” కుయ్ కుయ్ కుయ్” అని అంబులెన్స్ వస్తున్న శబ్దం రాజారెడ్డికి వినిపిస్తుంది. కానీ కళ్లు తెరిచి చూడలేకపోతున్నాడు. మగతగా ఉంది. శరీరం తన మాట వినడం లేదని తెలుస్తూనే ఉంది. ఓ ఇద్దరు వచ్చి అతన్ని అంబులెన్స్ లో పడుకోబెట్టారు. మళ్లీ అది వచ్చిన దారినే స్పీడ్ గా సైరన్ మోతతో దూసుకుపోసాగింది. ట్రాఫిక్ రణగొణ ధ్వనులు వినిపిస్తున్నాయి. ఆ ట్రాఫిక్ శబ్దాలపై పైచేయి సాధిస్తున్నట్లుగా రాజారెడ్డి వెళ్తున్న అంబులెన్స్ కుయ్ కుయ్
మోత చెవులకు చిల్లలు పడేలా ఉంది. అరగంట తర్వాత గర్నమెంట్ పెద్దాసుపత్రి ముందు ఆగింది వ్యాన్. మెల్లగా రాజారెడ్డి కండ్లు తెరుచుకున్నాయి. పరిసరాలు గమనిస్తున్నాడు. అంబులెన్స్ వెనుకే శ్రీధర్ వచ్చాడు బైక్ పై. స్ట్రెచర్ పై పడకోబెట్టి లోనికి తీసుకెళ్తున్నారు. చుట్టూ పరికించి చూస్తున్నాడు రాజారెడ్డి. పీపీఈ గౌన్లు తొడుక్కొని ఆస్పత్రిలో నర్సులు అటూ ఇటూ హడావుడిగా తిరుగుతున్నారు. వారిని చూసిన రాజారెడ్డికి దెయ్యాలు దవాఖానలో తిరుగుతున్నాయనే
భావన ఏర్పడింది. భయం ఆవహించింది. శరరీం మెల్లగా వణకసాగింది. ఆ వాతావరణం అతనిలో అప్పటి వరకు ఉ న్న మగతను పారిపోయేటట్లు చేసింది. నీరసం, కడుపులో నొప్పి తెలుస్తున్నాయి. అతన్ని జనరల్ వార్డులోకి షిఫ్ట్ చేస్తున్నారు. దానిని ఆనుకొనే కోవిడ్ వార్డున్నది. బెడ్ పై పడుకోబెట్టి అతనికి ప్రథమ చికిత్స చేశారు నర్సులు. సెలైన్ ఎక్కించారు. డాక్టర్ వచ్చి కేస్ షీట్ రాశాడు. కొన్ని పరీక్షలు చేయాలన్నాడు.
శ్రీధర్ వచ్చాడు. అతని ముఖంలో కంగారు కనిపిస్తుంది. ” ఏమైంది రెడ్డి ఒక్కసారిగా పరేషాన్ చేశావు.? ఇప్పటికే నా పరిస్థితి బాగా లేదంటే నువ్వు ఇంకా పరేషాన్ లో పడేశావు ” అన్నాడు ముఖం మీదే. అసహనం, అయోమయం, ఆందోళన కనిపిస్తున్నాయి అతని ముఖంలో.
రాజారెడ్డికి మాట్లాడానికి కూడా ఓపిక లేనట్లుగా ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు. ” సరే ఏమి భయపడకు. నేను డాక్టర్ తో మాట్లాడిన. వాళ్లు చూసుకుంటారు. నేను వెళ్లి నీ బైక్ ను ఇంటికి తీసుకెళ్తా. మీ ఇంట్లో వాళ్లను ఇక్కడకు పంపిస్తా” అన్నాడు.
“మనం తాగినట్లు ఎవ్వరికీ చెప్పకు ” అన్నాడు.. మెల్లగా చెవిలో. అక్కడ్నుంచి శ్రీధర్ వెళ్లగానే రాజారెడ్డిలో మరింత ఆందోళన మొదలైంది. వార్తలు రాసే టైమ్ లో చాలా సార్లు దవాఖానకు వచ్చినట్లు గుర్తు.
కానీ ఇలా బెడ్ పై ఇక్కడే పడుకొని ట్రీట్ మెంట్ తీసుకోవడం తొలిసారి. ల్యాబ్ నుంచి ఇద్దరు వచ్చి రక్తం శాంపిల్స్ తీసుకుపోయారు. రాజారెడ్డిలో గుండెదడ పెరుగుతున్నది. అక్కడ వాతావరణం అంతా గందరగోళంగా ఉంది. సీజనల్ వ్యాధులతో వచ్చిన వాళ్లతో అక్కడ బెడ్స్ అన్ని కిక్కిరిసిపోయి ఉన్నాయి. రోగుల అటెండెంట్లతో ఆ ప్రాంతం జాతరను తలపిస్తోంది. మాటల శబ్దాలతో గజిబిజిగా ఉంది.
ఇంతలో రాజారెడ్డి ఫోన్ మోగింది. వనజ ఫోన్ చేస్తున్నది. ఏమి మాట్లాడాలో తెలియడం లేదు. ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
కొద్ది సేపటికి ఆఫీసు నుంచి రాజారెడ్డి బాస్ ఫోన్ చేశాడు. ” ఏమైంది? ఎట్ల ఉంది?” అక్కడ్నుంచి పొడిపొడిగా ప్రశ్నలు. సమాధానం వినే టైమ్ లేనట్లుంది. చెప్పే ఓపికా ఇక్కడ లేదు. “సరే రెస్ట్ తీసుకో” అని ఫోన్ పెట్టేశాడు.
