ముగ్గురు మంత్రులున్నారు. ఎమ్మెల్యేలు, క్యాడర్ కూడా తోడుంది. అయినా మన అభ్యర్థిని గెలిపించుకోలేకపోయాం. అయినా.. సరే.. మీకు ధన్యవాదాలు. బాగా పనిచేశారు. అవిరామంగా శ్రమించారు. శభాష్. ధన్యవాదాలు, మీకు చప్పట్లు…..
కేటీఆర్ హుజురాబాద్ రిజల్ట్ పై స్పందించాడు. ముగ్గురు మంత్రులు.. హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ పేర్లను ప్రస్తావించాడు. వీరితో పాటు ఎమ్మెల్యేలు, క్యాడర్ అంతా బాగా కష్టపడ్డారని, సమిష్టిగా కృషి చేశారని ట్వీట్ చేశాడు. సోషల్ మీడియా వారియర్స్‌ను కూడా అభినందించాడు. అతని ట్వీట్‌లో ఏదో అసంతృప్తి, వైరాగ్యం కనిపించింది. ఇంత మంది ఉండి కూడా మన అభ్యర్థిని గెలిపించుకోలేకపోయామనే ఆవేదన కనిపించింది.

ఆ ట్వీట్ చూస్తేనే అర్థమవుతున్నది. ముగ్గురు మంత్రులు ఇన్ని రోజులు అక్కడ తిష్టవేసి చేసిందేమిటీ..? అని ప్రశ్నించినట్టుగా ఉంది. ఓటమిని అంగీకరిస్తున్నామని సహజంగా చెప్పడంలో భాగంగా ఇలా ట్వీట్ చేసి ఉంటాడేమో.. కానీ అది కూడా అందులో ప్రస్తావించలేదు. మీరు బాగా కష్టపడ్డారు. ధన్యవాదాలు అని చెప్పడం .. ఎందుకో కొంచెం వెటకారంగా, వ్యంగ్యంగా అన్నట్టుంది. ఇంత శ్రమిస్తే.. ఏదీ ఫలితం అని నిలదీసినట్టుగా కూడా ఉంది.
ఈ ఎన్నికలో ప్రచారంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇక కేటీఆర్ వద్ద అంత ప్రాధన్యత ఉండదనుకోవాలా..? ఏమో ఈ ట్వీట్ చూస్తే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే .. ఇక ముందు కేటీఆరే కదా అంతా. హుజురాబాద్‌లో ఇలా ఓడగొట్టి పరువు తీశారు కదరా..! అని అనడమొక్కటే మిగిలి ఉంది. ఇక్కడ గెలుపు కోసం కేటీఆర్ కూడా ఇతోధికంగా కొంచెం మసాలా జోడించాడు. ఈటల,రేవంత్ రెడ్డి కలిశారని, కావాలంటే ఫోటోలు కూడా ఇస్తానని, త్వరలో ఈటల కాంగ్రెస్‌లో చేరుతాడని మీడియాకు లీకులిచ్చాడు. వాస్తవంగా ఈ మాటలు కేటీఆర్ అనాల్సినవి కావు. కానీ అన్నాడు. ఎందుకంటే.. ఏదో విధంగా టీఆరెస్ అక్కడ గెలవాలి. అంతే. కానీ గెలవలేదు. ఇదీ ఆయన వైరాగ్యానికి అసలు కారణం.
