ఉలిక్కిపడి ఒక్కసారిగా నిద్రలేచాడు రాజారెడ్డి, లేచి బెడ్ పై కూర్చుని చుట్టూ పరికించి చూశాడు.
అతని శరీరం చల్లని చెమటలతో తడిసిపోయి ఉంది. నుదుటిపై చెమటను లుంగీతో తుడుచుకున్నాడు. గొంతెండుకపోయి ఉంది. తనకొచ్చింది పీడకల అని తెలుసుకున్నాడు. ఆ కల కలిగించిన భయాత్పోతం అతని గుండెదడను
పెంచింది. తన గుండె చప్పుడు తనకు స్పష్టంగా వినిపిస్తున్నది. లేచి కిచెన్ లోకి వెళ్లి వరుసగా రెండు గ్లాసుల నీళ్లు తాగాడు. ఆయాసం వచ్చినట్లనిపించింది. కొద్ది సేపు బెడ్ పై కూర్చున్నాడు తలపట్టుకొని. కళ్లు మూసుకొని తనకు వచ్చిన కల గురించి గుర్తుచేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ప్రచండ వేగంతో పారుతున్న నీటి ప్రవాహంలో విగతజీవిగా తాను కొట్టుకుపోతున్న దృశ్యం కనిపించింది ఒళ్లు జలధరించింది. దిగ్గున లేచి లోపలి గదిలోకి నడిచాడు. భార్య, పిల్లలు ఆదమరచి నిద్రపోతున్నారు. “సమయం ఎంతైతుంది?” గోడగడియారం వైపు చూశాడు. నాలుగు గంటల ఐదు నిమిషాలు….
ఆ పీడకల ప్రభావమో ఏమో ఇంట్లో ఉక్కపోతగా తోచింది. ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండాలనిపించలేదు. డోర్ తీసి బయటకు నడిచాడు.
ఒక్కసారిగా చల్లని గాలులు అతని శరీరాన్ని తాకి ఉక్కిరిబిక్కిరి చేశాయి. గాలికి చెట్టు కొమ్మలు వయ్యారంగా ఊగుతున్నాయి.
ఆ వాతావరణం అతని శరీరానికి స్వాంతన చేకూర్చింది. మనసును ఉల్లాసపర్చింది. అక్కడే కాసేపు అరుగుపై కూర్చున్నాడు.
నక్కలు ఊళ పెట్టినట్లు కుక్కల అరుపులు వినిపిస్తున్నాయి. వేరే సమయంలోనైతే ఆ అరుపులకు రాజారెడ్డి జడుసుకునేవాడే. కానీ ఇపుడు అవేమీ పట్టించుకోవడం లేదు. చల్లని గాలులను ఆస్వాదిస్తూ అవి పెడుతున్న గిలిగింతలకు పులకించిపోతున్నాడు.
లేచి వాకిట్లో అటూ ఇటూ కాసేపు తిరిగాడు. మనసు మెల్లమెల్లగా స్థిమితపడుతున్నది. గేటు తెరిచి గల్లీలోకి వచ్చాడు.
అక్కడ కూర్చున్న రెండు కుక్కలు రాజారెడ్డిని చూసి పరుగెత్తుకువచ్చాయి. తోకాడిస్తూ అవి అతని చుట్టూ తిరుగుతున్నాయి. రాజారెడ్డి వాటి ప్రేమకు కరిగిపోయాడు. అవి చూపిస్తున్న విశ్వాసానికి సంబురపడ్డాడు.
“ఏయ్ టామీ”, ” ఏయ్… జిక్కీ… ” అంటూ వాటిని పేర్లు పెట్టి పిలుస్తున్నాడు.
అవి చిన్న కూనలుగా ఉన్నప్పట్నుంచి అక్కడే అతని ఇంటి వాకిట్లోనే పెరిగాయి. వాటికి తన రెండో కూతురు సంజన పేర్లు పెట్టింది. ఆ గల్లీలో ఉన్నవారంతా అవే పేర్లతో వాటిని పిలుస్తారు…
“జూ… జూ…” అంటూ కుడిచేతి వేళ్లను ఆడిస్తూ వాటితో సరదాగా ఆడుకుంటున్నాడు రాజారెడ్డి.
