హైదరాబాద్‌లో బుక్ ఫెయిర్ నడుస్తుంది. పుస్తక పఠనం ఆసక్తి ఉన్నవాళ్లు వెళ్తున్నారు. కొంటున్నారు. కొందరు సెల్పీలు దిగుతున్నారు. ఇంకొందరు బుక్ ఫెయిర్ కు పోవడం ఓ స్టేటస్‌గా భావిస్తున్నారు. నేనూ పోయానోచ్.. అని ఓ సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ పుస్తకాలు కొనేవారి ఏజ్ గ్రూప్ చూస్తే అంతా నలభైకి పైబడిన వారే.. వీళ్లూ చాలా తక్కువే. యాభై.. అరవై… ఇలా వయస్సులో పెద్దవాళ్లు మాత్రమే పుస్తకాలు చదివే అలవాటుతో ఇంకా ఉన్నారు. ఈ తరం పుస్తకాలు చదవటం ఏనాడో మానేసింది. బుక్ రీడింగ్ ఆసక్తి పూర్తిగా తగ్గింది.
సెల్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. అంతా అందులోనే. అవీ పనికొచ్చే చదవు కాదు.. ఫేస్‌బుక్కు.. సోషల్ మీడియాలో గంటల తరబడి మునిగిపోవడం. ఇక పుస్తకాలు చదవడం ఎవరికి కావాలి. కనీసం తెలుగు పేపర్లు చదివే అలవాటు కూడా లేదు ఈ తరానికి. పోనీ తెలుగు చదవడం లేదు.. ఇంగ్లీష్ పేపర్లు చదవుతారా..? అంటే అదీ లేదు. అసలు ఈ కరోనా దెబ్బకు ఇంటికి పేపర్లు వేయించుకోవడమే మానేశారు.
ఈ పేపర్లు చదివే వారు కూడా కొంత శాతమే. ఇప్పటి యువత మాత్రం ఇటు పత్రిక పఠనమే కాదు.. పుస్తక పఠనమూ చేయడం లేదు. అది మన పని కాదు అన్నట్టుగానే చూస్తున్నది. ఎవరు మీలో కోటిశ్వరులు ప్రోగ్రాంలో పాల్గొనే యూత్‌ను గమనిస్తే.. కొన్ని కొన్ని జీకే క్వశ్చన్‌లకు కూడా సరిగా సమాధానం ఇవ్వలేక లైఫ్‌లైన్‌లపై ఆధారపడుతున్నారు. రోజులు గడుస్తున్నా కొద్దీ ఈ పుస్తకాలు చదివే అలవాటు మరింత దూరమయి.. ఆ చదివే వారి సంఖ్య మరింత కుదించుకుపోయి.. పఠనాసక్తి కుంచించుకుపోయి.. మెదడు ఎదగడం మానేసి.. బుద్ది వికసించడం ఆగిపోయి… ఫోనే ప్రపంచంగా.. ఫేస్‌బుక్కే లోకంగా.. అదో లోకంలో అధోగతితో బతికే రోజులొస్తాయి కావొచ్చు.