కుక్కల అరుపులతో ఒక్కసారిగా మెలకువొచ్చింది రాజారెడ్డికి. లేచి చూశాడు. టైం ఎంతవుతుందో తెలియడం లేదు. మూలకు విసిరేసిన సెల్ ఫోన్ తన దిండు పక్కనే ఉంది. దాని డిస్ ప్లే సరిగ్గా కనిపించడం లేదు. టైం ఎంతైందో తెలియడం లేదు. లేచి లైట్ వేశాడు. గోడ గడియారం వంక చూశాడు. 3.30 గంటలు సూచిస్తుందది. వంట గదిలోకి వెళ్లి బిందెలోంచి గ్లాస్ తో రెండు సార్లు నీళ్లు తాగాడు. పేగులను కోసేస్తున్నట్లుగా ఉంది నీళ్లు లోపలికి వెళ్తుంటే.
నిన్న సాయంత్రం హాస్పిటల్ నుంచి వచ్చి భార్యపై కోపంతో అలాగే బెడ్ పై నిద్ర పోయాడు. మగత నిద్రలోకి జారుకున్నాడు. రాత్రి ఏమి తినలేదని అప్పుడు అతనికి అర్థమయ్యింది. కడుపులో పేగులు కరకరమంటున్నాయి ఆకలితో. భార్య, పిల్లలు ఆదమరిచి నిద్రపోతున్నారు. ‘తనకు తిండి పెట్టకండా ఏ మాత్రం పట్టింపులేకుండా ఎలా నిద్రపోతున్నదో చూడు’ అని మనసులో అనుకుని వంట గదిలోని గిన్నెలు వెతకసాగాడు. అన్నం అడుగుకు మిగిలి ఉంది. పచ్చి పులుసు కూడా ఉన్నట్లుంది. ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూశాడు. అది పుల్లగా వాసన వస్తున్నది. ముఖం చిట్లించాడు రాజారెడ్డి. మామాడికాయ తొక్కుడబ్బా తీశాడు. మిగిలిన అన్నంలో పచ్చి పులుసు, మామిడికాయ తొక్కు కలగలిపాడు. ఆవురావురమంటూ బుక్కలు మింగాడు. క్షణాల్లో ప్లేట్లో అన్నం ఖాళీ అయ్యింది. కడుపు కుదురుకున్నది.
ప్రాణం చల్లబడినట్లుగా తోచింది. వెళ్లి మళ్లీ బెడ్ ఎక్కాడు. నిద్ర రావడం లేదు.
చేతిలోకి ఫోన్ తీసుకొని పరిశీలించసాగాడు. పైన అద్దానికి భూకంపంలా పగుళ్లు వచ్చాయి. అస్పష్టంగా ఫోన్ నెంబర్లు కనిపిస్తున్నాయి. నాలుగైదు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎవరెవరు చేశారో నని గమనించాడు. కానీ అవి సరిగ్గా కనిపించడం లేదు. తన భవిష్యత్తు లాగానే మసక మసకగా అవి కనిపిస్తున్నాయి. ఫోన్
చార్జింగ్ పెట్టుకొని బెడ్ పై ఒరిగాడు.
ఏవేవో ఆలోచనలు అతనిని కుదురుగా ఉండనివ్వడం లేదు. కళ్లు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ సాధ్యం కావడం లేదు. తలనొప్పిగా ఉంది. జండుబామ్ కోసం వెతికాడు. టేబుల్ సొరగులో దొరికింది. అడుగుకు కొంత మిగిలి ఉంది. దాన్ని కొనవేళ్లతో తీసి నుదురుకు రాసుకున్నాడు. జండుబామ్ ఘాటు వాసనకు ముక్కు పుటాలు అదురుతున్నాయి. కళ్లలోంచి నీళ్లు వస్తున్నాయి. ‘వచ్చే నిద్ర కూడా పోయేటట్టు ఉంది దీన్ని పెట్టుకుంటే అని మనసులో అనుకున్నాడు. సీస అడుగు భాగంలో ఉన్న కొద్ది పాటి బామ్ ను కూడా మొత్తం తీసి నుదురుకు రాసుకున్నాడు. భగ్గు భగ్గు మంటున్నట్లు ఉన్నా కొంత రిలీఫ్ ఇచ్చినట్లు అనిపిస్తుందతనికి. పోయి బెడ్ మీద ఒరుగుదామని అనుకుంటున్న సమయంలో బయట బైక్ చప్పుడు వినిపించింది.