అవి రాజారెడ్డి వేళ్లను అందుకునేందుకు ప్రయత్నంచేసే క్రమంలో చిన్న పిల్లల మాదిరిగా గారాలు పోతూ కోతుల్లా గెంతుతున్నాయి. అతని పైపైన పడుతున్నాయి. అలా వాటితో ఆడుకుంటూ కొద్ది దూరం వరకు వాటితో పాటు నడిచి వచ్చాడు. గల్లీ సందు నుంచి పక్కనే ఉన్న మెయిన్ రోడ్డు బాట వరకు వచ్చి ఆగాడు. ఆ డాంబర్ రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. వీధిలైట్ల వెలుతురులో ఆ రోడ్డు నల్లని తాచులా నిగనిగలాడుతున్నది. అప్పటికే కొద్ది పాటి వర్షం కురిసి వెలిసినట్లుంది. కొత్త రోడ్డు వేసిన కళను సంతరించుకున్నదా డాంబర్ రోడ్డు.
అప్పటి వరకు తన చుట్టూ గింగిర్లు తిరుగుతూ ఆడుకున్న ఆ రెండు కుక్కలు వాటికవే పొట్లాడుకోసాగాయి సరదాగా.
ఒకదాన్ని మరొకటి కరిచేందుకు చేసే ప్రయత్నంలో కిందా మీద పడుతున్నాయి. ఒకరకమైన తన్మయత్వంతో అవి ఆటలాడుకుంటున్నాయి.
“గుర్… గుర్…..” “కుయ్…. కుయ్…” మంటు మధ్య మధ్యలో శబ్దాలు చేసుకుంటూ నేల మీద పడి బొర్లుతున్నాయి. వాటినలా చూసిన రాజారెడ్డికి ఎంతో సంతోషం వేసింది. ఈర్ష్య కూడా కలిగింది.
“వాటికెలాంటి సంసార బాధలు లేవు కదా. ఎంత సరదాగా జీవితాన్ని గడుపుతున్నాయి..” అనుకుంటూ బీరిపోయి గదవకు చేయి పెట్టుకొని మైమరచి వాటినే చూస్తున్నాడు.
ఆ నిశ్శబ్ద వాతావారణాన్ని బద్దలు కొడుతూ… ఆ రోడ్డు మూల మలుపు నుంచి ఒక్కసారిగా పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ “కుయ్… కుయ్…. కుయ్” మంటూ రయ్యిన దూసుకు రాసాగింది.
ఒక్కసారిగా జరిగిన ఈ హఠాత్పరిణామానికి వెంటనే తేరుకొని కొయ్యబారినట్లు అటు వైపు చూస్తున్నాడు రాజారెడ్డి. ఈ సమయంలో బనీను, లుంగీపై ఇలా రోడ్డుపైకి వచ్చానే? ఇపుడెలా? వెనుదిరిగి ఇంట్లోకి వెళ్లిపోదామంటే అంత సమయం లేదు. ఆ వ్యాన్ రయ్యిన అతను నిలబడ్డ చోటుకు దూసుకురాసాగింది.
“ఇపుడెలా?” ” ఏమని చెప్పాలి?” అతని ఆలోచనలు ఇంకా పూర్తికానేలేదు. వ్యాస్ స్పీడ్ గా వచ్చి సడన్ బ్రేక్ తో అతని ముందు ఆగింది. టైర్లు కీచుమంటూ శబ్దం చేశాయి. ఓ రెండడుగులు వెనక్కి వేశాడు రాజారెడ్డి. పెట్రోలింగ్ కారు ముందు సీట్లో కూర్చున్న పోలీస్ ఆఫీసర్ అద్దాన్ని దించి రాజారెడ్డిని చూశాడు. వీధిలైట్ల వెలుతురు రాజారెడ్డి ముఖం మీద పడటంతో అతను స్పష్టంగా కనిపిస్తున్నాడు.
కానీ పోలీస్ కారులో కూర్చున్న వారిపై వెలుతురు పూర్తిగా పడకపోవడంతో వారి ముఖాలు గుర్తించలేకపోతున్నాడు రాజారెడ్డి.
” హలో రెడ్డి సాబ్… మీరేనా…… ఇక్కడేం చేస్తున్నారు?” లోపల కూర్చున్న పోలీసాఫీసర్ అడిగే సరికి రాజారెడ్డికి ధైర్యం వచ్చింది. వెనక్కి వేసిన రెండడుగులను ఇపుడు
| ముందుకు వేశాడు.
కొంచెం తలవంచి లోన ఎవరెన్నారా? అని తొంగిచూశాడు. ‘నాగభూషణం’ ఆ ఏరియా ఎస్సై. తనను గుర్తుపట్టినందుకు సంతోషించాడు.