చార్జింగ్ అయిపోతుందేమో… అది కుయ్ కుయ్ అని శబ్దం చేసింది.
నరసింహా వచ్చాడు. ఎలా ఉంది అని ఆరా తీశాడు. అక్కడ్నుంచే వనజకు ఫోన్ కలిపి మాట్లాడాడు. అన్నం వండుకొని తీసుకురా అని చెప్పి … వచ్చేటప్పుడు చార్జర్ తీసుకురమ్మన్నాడు.
” ఏం భయపడకు… రేపు డిశ్చార్జి చేస్తారులే ” అని ధైర్యం చెప్పి వెళ్లిపోయాడు. పోతూ పోతూ రాజారెడ్డి వైపు దీనంగా ఓ చూపు చూసి వెళ్ళిపోయాడు. కొద్ది సేపటికి వనజ వచ్చింది. ఆమె ముఖంలో ఆందోళనతో పాటు కోపం కూడా కనిపించింది.
కోపంతో ఏదో తిట్టాలనుంది ఆమెకు. కానీ బెడ్ మీద దీనంగా పడి ఉన్న భర్త ను చూసి తమాయించుకున్నది.
అన్నం వండి తెచ్చింది. లేచి అక్కడే ప్లేట్ లోనే చేతులు కడుక్కొని నాలుగు బుక్కలు తిన్నాననిపించాడు. కడపులో పేగులను కోస్తూ మెతుకులు కిందికి దిగుతున్నాయనిపిస్తుంది. గొంతు నొప్పిగా ఉండటంతో మింగేటప్పడు బలవంతంగా మింగుతున్నాడు. చేతి కడుక్కొని డాక్టర్లిచ్చిన మందులు వేసుకున్నాడు. రేపు బ్లడ్ రిపోర్టులు రాగానే మందులు రాసి డిశ్చార్జి చేస్తామని నర్సు చెప్పి వెళ్లింది.
పక్కనే పెద్దగా అరుపులు … ఎవరో చనిపోయినట్లున్నారు. ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతం రోదనలతో దద్దరిల్లిపోయింది.
అది చూసి వనజ అక్కడ్నుంచి వెళ్లేందుకు రెడీ అయ్యింది. గిన్నెలు సర్దుకొని దుప్పటి, చార్జర్, మంచినీళ్ల బాటిల్ పెట్టి అక్కడ్నుంచి వెళ్లబోయింది.
“ఎలా వచ్చావు?” రాజారెడ్డి గొంతు నీరసంగా పలికింది. “రవి ఆటోలో.”
*****
తన జీవితం ఏ మలుపు తిరుగుతుందో రాజారెడ్డికి అర్థం కావడం లేదు. జీవితంలో ఇలాంటి అనుభవాలను ఎదురవుతాయని బహుశా తానెప్పుడూ అనుకోలేదు కావొచ్చు.
తన పరిస్థితి తలుచుకుంటు కుమిలిపోతున్నాడు అతను. తలపక్కకు పెట్టి ఏదో ఆలోచిస్తున్నాడు.
అతనికి తెలియకుండానే ఆ కళ్లు వర్షిస్తున్నాయి.
దారలుగా వస్తున్న కన్నీళ్లతో దిండు కొద్దిగా తడిచింది. వెంటనే సర్దుకొని ముఖం తుడుచుకున్నాడు. మెల్లగా ఆ ప్రాంతం నిశ్శబ్దంగా మారింది. మెల్ల మెల్లగా కళ్లు మూతపడుతున్నాయి. తనకు తెలియకుండానే మగత నిద్రలోకి జారుకున్నాడు.
ఎప్పుడో తెల్లారుజామున మెలకువ వచ్చింది. ఇక నిద్ర రాలేదు. ” ఎప్పుడు డాక్టర్ వస్తాడా?” అని ఎదురుచూడసాగాడు. వనజ వచ్చింది. ఉక్మా చేసుకొని వచ్చింది. ముఖం అక్కడే కడుక్కొని తిన్నాడు.
డోరు దగ్గర ఆటో రవి నిలబడి చూస్తున్నాడు. “ బాగున్నరా? ఇపుడు ఎలా ఉంది. ?” కళ్లతో, చేతి సైగలతో అడిగి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. పక్కనే కోవిడ్ వార్డు ఉండటంతో భయపడి రాలేదనుకున్నాడు.
వనజ ముఖంలో ఇంకా కోపం చాయలు పోలేదు. అవకాశం వస్తే రాజారెడ్డిని చడామడా తిడదామనే చూస్తున్నది. అది గ్రహించాడు. అందుకే ఆమెతో ఏమి మాట్లాడకుండా బెడ్ పై పక్కకు తిరిగి పడుకున్నాడు.
పొద్దున్నే డాక్టర్ రౌండకు వచ్చాడు. ఇంకా రిపోర్టులు రాలేదు. నర్సును అడిగాడు. డాక్టర్ దగ్గరే ఉన్నాయి. తీసుకొస్తాడు అని చెప్పి విసవిసా వెళ్లిపోయింది.
ఎప్పడు డిశ్చార్జి అయ్యి ఇంట్లో పడదామా అని ఎదురుచూస్తున్నాడు రాజారెడ్డి.
డాక్టర్ ఒక్కొక్కరినే చూస్తూ వస్తున్నాడు. రాజారెడ్డి బెడ్ వద్దకు వచ్చాడు. కేప్ షీట్ చూసి పరిశీలించాడు. రిపోర్టులు గమనిస్తున్నాడు.
(ఇంకా ఉంది)