ఇంత రాత్రి వేళ ఎవరబ్బా అని డోర్ తీసి ఆదరబాదరాగా బయటకు వచ్చాడు. గేటు తీసి చూశాడు. అప్పటికే ఆ బైక్ మూల మలుపు దాకా వెళ్లింది. మలుపు తిరుగుతోంది. బైక్ వేగం మరింత పెరిగింది. ముఖానికి మాస్కు ఉండటంతో ఎవరో గుర్తు పట్టలేదు రాజారెడ్డి. బైక్ వెళ్లిన వైపే చూసి మళ్లీ లోపలికి వచ్చి గేటు వేశాడు. వెళ్లి బెడ్ పై పడుకున్నాడు.
బైక్ పై ఉన్న వ్యక్తి రాజారెడ్డి బయటకు వచ్చిన విషయాన్ని గమనించాడు. ఆ విషయం రాజారెడ్డి కి తెలియదు.
*****
” లేవండి… మిమ్మల్నే …. ఎవరో సాయి అంట మీకోసం వచ్చాడు.” భార్య నిద్రలేపుతున్నది. ముసుగుతన్ని పడుకున్న రాజారెడ్డి మెల్లగా లేచి కళ్లు తెరిచాడు. నిద్ర సరిపోకపోవడంతో కళ్లు మండుతున్నాయి. రెండు కళ్లను చేతి వేళ్లతో నులుముకుంటూ లేచి చూశాడు. బయట వాకిట్లో ఎవరో తన కోసం వేచి చూస్తున్నారు. లేచి బయటకు నడిచాడు. సీనియర్ జర్నలిస్టు సాయి బయట కూర్చీలో కూర్చుని కనిపించాడు. రాజారెడ్డిని చూడగానే “ నమస్తే భయ్యా” అని పలుకరించాడు. “ఆ .. నమస్తే అన్న మీరా? పొద్దున్నే వచ్చారు” అన్నాడు. లుంగీ సర్దుకుంటూ అక్కడే అరుగుమీద కూర్చున్నాడు.
“మీకు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ లో షేరిఖ్ అయ్యిండ్రని తెలిసి అక్కడికి వెళ్లిన . మీరు అప్పటికే వెళ్లిపోయారని తెలిసింది. అందుకే ఇంటికి వచ్చిన” అన్నాడు.
“ రెండు నిమిషాలు.. నేను ఇప్పుడే వస్తా” అని చెప్పి బాత్ రూంలోకి నడిచాడు రాజారెడ్డి.
సాయి… సీనియర్ జర్నలిస్టు. చాలా ఏళ్లుగా రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. ఓ యూనియన్ నేత కూడా కావడంతో అందరి మంచిచెడ్డలు అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. సాయి కారులో రావడంతో ఇంటి ముందున్న కారును అక్కడున్న పిల్లలు ఆసక్తిగా చూస్తున్నారు.
దాన్ని చేతితో తడిమి చూస్తూ ఆనంద పడుతున్నారు.
రాజారెడ్డి భార్య సాయిని గమనిస్తున్నది. కాళ్లకు నల్లని బూట్లు. నీట్ గా డ్రెస్. ఇస్త్రీ బట్టలు తొడిగినట్లున్నాడు తళతళ మెరిసిపోతున్నాయి. బ్లాక్ ప్యాంట్ మీదకు నీలిరంగు నిలువు గీతలున్న వైట్ షర్ట్. ఇషర్ట్ చేసి ఉండటంలో మరింత దర్పంగా కనిపిస్తున్నాడు. చేతికి బంగారు బ్రేస్ లెట్. వేళ్లకు రంగురాళ్ల ఉంగరాలు తొడుక్కున్నాడు. మధ్య మధ్యలో బ్రేట్ ను చేతితో డమరు కొట్టినట్టుగా కిందికి జారుతుంటే పైకి జరుపుకుంటున్నాడు. చేతి వేలు ఉంగరాలను తిప్పుకుంటూ సరి చేసుకుంటున్నాడు. ఫోన్ లో తలపెట్టి దేన్నో ఆసక్తిగా చూస్తున్నాడు. అతన్ని వనజ తో పాటు పిల్లలు కూడా నఖశిఖ పర్యంతం చూస్తున్నారు. అతను తలపైకెత్తినప్పుడు తమను ఎక్కడ గమనిస్తున్నాడోనని పనిచేసుకుంటున్నట్లు నటిస్తున్నారు. కారు దగ్గర పిల్లల అల్లరి ఎక్కువైంది. వనజ బయటకెళ్లి వారిని అదిలించింది.