కారు దిగిన ఎస్సై రాజారెడ్డి దగ్గరకు వచ్చాడు. ” ఇక్కడేనా సార్ మీ ఇల్లు. ఇంత తొందరగా లేచారు. ఎటైనా వెళ్లాలా పొద్దున్నే…” నవ్వుతూనే వరుసగా ప్రశ్నలు సంధిస్తున్నాడు.
“ఆ అవును సార్. అగో ఆ వేపు చెట్టు కనిపిస్తుంది … ఇక్కడ్నుంచి నాలుగో ఇళ్లు.. అదే మాది. ” అన్నాడు.
“మీరు రోజు ఇదే టైంకు లేస్తారా? వాకింగ్ చేస్తారా? మంచి అలవాటు సర్ ” అన్నాడు ఎస్సై. ప్రశ్నలు తనే వేసి, సమాధానాలు కూడా తనే ఇస్తున్నాడనుకొని రాజారెడ్డి సైలంట్ గా ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాడు.
“ఓకే సార్ వస్తాను మరి “అని కారులో కూర్చున్నాడు.
క్షణంలో కారు సైరన్ మోతతో ముందుకు దూకింది. చూస్తుండగానే చౌరస్తా దాటి వెళ్లిపోయింది. మళ్లీ అక్కడ నిశ్శబ్దం ఆవహించింది.
అప్పటి వరకు సంతోషంగా ఆడుకున్న కుక్కలు… పోలీసు వాహనం రాకతో బిక్కు బిక్కు మంటూ ఓ మూల పోయి వీరిని గమనిస్తున్నాయి. కారు వెళ్లిపోగానే తోకూపుకుంటూ మళ్లీ అవి రాజారెడ్డి వద్దకు వచ్చాయి.
ఓ పోలీస్ ఆఫీసరు తనను “సార్” అని సంబోధించడం….. కారు దిగి మరీ తనను విష్ చేయడం రాజారెడ్డికి సంతోషాన్నిచ్చింది. అతని మోములో గర్వం తాలుకూ చాయలు ప్రతిబింబిస్తున్నాయి.
తల పైకెత్తి, కొంచెం చాతీ ముందుకు పొంగించి ఇంటి వైపు వెనుదిరిగాడు. కుక్కలు అతన్ని అనుసరించసాగాయి.
అంతలో ఆ గల్లీలోంచి ఓ బైక్ అతనికెదురుగా రాసాగింది. లోపల గల్లీలో అక్కడక్కడ మాత్రమే వీధిలైట్లు ఉ ండటంతో కొంచెం చీకటి, కొంచెం వెలుతురుగా ఉంది.
ఆ మసక వెలుతురులోంచి బైక్ రయ్యిన తన సమీపానికి రాసాగింది. “ఈ సమయంలో ఎవరబ్బా?” అని తదేకంగా చూస్తున్నాడు రాజారెడ్డి. తనకు సమీపంగా వచ్చింది బైక్. మూతికి మాస్క్ కట్టుకున్నందున ముఖం సరిగా గుర్తించలేకపోతున్నాడు.
తనను గమనించినట్లున్నాడు ఆ బైక్ పై ఉన్నతను. చూపులు తప్పించుకున్నట్లుగా తలను ఆ పక్కగా తిప్పుకుని రయ్యిన తన పక్క నుంచి బైక్ ను ఉరికించాడు.
కొన్ని క్షణాల్లోనే ఆ బైక్ గల్లీలోని మూల మలుపు దాటి మెయిన్ రోడ్డు చేరుకొని మరింత స్పీడందుకుంది.
ట.. ర్ర్.. ట ర్ర్……….. ” మని పెద్ద శబ్దంతో వేగం పెంచి దూసుకుపోయింది. క్రమేణా ఆ శబ్దం తగ్గుతూ వచ్చి మాయమైపోయింది.
రాజారెడ్డి ఆ బైక్ వెళ్లిపోయినా అటువైపే చూస్తున్నాడు. ” ఎవరతను? తనను గుర్తుపట్టాడు.. మరి ముఖం చాటేసుకునే విధంగా ఎందుకు అలా ప్రవర్తించాడు?”
ఆ ముఖాన్ని ఎక్కడో చూసినట్లు అతనికి తోచసాగింది. కొద్ది సేపు ధీర్ఘంగా ఆలోచించనగా అప్పుడు తట్టింది అతనికి. అవును … అతను
విఠల్ స్నేహితుడు “సలీం…..
“తనను చూసి ఎందుకు అలా ముఖం తిప్పుకొని వెళ్లాడు?” “గుర్తు పట్టినప్పుడు కనీసం విష్ చేసి వెళ్లొచ్చుగా…. అంత ఆందోళన, హడావుడి ఎందుకు?”
