బస్తీ మే సవాల్. ఏదో ఒక ఎన్నికలో ఏదో ఒక పాయింట్‌పై చర్చ మొదలౌతుంది. అదే ఆ ఎన్నికలో కీలకంగా మారుతుంది. దుబ్బాక ఉప ఎన్నికలో అక్కడి పాత బస్టాండ్ చాలా ఫేమస్ అయ్యింది. ఏదో ఫ్లోలో హరీశ్‌రావు బీజేపీ నేత రఘునందన్‌రావును ఉద్దేశించి రెచ్చగొట్టే దోరణిలో అభివృద్ధిపై తేల్చుకుందాం.. రా దుబ్బాక పాత బస్టాండ్‌కు అని సవాల్ విసిరారు. అంతే ఈ పాత బస్టాండ్ అందరి నోళ్లో నానడం మొదలైంది.
టీఆరెస్ వర్గాలేమో.. ఛలో దుబ్బాక పాత బస్టాండ్ అని సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలతో బీజేపీ వాళ్లతో ఆడుకున్నారు. బీజేపీ వాళ్లేమో పాత బస్టాండ్ ఫోటోలో సోషల్ మీడియాలో పెట్టి.. మీరిన్ని రోజులు పాలించి అభివృద్ధి చేసింది ఇదేనా..? ఇగో చూడు పాత బస్టాండ్ ఎలా శిథిలావస్థలో ఉందో..? అని ఎద్దేవా చేస్తూ కామెంట్లు పెట్టారు. ఈ ఉప ఎన్నిక అయ్యే వరకు ఈ పాత బస్టాండ్ ప్రజల నోళ్లలో నానుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఫేమస్ అయ్యింది.
ఈ చాలెంజ్ విసిరిన హరీశ్‌కు ఇది ఓట్లు రాల్చలేదు. బీజేపీకే అనుకూలంగా మారింది. తనొకటి తలిస్తే.. అన్నట్టుగా బీజేపీ వాళ్లు ఈ చాలెంజ్‌ను తమకు అనుకూలంగా మల్చుకొని ఓట్లు రాల్చుకున్నారు. టగ్ ఆఫ్ వార్‌గా జరిగిన పోటీలో రఘునందన్ రావు వెయ్యి ఓట్ల తో గెలుపు తీరాలకు చేరాడు. హరీశ్‌కు ఇది పెద్ద చేదు అనుభవాన్నే మిగిల్చింది. సరే, ఇప్పుడా దుబ్బాక పాత బస్టాండ్ గోల ఎందుకంటారా? ఆ బస్టాండ్‌ను కూల్చేస్తున్నారు. కొత్తది కట్టేందుకు. రఘునందన్ గెలిచిన తర్వాత జరిగే తొలి అభివృద్ధి అన్నట్టు ఇది. ఈ పాత బస్టాండ్ ఆనవాళ్లు లేకుండా చేయడంతోనే అభివృద్ధికి నాంది పలుకుతున్నారన్నమాట.
హుజురాబాద్ ఉప ఎన్నికలో కూడా హరీశ్ రావు సిలిండర్‌ను బాగా హైలెట్ చేశాడు. పెరిగిన గ్యాస్ ధరలను ప్రజల ముందుంచి బీజేపీకి ఓట్ల రాలకుండా అడ్డుకుందామనుకున్నాడు. కానీ అవేమీ అక్కడి ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. ఇక్కడ కూడా హరీశ్ ఎత్తుగడ పారలేదు.