” ఏయ్ పిల్లలు….. పోండ్రిక్కడ్నుంచి…..” అని వెళ్లగొట్టింది. వారి ఇంటికి కారు వచ్చి నిలిచి ఉండటం ఆమెకు గర్వంగా తోచింది.
రాజారెడ్డి ముఖం కడుక్కొని వచ్చాడు. “లోపల కూర్చుందాం రా” అని సాయిని ఆహ్వానించాడు. సాయి మొహమాట పడుతున్నట్టుగా ” ఏం పర్వలేదన్నా… ఈడనే కూర్చుందాం… చల్లగాలి వస్తుంది” అని చెట్ల వైపు చూడసాగాడు.
అరుగు మీద కూర్చున్నాడు రాజారెడ్డి. “మీరేం టెన్షన్ పడకండన్నా….” అన్నాడు సాయి. రాజారెడ్డి నేల చూపులు చూస్తున్నాడు. “ఈ రోజుల్లో షుగర్ కామన్ అన్నా..” అన్నాడు మళ్లీ. తల పైకెత్తి చూశాడు రాజారెడ్డి . మళ్లీ నేలకు దించుకున్నాడు
తలను.
“ నాకూ ఉందన్న షుగర్. అసలు రిపోర్టర్లకు షుగర్, బీపీ, అల్సరు లేకపోతేనే ఆశ్చర్యం” అన్నాడు నవ్వుతూ. కానీ రాజారెడ్డికి నవ్వు రాలేదు. తమాయించుకున్నాడు సాయి. సాయి తనపై చూపుతున్న సానుభూతిని చూసి భరించలేకపోతున్నాడు రాజారెడ్డి.
భార్య, పిల్లల ముందు మరింత తలదించుకునేలా చేస్తున్నాడని అతను ఇబ్బందిగా కదిలాడు. అక్కడి పరిస్థితులు అతన్ని ఇరకాటంలో పెట్టాయి.
“ఐనా నీకు బతకడం చేతకాదన్నా……” అన్నాడు సాయి. ఒక్కసారిగా. చివాలున తలెత్తి చూశాడు రాజారెడ్డి.
సాయి.. జర్నలిస్టు ముసుగులో, యూనియన్ నేతగా చెప్పుకుంటు చేసే అక్రమాలు, అరాచకాలు, బెదిరింపులు రాజారెడ్డికి తెలుసు. తియ్యగా మాట్లాడి పనులు చేపించుకోవడం, వినకపోతే బెదిరింపులకు దిగడం. ఇదీ తన నైజం. జర్నలిస్టుగా అవతారం ఎత్తిన నాటి నుంచి ఇదే దోరణి అలవాటు చేసుకున్నాడు. చేతిలో కలం ఉంది కదా అని నచ్చనివారిని, వినని వారిని టార్గెట్ చేసి వార్తలు రాసి భయపెట్టడం సాయికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఏ పత్రికలోను, ఏ చానల్ లోనూ ఎక్కువ రోజులు పనిచేయలేదు. ఏదో ఒక చిన్న పత్రిక చేతిలో పెట్టుకొని దాంతోనే తన పబ్బం గడుపుకోవాలని చూసే సాయి దోరణి చాలా మందికి తెలుసు.
‘ఇపుడు ఆ సాయితోనే హితబోధ చేపించుకునే కర్మ పట్టింది కదరా భగవంతుడా’ అని మనసులో అనుకున్నాడు రాజారెడ్డి.
పరిస్థితులు బాగా లేవు. ఓపిక పట్టాలి’ అనుకున్నాడు. ‘వీడెన్ని నీతి సూక్తులు చెప్పినా సచ్చినట్టు వినాలి’ అని కూడా అనుకున్నాడు.
” నన్ను చూసి నేర్చుకో రాజారెడ్డి అన్నా…! అబ్దుల్లాపూర్మెట్ లో ఓ పెద్ద ఇళ్లు కట్టిన. అదీ ఇరవై ఏండ్ల కింద.”
“ అవును రా . కట్టావు. నాకు తెలియదా.. ఎంత మందిని బెదిరించిన అక్రమ సంపాదనతో కట్టించావో మాకు తెలియదా? చుట్టు పక్కలున్న పోలీసోళ్లను కూడా పిలిచావ్ కదా ఆ గృహ ప్రవేశానికి. వారితో నీకెలాంటి సంబంధాలున్నాయో మేము చూడలేదా?”
