మన హీరోలు ఇమేజీ చట్రంలో ఇరుక్కుపోయారు. ప్రయోగాలంటే ఆమడదూరం పారిపోతారు. కొత్త కథలంటే అవి మనకు సూట్ కావంటారు. అవే మూస కథలు. అవే పాటలు. అవే తైతక్కలు. అతీతశక్తుల ఫైట్లు.. ఇస్త్రీ నలగకుండా ఒంటి చేత్తో ఎంతో మందిని మట్టి కరిపించే అతిశయోక్త అరవీర భయంకర పోరాట దృశ్యాలు. ఇవీ మన తెలుగు సినిమా కథలు. మన పెద్ద హీరోలు ఎంచుకునే సినిమాలు. మరి ఇతర భాషల్లో అగ్ర హీరోలో ఎందుకు కొత్త కథలతో వస్తూ అలరిస్తున్నారు. ప్రయోగాలు చేస్తూ వారెవ్వా అనిపంచుకుంటున్నారు..? అది వారికలవాటే. మనకు అలవాటు లేదు. అంతే. మనం మనమే. వారు వేరే.
అంతే గానీ వాడెవ్వడో తీశాడని మనమెందుకు తీస్తాం. ఒకవేళ తీసినా.. మన నేటివిటీకి తగ్గట్టు.. మన ప్రేక్షకుడి టేస్ట్‌ను దృష్టిలో పెట్టుకుని .. మనకనుకూలంగా, అలవాటైన దోరణి కథను ఆ అనువాద కథను కూడా కిచిడీ చేసి అసలు కథకు ఈ కథకను అసలు సంబంధమే లేదనే విధంగా తయారు చేసే ఘనులు మన డైరెక్టర్లు, నిర్మాతలు. వకీల్ సాబ్ ఆ కోవలోనిదే. మొన్నటికి మొన్న జై భీమ్ సినిమా .. ఎంతో మంది ప్రశంసలందుకున్నది. హీరోనే నిర్మాత. ఆ సినిమాలో హీరోకు ఓ పాట లేదు. హీరోయిన్ లేదు.. ఫైట్ లేదు. కథే హీరో. అందరినీ ఆకట్టుకుని కన్నీరు పెట్టించింది. ఆలోచింపజేసింది.
ఇలాంటివి చూసి మనవాళ్లు ఓ శభ్బాష్.. భలే భలే . బాగుంది. అంటారు కానీ. అలాంటివి తీయరు. సాహసించరు. చేతులు కాల్చుకోవడం ఎందుకు… అని. దృశ్యం -2 సినిమా ఈ రోజు అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఫిబ్రవరిలోనే మళయాలం వెర్షన్ వచ్చింది. మోహన్‌లాల్ నటనకు పేరు పెట్టాల్సింది లేదు. అదే రేంజ్‌లో. … అంతకు మించి నటించి ఆకట్టుకున్నాడు వెంకటేశ్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కథల ఎంపికలో వెంకీ చేసుకుంటున్న మార్పు ఇతర హీరోలకు ఆదర్శం. మార్గదర్శకం కూడా. మల్టీ స్టారర్ సినిమాలు తీయాలంటే కూడా మన వాళ్లకు భయం. కానీ వెంకీ కి అలాంటి ఇగోలు లేవు. చాలా కథలే తీశాడు.
దృశ్యం -2 కథకు జీవం పోశాడు తన సహజ నటనతో. హీరో ఇంటే ఇలాంటి కథలు కూడా చేస్తాడు అని నిరూపించుకున్నాడు. మూలకథలో ఎలాంటి మార్పు లేదు. మళయాల వెర్షన్‌లో ఎలాంటి చేంజెస్ లేవు. అదే కథ. అదే స్క్రీన్‌ప్లే. అదే ఉత్కంఠ. అదే టెన్షన్…. ఎక్కడా బోర్ కొట్టని విధంగా తీసిన ఈ సినిమా ను తను ఓ పెద్ద హీరో అనే ఇమేజ్ చట్రం వదిలి నటించాడు వెంకటేశ్. అదే అతన్ని మరింత ఎత్తుకు ఎదిగేలా చేసింది. మన అగ్ర హీరోలు మరింత కుంచుంచుకుపోయి.. సిగ్గుపడేలా చేసింది.