తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న తరుణం. అందరూ రాజీనామాలు చేశారు. నిజామాబాద్ అర్బన్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీ నారాయణ ఉన్నాడు. ఉన్నదే ఆ పార్టీకి రెండు సీట్లు. అంబర్‌పేట నుంచి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి యెండల.టీఆరెస్ ఎమ్మెల్యేలతో పాటు యెండల కూడా రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. డీఎస్ ఇక్కడ నుంచి ఓ సారి ఓడిపోయాడు యెండల చేతిలో. తెలంగాణ ఉద్యమం పేరుతో చేసిన రాజీనామాతో తనకు మరోసారి అవకాశం వచ్చిందని డీఎస్ సంబరపడ్డాడు. ఈసారి అవకాశాన్ని చేజార్చుకోదల్చుకోలేదు. యెండలపై పోటీకి దిగాడు. అధికారం చేతిలో ఉంది. డబ్బులు కుమ్మరించారు. అన్ని వర్గాలను కొనే ప్రయత్నం జరిగింది. తను ఈసారి గెలిస్తే తెలంగాణను బంగారు పళ్లెంలో తీసుకొస్తానని, తను సీఎం అవుతానని తనే డైరెక్టుగా చెప్పిన సందర్భాలున్నాయి. దీన్నే విస్తృతంగా ప్రచారం చేశాడు కూడా. డీఎస్ గెలవలేదు. పదివేల పై చిలుకు ఓట్లతో డీఎస్‌పై యెండల గెలిచాడు.
కారణం… తెలంగాణ ఉద్యమం. తెలంగాణను బతికించాలంటే.. రాష్ట్ర ఆకాంక్ష సజీవంగా ఉండాలంటే రాజీనామాలు చేసిన వారినే గెలిపించుకోవాలి. ఇదే ఆలోచన అన్ని శక్తులను ఏకం చేసింది. కుల, మతాలకు అతీతంగా యెండలకు మద్దతుగా నిలిచారు. గెలిపించుకున్నారు. సేమ్ ఇదే మాదిరిగా జరిగింది హుజురాబాద్ ఉప ఎన్నిక. అయితే ఇక్కడ ఈటలకు వ్యక్తిగతంగా మంచిపేరు, చాలా రోజులు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం.. ఉద్యమ నేపథ్యం..తో పాటు కేసీఆర్ చేత దారుణంగా అవమానించబడి బయటకు గెంటేయబడ్డ నేతగా సానుభూతి కూడా ఉంది. కేసీఆర్‌పై అన్ని సెక్షన్లలో ఇప్పటికే వ్యతిరేకత కూడగట్టుకుని ఉంది. ఈటలను గెలిపించి కేసీఆర్‌కు గర్వభంగం కావాలని చూశారు.
దీని కోసం ఉద్యమ శక్తులన్నీ ఏకం అయ్యాయి. టీఆరెస్ ఎంత ధనాన్ని కుమ్మరించినా.. పదవుల పందేరాలు పెట్టినా.. పథకాల పేరుతో పన్నాగాలు పన్నినా.. ఈటలకే మద్దతు తెలిపారు. గెలిపించుకున్నారు. అక్కడ అప్పుడు నిజామాబాద్‌లో తెలంగాణ కోసం.. ఇక్కడ ఇప్పుడు కేసీఆర్‌కు బుద్ది చెప్పేందుకు ఈటలకు … ఇద్దరూ బీజేపీ అభ్యర్థులే. కానీ ఓట్లు మాత్రం పార్టీని చూసి వెయ్యలే. యెండలను గెలించుకోవాలి.. అంతే. బీజేపీ అని చూడలేదు.ఇక్కడ ఈటలను గెలిపించుకోవడం ద్వారా అతని న్యాయం జరుగుతుంది.. కేసీఆర్‌కు బుద్ది వస్తుందనే సమీకరణే కానీ బీజేపీ అని కాదు.