మనసులో తిట్టుకుంటూనే పైకి అవునన్నట్టు.. తెలుసన్నట్టు తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో చూస్తున్నాడు రాజారెడ్డి. రాజారెడ్డి కూతురు అనన్య ఇద్దరికీ చాయ్ తీసుకొచ్చి ఇచ్చింది. “నేను చాయ్ తాగను. నాకు షుగర్ ఉంది తెలుసు కదా రెడ్డి సాబ్ ” అన్నాడు సాయి.
” నువ్వు చాయ్ తాగవురా బేవకూఫ్. రాత్రి కాగానే మందు కావాలె. ఎవడో ఒకడు బక్రా దొరకాలే.”
రాజారెడ్డికి చాయ్ ఇచ్చి, మరో గ్లాసును లోపలికి తీసుకుపోయింది అనన్య. “నువ్వూ చాయ్ తాగొద్దన్న. నీకు చెప్తే అర్థం కాదు.. ” అన్నాడు. కొద్దిసేపు ఆగి ” ఈ కారు మొన్ననే కొన్నాను” అని టాపిక్ మార్చాడు. బయట రాచఠీవి ఒలకబోస్తున్న కారువంక చూపుతూ.
“ఎందుకు కొనవురా? అడ్డదిడ్డంగా సంపాదిస్తున్నావ్. ఎవడి నెత్తిన టోపీ పెట్టావో? ఎవడి కడుపు కొట్టావో? ఎంతమందిని మోసం చేశావో?”
” నీకేమైనా డబ్బులు అవసరం ఉంటే చెప్పన్నా? ఏం మొహమాటం లేదు. నువ్వు ఎప్పుడు ఏ అవసరం పడ్డా నేను ఉన్నానని గుర్తుంచుకో.”
” నీ అవసరం నాకు పడదురా కమీనే. ఇలాంటి తియ్యటి మాటలు ఎంత మందికి చెప్పి బోల్తా కొట్టించి ఉంటావురా అడ్డగాడిదా”
” అయినా ఈ మీడియాలో ఏముందన్నా? అయిపోయింది అంతా. రసం అంతా పిండేసుకున్నారు. ఇక పీల్చడానికి ఏ ముంది బొంగు?”
” మీడియా పని ఖతమైతే మరి నువ్వింకా దీన్నే పట్టుకు వేలాడుతున్నారేందిరా బోస్డీకే. ఏదైనా వేరే పనిచేసుకోవచ్చుగా. ఇవన్నీ మాకు చెప్తందుకేనా? నువ్వు పాటించవా?”
” ఫీల్డంతా కచ్రా అయిపోయిందన్నా. ఎవడెవడో ముక్కు మొఖం తెల్వనోడు… లోకం రీతి తెల్వనోడు దీంట్లోకి వచ్చి ఏదో సాధించామని విర్రవీగుతున్నారు”
” నీ అసొంటోడి వల్లే ఇది మరింత ఖరాబయ్యిందిరా బట్టేబాజ్. అవును కదా… నీలాగా అందరికీ బతకనేర్చే తెల్వి ఉండాలి కదా. ఇపుడొచ్చిన వెర్రి సన్నాసులకు ఆ తెలివి లేకపాయే. కరెక్ట్.”
” నీవు మారాలె అన్న. రాయడం ఒక్కటే తెలిస్తే సరిపోదన్నా. అది ఎవరైనా రాస్తారు. మా ఆఫీసుల డీటీపీ ఆపరేటర్ కూడా విషయం చెప్తే కొట్టేస్తడు. నాలుగు పైసలు సంపాదించేది తెలుసుకోవాలె.”
” అది తెలిస్తే నీతో ఎందుకురా ఇలా నీతులు తింటాను దగుల్బాజీ! పొద్దు పొద్దున్నే నేనే దొరికానా రా నీకు. ఇగ చాలు పోరా నీ యవ్వ….”
“ఏందన్నా సప్పుడు చెయ్యవు?”
“సరే మరీ నేను వెళ్తా…. “అని లేచాడు సాయి. దీని కోసమే నేను ఎదురుచూస్తన్నది అన్నట్టుగా టక్కున లేచాడు రాజారెడ్డి. కారు దాకా వచ్చాడు. “మైలేజీ బాగా ఇస్తుందన్న…” అన్నాడు. కారును చూపిస్తూ.
“అదెంతిస్తే నాకెందుకురా గాడిది కొడకా…” అని మనసులో అనుకొని .. ఔనా’ అన్నట్లుగా ఫేస్ ఫీలింగ్ ఒకటి వదిలాడు రాజారెడ్డి.
