురావడం కోసం కొమురం భీం ఢిల్లీ వెళ్తాడు. ఈ పాత్రను ఎలా మలచాలో తెలియక.. పాపం రాజమౌళి నానా తంటాలు పడ్డాడు. పిరికివాడిలాగా చిత్రీకరించాడు. బ్రిటీష్ కొలువులో పోలీసుగా ఉన్న సీతా రామారాజు ( రాం చరణ్)ను మొదట నెగిటివ్ షేడ్‌లో చూపాడు. అతని అంతిమ లక్ష్యం….. ఆయుధాలను అందరికీ పంచాలి..బ్రిటీష్ సైన్యాన్ని చంపాలి.. స్వాతంత్య్రం సాధించాలి. అందుకోసం బ్రిటీష్ రాజు దగ్గర మంచి పేరు సంసాదించేందుకు దేనికైనా వెనుకాడడు. కొమురం భీంను పట్టుకునే పనిని నెత్తికెత్తుకుంటాడు. ఈ ఇద్దరి మధ్య దోస్తానా కుదిర్చేందుకు అల్లుకున్న సీన్లకు అంత సీన్ లేదు. నాటు నాటు పాట సందర్భానికి ఏ మాత్రం అతికినట్టు లేదు.
పాప కోసం మాత్రమే కొమురం భీం పోరాడతున్నాడనే ఫీలింగ్ కల్పించాడు రాజమౌళి. ఆ తర్వాత నిజం తెలుసుకుని అతన్ని బ్రిటీష్‌ల చెర నుంచి విడిపించేందుకు పోరాడుతాడు. కొమురం భీం పాత్రను ఈ సినిమాకు వాడుకోవడానికి మాత్రమే పనికి వచ్చింది డైరెక్టర్‌కు. అల్లూరి సీతారామరాజు పాత్రను ఆకాశానికెత్తేందుకు కొమురం ఓ పావుగా ఉపయోగపడ్డాడు అంతే. అంతగా చరిత్ర వక్రీకరణ జరిగింది. సీన్లు రిచ్‌గా ఉన్నా.. చాలా చోట్ల తేలిపోయాయి. గ్రాఫిక్స్ కూడా మరీ పేలవంగా కనిపించింది చాలా చోట్ల. ఏ ళ్ల తరబడి సినిమా తీసి తీసి… క్లారిటీ మిస్ అయ్యి…. ఏదో లాగించేద్దాం.. ముగించేద్దాం అనే రీతిలో చాలా చోట్ల డైరెక్టర్ తడిబడిన తీరు పెద్ద మైనస్.
