అది ఓ ప్రెస్‌మీట్‌. మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం.. ఇంకా కొంత మంది నేత‌లు కూర్చుని ఉన్నారు. మీడియా వాలింది. గొట్టాలు వ‌రుసగా పెట్టారు. అవి ప‌దుల సంఖ్య దాటి వంద‌ల‌కు చేరింది. బ‌జారులో కూర‌గాయ‌లు ప‌రిచిన‌ట్టు.. టేబుల్‌పై ఈ మూల నుంచి ఆ మూల వ‌ర‌కు యూట్యూబ్‌ల‌, చానెళ్ల గొట్టాల‌తో నిండిపోయింది. అప్ప‌టి వ‌ర‌కు మ‌న స‌బిత‌మ్మ అలాంటి సీన్ చూడ‌లేదు కావొచ్చు. ఆశ్చ‌ర్య‌పోయింది. నోరెళ్ల‌బెట్టింది. ఏంద‌య్యా ఇది.. ఏందిదీ.. అన్న‌ట్టు ముఖం పెట్టింది. చివ‌ర‌కు ఉండ‌బ‌ట్ట‌లేక అడిగేసింది కూడా ముందు వ‌రుస‌లో కూర్చుని మంత్రి గారి న‌జ‌ర్‌లో ప‌డేందుకు పోటీలు ప‌డుతున్న మ‌న విలేక‌రుల‌ను. ఏందీ ఇన్నిన్ని చానెళ్లా.. అన్న‌ది. మ‌న‌వాళ్లు గ‌ర్వంగా ఫీల‌య్యారు. అవును మేడం.. మ‌రేం అనుకుంటున్నారు.. మీడియా చైత‌న్యం వ‌ర్దిల్లాలి.. అన్న‌ట్టు ఓ లుక్కిచ్చారు. మెడ‌ల ప‌డ్డ పాము క‌రువ‌క మాన‌ద‌న్న‌ట్టు..ఈ పెరిగిన మీడియా అంతా మా మెడ‌కే క‌దా చుట్టుకునేది అనుకున్న‌ట్టున్న‌ది స‌బిత‌మ్మ‌. ఏం కామెంట్ చేయ‌లేదు. కామ్ అయిపోయింది.