బీసీ గణన చేయాలని కేసీఆర్ కోరాడు. ఎందుకు దీన్ని దాచడం అని నిలదీశాడు. బీసీ కులాల లెక్కలు తేలితే ఎవరికి ఏం న్యాయం చేయాలో తెలుస్తుందన్నాడు. బాజాప్తా కులం సర్టిఫికేట్లనే ప్రభుత్వం ఇస్తున్నది కదా.. ఇంకా దాపరికం ఎందుకు..? దాచడం ఎందుకు అని నిలదీశాడు కేంద్రాన్ని. బాగానే ఉంది. కేసీఆర్ పక్కోడికి నీతులు చెప్పమంటే చాలా బాగా చెప్తాడు. తనదాక వస్తే మాత్రం… తప్పించుకు తిరుగుతాడు. నీతులు మందికి వర్తిస్తాయి. మనకు కాదు. అన్నట్టుగా ఉంటుంది కేసీఆర్ వైఖరి. ఆనాడు ప్రబుత్వం ఏర్పడగానే సమగ్ర కుటుంబ సర్వే చేయించాడు కేసీఆర్.
అందులో కులాల వారీగా తెలంగాణలో ఎన్ని కుటుంబాలున్నాయో తేలిపోయింది. కులాల జనాభాపైనా ఓ క్లారిటీ వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఆ లెక్కలు కేసీఆర్ బయటపెట్టలేదు. అంత రహస్యంగా ఉంచాడు దాన్ని. దాన్ని ప్రజల ఉపయోగం కోసం కాకుండా తన రాజకీయ అవసరాల కోసమే వాడుకునేందుకు ఉపయోగించాడన్నమాట. ఆ లెక్కల ప్రకారం తెలంగాణలో ఏ కులానికి ఏం న్యాయం చేశాడో కేసీఆర్ ముందు చెప్పాలి.
పోనీ ఆ లెక్కలు ఇప్పుడు మారాయే అనుకుందాం. మరోసారి సమగ్ర కుటుంబ సర్వే చేపించు. ఒక్కరోజు కాకపోతే మూడు రోజులు టైం తీసుకో. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీల్లో ఏ కులాలు ఎన్ని ఉన్నాయి… వారి ఆర్థిక పరిస్థితి ఏందీ..? చదువు సంద్యలేంది..? ఉద్యోగాల కల్పన ఎలా ఉంది..? వ్యవసాయ భూములు ఎవరెవరికి ఉన్నాయి. కడు పేదరికంలో ఎన్ని కులాలున్నాయి. ..? బంగారు తెలంగాణ కోసం ఇవన్నీ తెలుసుకోవడం నీకు అవసరమే కదా కేసీఆర్.
కానీ కేసీఆర్ తెలుసుకోడు. అందరి నేతల్లాగే ఆయనకూ ఓటు బ్యాంకు రాజకీయాలే కావాలి. ఎన్నికలప్పుడు కులాల వారీగా తాయిలాలు ప్రకటించి ఓట్లేయించుకోవాలి. ఏ కులం బలంగా ఉంటే వారికి పదవులివ్వాలి. వారిని తమ వైపు తిప్పుకోవాలి.బీసీల్లో పేద కులాలు అలాగే ఉండాలి.వారిని పైకి తీసుకురావడంటే తలకు మించిన భారం కేసీఆర్‌కు. అంత తలనొప్పి పెట్టుకోడు. అందుకే సమగ్ర కుటుంబ సర్వే వివరాలు చెప్పడు.
కేంద్రంలోనైనా , రాష్ట్రంలోనైనా రాజకీయ నాయకులంతా ఒకేలా ఉంటారు. వారికి కావాల్సింది ఓటు బ్యాంకు రాజకీయాలు. ప్రజలు బాగుపడటం కాదు. వారిలో చైతన్యం రావటం కాదు. వాళ్లంతా అలాగే ఉండాలి. అడుక్కుతింటూ ఉండాలి. లీడర్లు వచ్చి ఏం వరాలిస్తారోనని వేచిచూస్తూ ఉండాలి. వారిని అలాగే ఉంచాలి. వీరిలాగే రాజ్యాలేలాలె.