‘అంతులేని కధ’ సినిమా లో “ఏవిటే నువ్వు సంపాదించేది ? మాకేవన్నా
పట్టుపరుపులు,పంచభక్ష్య పరమాన్నాలు పెడుతున్నావా, సానిదానిలా రెడీ అయి బయటికి వెళ్ళడం తప్ప అంటాడు రజనీకాంత్ సరిత పాత్రధారి జయప్రద తో”
అప్పటికే పెళ్ళై పిల్లలున్న రజనీకాంత్ ఏ భాద్యతాలేని వ్యక్తి లా ఉంటూ, ఉద్యోగం చేస్తున్న జయప్రద తో ఈ మాటలన్నప్పుడు విలన్ లా కనిపిస్తాడు.
తర్వాత మార్పొచ్చిన రజనీకాంత్, ఇదే సరిత గురించి నా చెల్లెలు సర్, దయచేసి తన పెళ్లి ఆపద్దు అని చెప్తూ చివరకి సరిత కోసం చనిపోతాడు ,అప్పుడు హీరోలా అనిపిస్తాడు..ఇది బాలచందర్ మాయా జాలం.
అందుకే ఇవాళ తనకి వచ్చిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ని కొంతమందికి అంకితం చేసాడు ఈ మాణిక్ భాషా ,అందులో తనకి సినీ జీవితాన్ని ప్రసాదించిన బాలచందర్ ఒకరు..
నువ్వెంత సంపాదించినా మనసు కి సాంత్వన ఇచ్చేది, మనకి మంచి మార్గాన్ని చూపించేది అధ్యాత్మికత మాత్రమే అని చెప్పి ,తండ్రిలా దారి చూపించిన సోదరుడు సత్యనారాయణ కు కూడా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అంకితమిస్తా అని చెప్పాడు ఈ అరుణాచలం.
బస్ కండక్టర్ గా పనిచేస్తున్నప్పుడు సినిమాల్లోకి వెళ్తానంటే ప్రోత్సహించి ఎప్పుడు కలిసినా అదే ప్రేమ చూపించే అప్పటి బస్ డ్రైవర్ ‘రాజ్ బహుదూర్’ కి కూడా ఈ అవార్డ్ లో భాగం ఉంది అన్నాడీ తలైవా.
మూలాలని ,బాధ్యతలని మర్చిపోని రజనీకాంత్ స్టైల్ ,మేనరిజంస్ ఎవరూ అందుకో
లేనివి.అతని కోసం డైలాగ్స్ పుడతాయి, అతని కోసం పాత్రలు తయారవుతాయి ,అతని కోసం కథలూ నడిచి వస్తాయి.
సింహం లా లా సింగిల్ గా వచ్చి, రోబో లా చెలరేగే “పాపా రాయుడు ” రజనీ కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ‘ఆల్ ద రజనీ ఫ్యాన్స్ ‘అంటూ డాన్స్ చేసాడు అంటే అది కేవలం రజనీ మేజిక్ అంతే.
తన స్టార్ హోదానీ, డబ్బుని, వ్యక్తిగత సిబ్బంది ని పక్కన పెట్టి మరీ ఎన్నోసార్లు సామాన్యులతో గడిపి ,సామాన్యం గా బతకడానికి ప్రయత్నించే రజనీకాంత్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకి దొరికిన “నల్ల సూరీడు”.
చలన చిత్ర పరిశ్రమకి విశిష్టసేవ చేసిన ప్రముఖ వ్యక్తులకి ఇచ్చే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత రజనీకాంత్ కి 💐
Vydehi Murthy