ఆలోచిస్తూ అలాగే వాకిట్లో అరుగుపై కూర్చున్నాడు రాజారెడ్డి.
ఆ రెండు కుక్కలు కూడా రాజారెడ్డి సుధీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చోవడాన్ని విస్తుపోయి చూస్తున్నట్లుగా అతన్నే గమనిస్తున్నాయి.
రాజారెడ్డి ఈ లోకంలో లేడని భావించాయో ఏమో అవి రెండు అక్కడ్నుంచి బయటకు నడిచాయి. గేటు బయటకు వెళ్లగానే దూరంగా ఎవరో కనిపించినట్లున్నారు……
టామీ “భౌ భౌ ” అని ఒక్కసారిగా గట్టిగా మొరుగుతూ అక్కడ్నుంచి పరుగులంకించుకున్నది. జిక్కీ కూడా దాన్ని అనుసరించింది.
ఆ గల్లీకి కొత్తగా ఎవరైనా వస్తేనే అవి మొరుగుతాయి. పాతవాళ్లెవరైనా ఎంత రాత్రి వచ్చినా అవి గుర్తిస్తాయి. మొరగవు. తోకాడిస్తూ వారిని అనుసరిస్తాయి. ఎవరో కొత్తవారు ఆ గల్లీలోకి వచ్చినట్లున్నారు. అందుకే ఆ కుక్కలు మొరుగుతూ వెళ్లాయి.
అప్పటి వరకు అలుముకున్న చీకట్లను చీలుస్తూ వెలుగురేఖలు ప్రసరిస్తున్నాయి. మెల్ల మెల్లగా తెల్లవారుతోంది.
వనజ చీపురు పట్టుకొని బయటకు వచ్చి చూసింది. భర్త రాజారెడ్డి అరుగుపై శూన్యంలోకి చూస్తూ కూర్చోవడాన్ని చూసి ఆమె విస్తుపోయింది.
” ఏమైంది? రాత్రి నిద్రపోయారా లేదా? ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు.” అన్నది. అతని సమాధానం కోసం వేచిచూడలేదామె. చీపురు పట్టుకొని సర్రు సర్రుమని వాకిలి ఊడుస్తూ పోతోంది. భార్య పలకరింపుతో ఈలోకంలోకి వచ్చిపడ్డాడు రాజారెడ్డి.
వెంటనే తేరుకొని లేచి నిలబడ్డాడు. వాకిట్లోని వేపచెట్టుకున్న కొమ్మను వంచి పుల్లను తెంపుకున్నాడు. ఆ పుల్లను నోట్లో వేసుకొని నములుతూ అటు ఇటు తిరగసాగాడు. భార్య ఏదైనా మాట్లాడుతుందని అనుకున్నాడు. కానీ ఆమె ఇతన్ని పట్టించుకోవడం లేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నది.
” ఈ రోజు శ్రీధర్ ను కలవాలి “.. అని మనసులో అనుకుని వెంటనే రెడీ కావడానికి బాత్రూంలోకి వెళ్లాడు.
స్నానం చేసి బట్టలు వేసుకొని బైక్ వద్దకు నడిచాడు. వనజ భర్తను ఒకింత ఆశ్చర్యంగా గమనిస్తూనే ఇంట్లో పని చేసుకుంటున్నది. కనీసం వెళ్తున్నానని చెప్పకుండానే అతని బైక్ స్టార్ట్ చేశాడు. వనజ కూడా మారు మాట్లాడలేదు. “ఎటు వెళ్తున్నావ్? ఎప్పుడొస్తావ్?” అని కూడా అడగలేదు.
వనజ తీరుకు రాజారెడ్డి కొద్దిగా బాధపడ్డాడు.
బైక్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. మూల మలుపు తిరగగానే చాకలి అంజన్న.. మడిగె బయటే నిలబడి ఉ న్నాడు. రాజారెడ్డిని పలకరించాడు.
” సార్ మూడు నెలలుగా బట్టలు ఇస్త్రీకి ఇవ్వడం లేదు…” అన్నాడు.
” ఏముంది అంజన్న కరోనా కాలం బయటకు వెళ్లడం తక్కువైంది. టీషర్టులే ఎక్కువగా వేసుకుంటున్నాను. బయటకు వెళ్లి వచ్చిన ప్రతీసారి ఇంటికి వెళ్లగానే స్నానం చెయ్యాల్సి వస్తుంది. అందుకే ఫార్మల్ డ్రన్లు వేసుకోవడం లేదు.” అన్నాడు… వాస్తవానికి ఇస్త్రీ కి పైసలు తన దగ్గర లేవు. కరోనా కాలం లో అతనికి అవి అదనపు ఖర్చులే.
