జై భీమ్ సినిమాలో పడి ఎలెక్షన్ విషయం మర్చిపోయాను.హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయం పై అందరూ రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు.టీఆరెస్ , కేసీఆర్ ఓటుకు ఇన్నిన్ని వేలు పంచినా ఎందుకు ఓడారు..అసలు కారణం అందరికీ తెలిసినా బయటకు ఒప్పుకోని నిష్ఠుర సత్యం.కేసీఆర్ తలపెట్టిన ‘ దళిత బంధు ‘ పథకమే. ఆయన దళితులకు పదిలక్షల ఆశచూపించి దళితుల ఓట్లకు గాలం వెయ్యాలనుకున్నాడు.
డబ్బులు అకౌంట్లలో వెయ్యనందుకో , బ్యాలెన్స్ చూపి అకౌంట్లు ఫ్రీజ్ చేసినందుకో కాదు..దళితుల కోసం ఆ పథకం పెట్టినందుకు వ్యతిరేకంగా , మతతత్వ బీజేపీ కి అనుకూలంగా ఉన్న బీసీ లు బీజేపీ ని గెలిపించారు.ఈటెల పర్సనల్ ఫాలోఇంగ్ ఒక కారణమైతే నిరాశలో ఉన్న నిరుద్యోగులు ఇంకో కారణం.
దళిత బంధు పథకం కేవలం అక్కడ ఉన్న మెజారిటీ ఓట్ బ్యాంక్ ను కొల్లగొట్టే ఎత్తుగడ అని తెలిసినా , ఆ డబ్బులు రావని రూఢీ అయినా దళితేతరులలో ఒక్కసారిగా పెల్లుబికిన నిరసనను తక్కువ అంచనా వేయకూడదు.
బాహాటంగా , బహిరంగంగా .. “ఉద్యోగాలూ మీకే అన్ని పథకాలూ మీకేనా..ఏం కేసీఆర్ కు ఎస్సీ లు తప్ప ఇంకెవరూ కానొస్తాలేరా..ఎస్సీల ఓట్ల తోటే గెలుస్తడా ” అని గొంతుచించుకున్న వేలమంది తమ ప్రతాపాన్ని బ్యాలెటింగ్ యూనిట్ లో చూపారు.
వృద్ధాప్య పింఛన్లు , కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ , విడో , సింగిల్ వుమన్ పెన్షన్ లు అన్నిటికన్నా ముఖ్యం పది ఎకరాల నుండి వందల ఎకరాల భూమి ఉన్నవాళ్ళకు అకౌంట్లలో వచ్చిపడుతున్న ‘ రైతు ‘ బంధు పథకాల గురించి ఎవరూ చప్పుడు కూడా చెయ్యరు.
అంచేత ఈమె ఏదైనా తిప్పి ఇదే మాట్లాడుతుంది అని నన్ను విసుక్కున్నా సరే..
పైకి ఎన్ని మాస్కులు వేసుకున్నా ఈ దేశం నలుమూలలా దళితులపై అసహనం…వాళ్ళకేదో దోచిపెట్టేస్తున్నారనే అక్కసు ఇంకా సజీవం అన్నది హుజురాబాద్ ఎలెక్షన్ తో స్పష్టమైంది.
Rajitha kommu