ఎల్లారెడ్డి పేట మండలం అల్మాస్‌పూర్ గ్రామంలో మరో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఆ బాలిక ప్రస్తుతం నిలోఫర్‌లో ఉంది. విషయం తెలుసుకున్న కేటీఆర్ వెంటనే అక్కడి వెళ్లి బాధితులను పరామర్శించారు. బాధితులకు అండగా నిలిచారు. కుటుంబాన్ని ఆదుకుంటామని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని కేటీఆర్ అన్నాడు. గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా కేటీఆర్ వెంటనే స్పందించాడు. పరిస్థితినని అర్థం చేసుకుని స్వయంగా తనే ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పరిస్థితి అడిగి తెలుసుకున్నాడు. చిన్న ఘటనే కదా..మనం పోవాలా? పోతే ఇదో పెద్ద ఇష్యూ అవుతుంది.. అని ఏవేవో సాకులు వెతుక్కుని తప్పించుకోవడం టీఆరెస్‌కు అలవాటు.
కేసీఆర్ చాలా ఘటనల్లో ఎలాంటి స్పందన లేకుండా సైలెంట్‌గా ఉంటాడు. కానీ కేటీఆర్ దీనికి భిన్నంగా ఉంటున్నాడు. ఏదైనా జరిగితే వెంటనే స్పందిస్తున్నాడు. దూకుడుగా వెళ్తున్నాడు. మొన్న ఆరేళ్ల చిన్నారి రేప్, హత్య ఉదంతంలో పోలీసులకు నిందితుడు దొరికాడని ట్వీట్ చేయడం విమర్శల పాలయ్యింది. తర్వాత రైలు పట్టాలపై రేపిస్టు శవమై తేలాడు. ఈ దుర్ఘటన పెద్ద రాజకీయ దుమారమే లేపింది. మీడియాను, ప్రభుత్వాన్ని నెటిజన్లు తిట్టిపోశారు.
ఆరేళ్ల చిన్నారి రేప్, హత్య గురించి పట్టించుకోకుండా, రోడ్ యాక్సిడెంట్‌లో గాయపడ్డ సినీ హీరో సాయిధరమ్ చంద్ చుట్టూ మీడియా చక్కర్లు కొట్టడాన్ని తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. తర్వాత మీడియా తేరుకుని, చెంపలేసుకుని కవరేజీ ఇచ్చింది. అధికార పార్టీని వదల్లేదు. ఎవరూ అక్కడి వెళ్లి పరామర్శించకపోవడంపై ప్రభుత్వం పై దుమ్మెత్తి పోశారు. ఇది కూడా టీఆరెస్‌కు చెడ్డ పేరే తెచ్చిపెట్టింది. ఈసారి మాత్రం కేటీఆర్ వెంటనే తనదైన శైలిలో స్పందించాడు. ఆయన స్పందన చూస్తుంటే… ఈ రేప్ కేసు నిందితుడు దొరకేందుకు ఎక్కువ సమయం పోలీసులకు పట్టకపోవచ్చు. ఒకడు మొన్ననే రైలు పట్టాలపై శవమై తేలినా.. ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. ఇంకా ఎంత మంది చిన్నారులు రేప్‌లకు గురికావాలో..? ఎన్ని శవాలు పట్టాలపై తేలాలో…?