పుష్ప….. ఓ వినూత్న కథ. అల్లు అర్జున్ ఈ కథను ఎంచుకోవడంతోనే సగం సక్సెసయ్యాడు. హీరోయిజం పేరుతో ఇమేజీ చట్రంలో ఇరుక్కోలేదు. ఇలాంటి కథలే తెలుగు సినిమాలకు కావాల్సింది. ఇలాంటి భిన్నమైన కథలే హీరోలు ఎంచుకోవాల్సింది. రంగస్థలంలో హీరో రామ్ చరణ్ పాత్ర కూడా అతని హీరోయిజాన్ని పెంచింది. సేమ్ అలాంటి భిన్నమైన కథే ఈ పుష్ప. ఇలాంటి కథలను ప్రముఖ హీరోలతో ఒప్పించి తీయడంలో డైరెక్టర్ సక్సెసయ్యాడు. బహుశా ఈ డైరెక్టర్ పై ఉన్న నమ్మకంతోనే ఆ హీరోలూ ఒప్పుకుని ఉంటారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో అల్లుకున్న కథ. సూర్య తమ్ముడు కార్తీ నటించిన ఖైదీ సినిమాలా ఈ పుష్ప స్క్రీన్ ప్లే అక్కడక్కడా ఆకట్టుకున్నది. పాత దుస్తులు, ఓ కూలీ అవతారం. మాసిన గడ్డం.. మేకప్‌లేని ఫేసు… అదిరిపోయే నటన. దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ నుంచి కావాల్సినంత నటనను పిండుకున్నాడు. డ్యాన్సులకు పెద్దగా అవకాశం ఇవ్వలేదు. ఫైట్లు కూడా అవసరమున్నంత మేరకు పెట్టుకున్నాడు.
రంగస్థలం మార్కు సెంటిమెంటు, పట్టు సడలని కథనం కనిపించాయి. హీరోయిన్ రష్మికను రంగస్థలంలో సమంతాలా చూపాలనుకున్నాడు. కానీ కుదలేదు. మేకప్ లేకపోవడంతో జీవం లేని బొమ్మలాగే ఉండిపోయింది రష్మిక. గ్లామర్ డాల్‌లా పనికొచ్చింది. పెద్దగా నటనకు అవకాశం దొరకలేదు.వీరిద్దరి ప్రేమ సీన్లు మరీ వల్గర్‌గా తీశాడు. రోమాన్స్ కూడా ఎబ్బెట్టుగానే ఉంది. ప్రధాన విలన్లుగా చూపిన కొండారెడ్డి, మంగళం శ్రీను ఇద్దరూ కథలో పెద్దగా సెట్ కాలేదు. మంగళం శ్రీను పాత్రలో నటించిన సునీల్‌ను ప్రేక్షకులు అంత పెద్ద సీరియస్‌గా తీసుకున్నట్టు అనిపించేదు. సునీల్ భార్యగా అనసూయ కొద్ది సేపే కనిపించినా ఇచ్చిన పాత్రకు న్యాయం చేసింది.
సుక్కు మార్కు డైలాగులు, ట్విస్టులు, సస్పెన్సులు బాగానే ఆకట్టుకున్నాయి. క్లైమాక్స్ చివరి వరకు కథ సో సో గానే నడిచింది. క్లైమాక్సులో ఎస్పీగా ట్రాన్స్ ఫేమ్ ఫహాద్ ఫాజిల్ ఎంటరయిన తర్వాత కథ కొత్త మలుపు తిరుగుతుంది. హీరోను ఫాజిల్ ఆడుకున్న తీరు.. హీరో ఇబ్బంది పడే సన్నివేశాలు బాగా వచ్చాయి. చివరలో ఫాజిల్‌పై హీరో ప్రతీకారం తీసుకునే సన్నివేశం సస్పెన్సు మధ్య నడిచింది. ఇక్కడ డైలాగులు బాగా వచ్చాయి. ప్రతీ సీన్‌లో డైరెక్టర్ ఏం చూపుతాడు..? ఏం చెబుతాడు..? అనే సస్పెన్సును కంటిన్యూ చేయడంలో సుక్కు సక్సెసయ్యాడు.
హీరోయిన్‌ను తన వద్దకు ఒక రాత్రి రావాల్సిందిగా విలన్ బెదిరిస్తాడు. లేకపోతే తండ్రిని చంపుతానంటాడు. అప్పటి వరకు హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ చిగురించే సన్నివేశాల జోలికి వెళ్లని డైరెక్టర్…. ఇక్కడ హీరోయిన్ .. హీరో ఇంటికి వెళ్లి ప్రేమను వ్యక్తం చేసేలా చేయడం ఎబ్బెట్టుగా ఉంది. కథలో ఇది బలవంతంగా జొప్పించారనిపించేలా ఉంది.
కామెడీ కథలో భాగంగా కలిసిపోయింది. పంచు డైలాగులతో కామెడీ పండించాడు సుకుమార్. అవన్నీ సందర్బానుసారంగా పేలినవే. పాటలు ఒకట్రెండు తప్ప.. పెద్దగా ఆకట్టుకోలేదు. మ్యూజిక్ కూడా అన్ని పాటలకు బాగా కుదరలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
రెండో పార్టు కోసం పెట్టిన ట్విస్టు కూడా బాగానే కుదిరింది. ఫాజిల్ పగతో రగిలిపోతూ ఉంటాడు. హీరో కథ ఇప్పుడే మొదలైంది అని అంటాడు. ప్రేక్షకుల్లో రెండో పార్టు కోసం ఇంట్రస్ట్ పుట్టేలా చేశారిద్దరు.