కొన్ని పెళ్లీళ్లు అంతే. చూడ ముచ్చ‌ట‌గా ఉంటాయి. కళ్ల ముందు క‌ద‌లాడ‌తాయి. స్మృతి ప‌థం నుంచి తొలిగిపోవు. మ‌ధుర జ్ఞాప‌కాలుగా మిగిలిపోతాయి. హంగూ ఆర్బాటం.. కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చు.. ఇవేవీ వీటి ముందు స‌రితూగ‌వు. పెద్ద మ‌న‌సు కావాలి. బంధాల‌ను మ‌రింత బ‌లంగా తీర్చిదిద్దే సంక‌ల్పం ఉండాలి. సంప్ర‌దాయాలకు అవి ఊత‌మివ్వాలి. భావిత‌రాల‌కు ఒక సందేశాన్నివ్వాలి.ఇదిగో ఇలా..

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండ‌లం బ‌ట్టుతండాలో లావ‌ణ్య‌-రూప్ సింగ్‌ల వివాహ పందిరి కోట్లాది రూపాయ‌లు వెచ్చించినా రాని అనుబంధాలను పెన‌వేసుకున్న‌ది. వివాహ బంధం పెన‌వేసుకుని.. అల్లుకుని క‌ల‌కాలం ఉండిపోవాల‌నే ఆలోచ‌నా సంక‌ల్పానికి ఇది నిలువెత్తు.. కాదు కాదు.. ఆకాశ‌మంత పందిరి. పెళ్లికి వారం రోజుల ముందే పెళ్లి పందిరి వేసే స్థ‌లంలో పెద్ద‌లు మ‌ట్టితో గ‌ద్దెను త‌యారు చేసి … గ‌ద్దె చుట్టూ గోధుమ‌లు అలికి నీళ్లు పోశారు. ఇవి పెళ్లి నాటికి మొల‌క‌లు వేశాయి. కొత్త బంధాలు చిగురించాయ‌ని చూచాయిగా చెప్పిన‌ట్టుగా.. ప‌చ్చ‌గా చుట్టూ క‌నువిందుగా క‌నిపించాయి. ఇంకా ఇలాంటి సంప్ర‌దాయాలు బ‌తికే ఉన్నాయ‌ని ఈ దృశ్యం చెబుతున్న‌ది. ఈ ఫోటోను క‌నిపెట్టి క్లిక్‌మ‌నిపించిన కామారెడ్డి సాక్షి స్టాఫ్ రిపోర్ట‌ర్ వేణుగోపాల చారి సేపూరి కి అభినంద‌న‌లు…

You missed