ఇస్త్రీ బట్టలు తొడగంది బయటకు వెళ్లేవాడు కాదు… ఇప్పుడు పరిస్తితి పూర్తిగా భిన్నంగా మారింది.
” సార్ మీరందరూ ఇట్ల చేస్తే మా గతేం గాను.. రెండు నెలల నుంచి ఈ మడిగె కిరాయి కూడా కట్టలేకపోతున్నా..” అన్నాడు దీనంగా.
ఎప్పటినుంచో ఉన్న తన కడుపులోని ఆవేదనంతా రాజారెడ్డి ముందు వెళ్లగక్కాడు అంజన్న. అతనికి ఏం చెప్పాలో తెలియలేదు రాజారెడ్డికి.
” ఆ ..రేపటి నుంచి వేస్తాలే. ….” అని అక్కడ్నుంచి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ పక్కనే ఉన్న బార్బర్ షాపు రాజు కూడా షాపు నుంచి బయటకు వచ్చి వీరి సంభాషణ మొత్తం విన్నాడు. ఇప్పుడు తను పలకరించాడు.
“రెడ్డీ సాబ్ ..! కటింగ్ కు రాక శానరోజులైంది” అని గుర్తు చేశాడు.
“ టెన్షన్ లకు నెత్తంతా ఊడిపోతుంది. ఉన్న ఈ నాలుగు వెంట్రుకలకు ఎన్నిసార్లు చేయించాలి క్రాపు” అన్నాడు రాజారెడ్డి నవ్వుతూ.
“ కరోనా రాకముందు కూడా ఇవే ఎంటుకలున్నాయి కదా సార్… అప్పడేమో నెలకు రెండు మూడు సార్లు వస్తుంటిరి. కొద్దిగా పెరిగితే ఉన్నవి కూడా ఊసిపోతయేమోనని చిన్నగా పోలీస్ కటింగ్ లాగా చేయించుకుని పోయేటోళ్లు” అని గుర్తు చేశాడు.
రాజారెడ్డి క్రాపును నిశితంగా పరిశీలిస్తున్నాడు రాజు. ఇంట్లోనే కటింగ్ కుస్తీలు పడుతున్న విషయం వాడికి తెలిసిపోయిందని రాజారెడ్డి అర్థం చేసుకున్నాడు. “ఈ సండే వస్తాలే ” అని బైక్ ను స్టార్ట్ చేసి ముందుకు ఉరికించాడు. అలా ముందుకు పోనిచ్చాడో లేదో….. ఓ కారు సడన్ బ్రేక్ తో వచ్చి పక్కనే ఆగింది. “ఎవరా ?” అని బైక్ స్లో చేసి చూసేసరికి, లోపల డ్రైవింగ్ సీటులో విఠల్ నవ్వుతూ కనిపించాడు.
ఆ కారు అతని ఓనర్ ది. అప్పుడప్పడు కారును తన ఇంటికి తెచ్చుకుంటాడు. తన బైక్ ను అక్కడే ఓనర్ ఇంటి వద్దే ఉంచి వస్తాడు.
“ రాజన్నా! ఏంది ఇంత పొద్దుగాల్నే పోతున్నావ్?” అన్నాడు విఠల్. ” ఓ ఫ్రెండ్ ను అర్జంట్ పనిమీద కలిసేదుంది. అందుకే వెళ్తున్నా.” అన్నాడు. “నువ్వెటు వెళ్తున్నావు?” అని అడిగాడు.
ఏదో మాటవరుసకు అడగాడే కాని, ఎప్పుడు అక్కడ్నుంచి బయటపడదామా అని అసహనంగా అటు ఇటు బైక్ పై కదులుతున్నాడు.
“ నిన్న మహారాష్ట్ర టూర్ వెళ్లిన రాజన్న…….”
” వారంలో రెండు మూడు సార్లు నాకు తప్పదు. మా వోనర్ నేను కలిసి ఆయన బిజినెస్ పనిమీద పోతాము.” అన్నాడు. “ రాత్రి అక్కడే ఉండి తెల్లారుజామున బయలుదేరి వచ్చాను.” అన్నాడు మళ్లీ తనే. ఒక్కసారిగా రాజారెడ్డి ఉలిక్కిపడ్డాడు.
– ‘నువ్వు నిన్న లేవా? ” అని అడిగాడు. అతన్ని ఏవేవో ఆలోచనలు సతమతం చేస్తున్నాయి.
(ఇంకా ఉంది)
