జై భీం

@@

ఈ సినిమా గూర్చి నేను సమీక్ష రాయడం లేదు. చాలామంది సమీక్షలు చదివి ఈ సినిమాను చూశాను.

ఈ సందర్భంగా నా మనసులోని రెండు మాటలు చెప్పదలచుకున్నాను.

తమిళం, మలయాళం లో మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి, ఫాజిల్ , సూర్య, కార్తీ, విజయ్ లాంటివారు అయిదారు కోట్లలో తీసే సినిమాలన్నీ వెంటనే తెలుగులో కూడా డబ్బింగ్ చేసి ఓటిటిలో తెలుగు ప్రేక్షకులకు కూడా చూసే అవకాశం కల్పించాలి.

లేకపోతె అరవై ఏళ్ళు దాటిన తెలుగు హీరోలు ఆ కళాఖండాలను తమ మేకప్పులు, స్టెప్పులు, ఫ్లాష్ బాకులు, ముగ్గురు హీరోయిన్లతో డాన్సులు లాంటి నానాచెత్తతో నింపేసి మాంసఖండాలుగా మార్చి కంపు కొట్టిస్తారు. ఈ సినిమాలో సూర్యకు ఒక హీరోయిన్ లేదు. ఒక డ్యూయెట్ లేదు. మా డెబ్బై ఏళ్ల హీరోలు సూర్య పాత్రకు ఒక ఫ్లాష్ బాకును సృష్టించి రెండు డ్యూయెట్స్ ఆస్ట్రియా, జర్మనీ, లండన్, స్విట్జర్లాండ్, సౌత్ కొరియాలో నిముషానికి పది డ్రస్సులు మార్చుతూ చిత్రీకరించి “అవి లేకపోతే మా అభిమానులు ఒప్పుకోరు” అనే వంకతో సినిమా బడ్జెట్ ను వందకోట్లు చేసి తమ సినిమా టికెట్ ను అయిదు వందల రూపాయలకు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వమని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మొహమాటపెట్టేస్తారు!

ఇక ఈ సినిమా దర్శకుడు జ్ఞానవేల్ కు కూడా నా మనవి ఏమిటంటే యాభై కోట్లు ఇస్తామని మీకు ఎవరైనా నిర్మాతలు ఆఫర్ ఇచ్చినా తెలుగులో మాత్రం మీరు సినిమాలు తీయద్దు.

ఈ సినిమాలో నటించిన సూర్య, గిరిజన పాత్రలు పోషించిన కళాకారులు, రావు రమేష్, ప్రకాష్ రాజ్, ఎస్సైగా నటించిన నటుడు, సిన్నతల్లి పాత్రను పోషించిన నటి, తమ ప్రతిభను పరాకాష్టకు తీసుకెళ్లారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటివారిని చూసి తెలుగు సినిమా గర్వించాలి.

పోలీస్ టార్చర్ సన్నివేశాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. అవి మినహా సినిమా చూడదగిన సినిమా. కమర్షియల్ నటుడు అయినప్పటికీ ఇలాంటి ఇతివృత్తంతో సినిమాను నిర్మించిన సూర్య అభినందనీయుడు.

ముర‌ళీమోహ‌న‌రావు ఇల‌పావులూరి

You missed