“ఇక దయచేయరా బాబు… నీకు దండం పెడతా… నువ్వూ నీ బిల్డప్” “రెస్ట్ తీసుకో అన్నా… టెన్షన్ పడకు.” “నా తిప్పలు నేనేవో పడతా. నువ్వు ఆర్చేటోడివా? తీర్చెటోడివా?” “నువ్వు ఫ్రీ కాగానే ప్రెస్ క్లబ్ కు వచ్చి నాకు ఫోన్ చెయ్యి…. కలిసి మాట్లాడుకుందాం”
“నువ్వు పోరా ఫస్టు హౌలే సాలే. నన్ను పరామర్శించేందుకు వచ్చినట్లు లేదురా, నీ డాబు చూపించుకొని సూక్తి ముక్తావళి వినిపించేందుకు వచ్చావురా నువ్వు……..”
“అన్నా… వెళ్తా మరి” “సరే భయ్య ఓకే…..” కారు మూల వరకు రివర్స్ తీసుకొని రయ్యిన వెళ్లిపోయాడు. ఆ సందులో ఇంటి బయటే నిలబడి కొందరు ఆసక్తిగా చూస్తున్నారు. ఇంట్లోకి నడిచాడు రాజారెడ్డి. కిటికీలోంచి, డోర్ వద్ద నిలబడి ఇదంతా చూస్తున్నారు భార్య, పిల్లలు. లోపలికి వచ్చి బెడ్ పై కూర్చున్నాడు. “ఆయనా జర్నలిస్టే కదా? ఎంత సంపాదించాడో చూడండి? మీరూ ఉన్నారు ఎందుకు?” అన్నది వనజ. ‘మొదలైందా’ అనుకున్నాడు మనసులో. “అతన్ని చూసైనా నేర్చుకోండి….”
“……………..”
“అయినా నా పిచ్చిగానీ. ఇన్నేండ్లు లేనిది ఇపుడు కొత్తగా వస్తదా? ”
“…………….”
“పెద్ద ఇల్లు కట్టాడంట… అతని భార్య,
పిల్లలు నిజంగా అదృష్టవంతులు” . ఇక తనవల్ల కాలేదు రాజారెడ్డికి.
“పెండ్లాం పిల్లలు ఉండంగా తనకంటే చాలా చిన్న అమ్మాయితో వీడు ఇక్కడే మరో సంసారం పెట్టాడు.. మరి నన్ను పెట్టమంటావా?”
సాయి గురించి భర్త చెప్పిన విషయం విని షాక్ తిన్నది వనజ. ‘అవునా?” అన్నట్లు ఆశ్చర్యంగా కళ్లను పెద్దవి చేసి చూసింది. ఏమి మాట్లాడాలో తెలియక లోపల వంట గదిలోకి వెళ్లింది. ఇదే మంచి సమయం అనుకున్నాడు రాజారెడ్డి. భార్యను ఇరుకున పెట్టే అవకాశాన్ని వదులుకోవద్దనుకున్నాడు.
“ వాడు బ్లాక్ మెయిల్ చేస్తాడు. అదే ఆఫీసర్లు లంచాలు గుంజుతారే… అలాగన్నమాట. వీడో పెద్ద లంచగొండి” అన్నాడు
భార్య నుంచి ఉలుకు పలుకు లేదు. ” జర్నలిజం ఇలాంటి వాళ్ల వల్లే సంకనాకిపోయింది” అన్నాడు మళ్లీ . లోపలి నుంచి చిర్రు బుర్రులాడుతూ వచ్చిన వనజ.. – “నీతి, నిజాయితీ అంటు పనిచేసి మీరేం ఒరగబెట్టారు? మా గురించేనాడైనా పట్టించుకున్నారా?” “ తెల్లారి లేచింది మొదలు.. ఆఫీసు పని అంటూ దానికే అంకితమయ్యారు” అన్నది.
“నిజాయితీగా పనిచేయడంలో ఉన్న సంతోషం నీకేం తెలుసు?” “ఇప్పటికీ చాలా మంది సీనియర్ జర్నలిస్టులు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారు. మంచి మంచి కథనాలు రాస్తున్నారు. మానవీయ కోణంలో పేదవారి జీవన స్థితిగతులను వెలుగులోకి తెస్తున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారు.”
ఆవేశంగా భార్య వైపు చూశాడు రాజారెడ్డి. ఇంకేమి అడుగుతుందోనని.
