సునామీ.. నా రిపోర్టింగ్ జీవితంలో మరిచిపోలేని సంఘటనల్లో ఒకటి. సునామీ అలల ప్రతాపాన్ని ప్రత్యక్షంగా చూడడం జీవితంలో మరిచిపోలేనిది. 2004లో నేను విజయవాడలో పనిచేస్తున్న. ఇలాగే.. ఆ రోజు కూడా ఆదివారం. ఉదయం 8 గంటల ప్రాంతంలో అప్పటి జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ (ఇప్పుడు కేంద్ర సర్వీసులో ఉన్నట్టున్నారు) అదే పనిగా ఫోన్ చేస్తున్నారు. ఆయన క్రిస్మస్ ఉండడంతో సొంత ఊరికి వెళ్లారు.
సెలూన్‌లో ఉన్న నేను ఫోన్ ఎత్తడంతోనే చాలా కంగారుగా తనకు కేంద్ర ప్రభుత్వం నుంచి హెచ్చరికలు వచ్చాయని.. ఏదో సునామీ అనేది వచ్చిందని, బందర్‌లోని బీచ్ ప్రాంతాన్ని, చుట్టూ ఉన్న పల్లెకారుల గ్రామాలు మునుగుతున్నాయని చెప్పారు. సునామీ అంటే మొదట అర్థం కాలేదు. దీంతో సముద్రం ముందుకు వస్తున్నది. చాలా గ్రామాలను ఇప్పటికే సముద్రం నీళ్లు తాకుతున్నాయని చెప్పారు. ఇంకా చెప్పేదేముంది.. నిమిషాల్లో బెంజ్ సర్కిల్‌లోని ఆఫీసుకు చేరుకోవడం, అప్పటి ఈటీవీ రిపోర్టర్‌గా మూర్తిగారు ఉండేవారు. ఆయన, నేను కెమెరామెన్లను తీసుకోని ముందు వెనుక ఆలోచించకుండా మచిలీపట్నం చేరుకున్నాం. ఈలోగా అప్పటి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడుతూ పరిస్తితులు తెలుసుకున్నాం. ఆయన కూడా మేం వెళ్లేసమయానికే బందర్‌లోని మంగినపూడి బీచ్‌కు వచ్చారు.
బీచ్ సమీపంలోని దత్త మందిరానికి వచ్చిన భక్తుల్లో కొందరిని సముద్రం తనలోకి తీసుకుపోయిందన్నారు. ఇంకా సముద్ర ఉగ్ర రూపం తగ్గలేదు. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిగారితోపాటు మేమంతా అక్కడ ఉన్న లైట్ హౌజ్ వద్దకు చేరుకున్నాం. లైట్ హౌజ్ ఎక్కి నిలబడ్డాం. ఒక అరగంట- గంట తర్వాత చూస్తే సముద్రంలో శవాలు తేలాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ప్రాణనష్టం మచిలీపట్నంలోనే జరిగింది. ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ, అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్ .రాజశేఖర్ రెడ్డి, ఎల్ కె అద్వానీ, చంద్రబాబునాయుడు, కేంద్ర, రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు.. ఒక్కరేమిటి వందల మంది వీవీఐపీలు వచ్చారు. ఈనాడు తరఫున ఒక్కడినే రిపోర్టర్‌ను, ఆ రోజు ప్రత్యేక సంచిక ఇచ్చాం. నాకు గుర్తున్నంతలో వివిధ కోణాల్లో 40కిపైగా వార్తలను రిపోర్ట్ చేశాను.
అప్పుడు మచిలీపట్నం స్టాఫ్‌రిపోర్టర్‌గా ఉన్న టీడీ ప్రసాద్ గారు (ఇప్పుడు రిటైర్ అయ్యారు) క్రిస్మస్ ఉండడంతో సెలవుపెట్టి సొంతూరుకు వెళ్లారు. నాతోపాటు విజయవాడలో ఉన్న పారెపల్లి వెంకటేశ్వరరావు ఆదివారం కావడంతో ఆయన కూడా సొంతూరుకు వెళ్లారు. దీంతో లోకల్ రిపోర్టర్ల సహాయంతో అంత పెద్ద కల్లోలాన్ని కవర్ చేశా. ఆకాశమంత ఎత్తుకు ఎగురుతున్న సముద్ర అలలు 17 ఏళ్ల తర్వాత ఇప్పటికి గుర్తుకు వస్తుంటాయి. బందర్ బీచ్‌లో శవాలతో భీతావాహ పరిస్తితి, బాధితుల ఆక్రందనలు చెప్పనలవి కావు. అదో పీడ. ఆ రోజు 30 మందికిపైగా అక్కడ చనిపోయారు. అలాంటి విషాదం మరోసారి రావద్దని కోరుకుందాం. విలేకరిగా నా జీవితంలో అతిపెద్ద కవరేజీ ఇదే.
Satish Voruganti