తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పాలకుల పొగడ్తలకు కొదవ లేకుండా పోయింది. పదవుల కోసమో, ఉనికి కోసమో పాలకులను పొగిడి బుట్టలో వేసుకోవడం సహజంగా లీడర్ల లక్షణం. అది తెలంగాణలో గత కొన్నేండ్లుగా మరీ ఎక్కువై మితిమీరి పోయి నవ్వుల పాలవుతున్నది. ‘ఏదో విధంగా పాలకుడిని పొగడాలి.. తమ బాస్‌ను ప్రసన్నం చేసుకోవాలె. పదవులు పట్టాలె.. పది కాలలు రాజకీయాల్లో పదిలంగా ఉండాలె..’ ఇగో వీటన్నింటి కోసం ఈ పొగడ్తల మత్తును ఎక్కిస్తూ ఉంటారు. ఆ మత్తుకు మన పాలకులు మైమరిచిపోతూ ఉంటారు. ఎదురించి, ప్రశ్నించి, నిలదీసి, పోరాడి, ప్రాణలొడ్డి సాధించుకున్న ఈ తెలంగాణలో ఇలాంటి పోకడలు పెరగడం విషాదం.

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కేసీఆర్ను మరీ పొగడాలనుకున్నాడు. బతుకమ్మ చీరల పంపిణీ సందర్భాన్ని వాడుకుని కేసీఆర్ గొప్ప తనాన్ని కీర్తించాలనుకుని..సోయి తప్పి,నోరు జారి ‘మహిళలకు భర్తలాగా కూడా కేసీఆర్ సేవ చేస్తున్నాడ’ని ఘన కిర్తీ రాగమందుకుని ఆ తర్వాత నాలిక్కర్చుకున్నాడు. ఇదిప్పుడు వైరల్ అవుతున్నది.

మొన్నటికి మొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడాడు. సందర్భం ఏమో తెలియదు. స్ట్రాటజీ అసలే అర్ధం కాదు. ‘ఓ పది, ఇరవై సంవత్సరాల తర్వాత కేటీఆర్ ప్రధాని అవుతాడ”ని అనేశాడు. ఇప్పుడు కేటీఆర్ ప్రధాని అంశం ఎవరికి అవసరం? ఎప్పడు అవుతాడో ఈయనను ఎవరడిగారు? ఆ మధ్య కేటీఆర్ సీఎం అవుతాడని డబ్బు కొట్టాడు ఇతనే. ఇప్పుడు సీఎం మాట వదలి ప్రధాని మాట అందుకున్నాడు. ఇంత మాట్లాడినా ప్రభువులు పలకడం లేదు. పరవశించిపోతూనే ఉన్నారు. ఇది చూసి ప్రజలు నవ్వుకుంటూనే ఉన్నారు.

ఉన్న పదవి కాపాడుకోవాలన్నా.. కొత్త పదవి కావాలన్నా.. ఇలా ప్రభువుల కీర్తనలు అందుకుని, పూనకంలో మైమరిచిపోయి, పాద దాసుల్లా ప్రవచనాలు అలపించి కొత్త రాజకీయాలకు తెర లేపుతున్నారు మన రాజకీయ నాయకులు.

You missed