“ఎవరేం చేసినా వారి కుటుంబాల కోసం పట్టించుకుంటున్నారు కదా? నీలాగా మమ్మల్ని గాలికొదిలేసినట్లు వదిలేయలేదు కదా.”
ఆ మాటలు సూటిగా వచ్చి రాజారెడ్డి గుండెలో బాకులా దిగబడ్డాయి. “అంటే నేను మిమ్మల్ని పట్టించుకోవడం లేదా?”
“పట్టించుకుంటే మా బతుకులిలా ఎందుకేడుస్తాయి?” “అంటే ఆ సాయి గాడిలా అడ్డమైన గడ్డి తిన్నా పర్వాలేదు. మీకు మాత్రం బాగా సంపాదించి పెట్టాలి. అంతేక కదా”
ఆమె మాట్లడలేదు.
“బయట ‘థూ’ అని ఉమ్మించుకున్నా పర్వాలేదు. పైకి టిప్ టాప్ గా టక్ వేసుకొని కార్లో తిరగాలి. ఇదే కదా నీకు కావాల్సింది.”
ఆమె మౌనంగా తన పని తాను చేసుకుంటున్నది. వనజ మౌనం రాజారెడ్డిని మరింత రెచ్చగొట్టేలా చేస్తున్నది.
“ పెండ్లాం పిల్లలున్నా… దేంతోనే వేరే కాపురం పెట్టి జల్సా చేసినా పర్వాలేదు….. మీ గొంతెమ్మ కోర్కెలన్నీ తీర్చాలంటావ్……. అంతేనా?”
ఈసారీ అక్కడ్నుంచి మౌనమే సమాధానమయ్యింది. ఉలుకు లేదు పలుకు లేదు. తోక తొక్కిన తాచులా లేచాడు రాజారెడ్డి.
కోపంతో ఊగిపోతూ అన్నాడు. “ఏం చెప్పవే? నేను గాడిదలా ఓండ్ర పెడుతుంటే నీ చెవికి ఎక్కడం లేదా?” అన్నాడు.
కండ్లు ఎర్రగా మారాయి. స్వర పేటిక చిరిగిపోయిందా? అన్నట్లుగా మాటలు చీలిపోతున్నట్లు వస్తున్నాయి. బొంగురు పోతున్నాయి. గొంతు వణుకుతోంది.
వనజ ఓ సారి రాజారెడ్డి వైపు గుడ్లురిమి చూసిందే కానీ ఏమాత్రం జంకలేదు. “అంటే… అంటే…. నేను గాడిదనే అంటవ్…” అన్నాడు. “ నా మాటలు నీకు గాడిద మాటల్లా వినబడుతున్నాయి కదా! ఆ చూపుల భావన అదేనా?” వంటగదిలోని సింక్ లో గిన్నెలు తోముతున్నది వనజ. ఆ గిన్నెలపై తన కోపాన్ని చూపిస్తున్నదామె. మామాలుగా గిన్నెలు తోమేటప్పుడు పెద్దగా చప్పుడు కాదు.
కానీ ఇపుడు కిర్.. కిర్ మని గిన్నెని కిచెన్ గచ్చు అంచుకేసి గట్టిగా రాపిడి చేస్తూ తోముతున్నది.
కోపంతో పళ్లు పటపట కొరుకుతున్నట్లే ఆ చప్పుడు వస్తున్నది. ఆ విధంగా భర్తపై తన నిరసనను మరింత ప్రభావితంగా చూపేందుకు ఆమె ప్రయత్నం చేస్తున్నది.
ఆమె చేస్తున్న ప్రయత్నం అతనికి అర్థమయ్యింది. తన ఆర్తనాదాలు అరణ్య రోదనే అవుతున్నాయని అతను గ్రహించాడు.
కోపం మరింత నషాలానికంటింది.
“నీకెంత పొగరు. నేను ఇంతలా రొప్పుతుంటే …. చప్పుడు చెయ్యవేం… మొద్దు ముండా!” అన్నాడు. అతని కళ్లు మరింత ఎరుపెక్కాయి. ముఖం జేవురించింది. కాళ్లు చేతులు వణుకుతున్నాయి. కోపంలో శరీరం పట్టుతప్పుతున్నది. అది రాజారెడ్డికి తెలుస్తోంది. ఎంత తమాయించుకుందామన్నా అది సాధ్యం కావడం లేదు. ఇపుడు రాజారెడ్డి శరీరం అతని నియంత్రణలో లేదు.
(ఇంకా ఉంది)
