ఇదో కొత్త ప్రయోగం. దర్శకుడు శేఖర్ కమ్ముల కథలన్నీ వెరైటీగానే ఉంటాయి. ఇది ఇంకొంచెం వెరైటీగా ఉంది. కానీ ఈ ప్రయోగాన్ని ఎంచుకున్న దర్శకుడు ఎటు నుంచి ఎటు తీసుకెళ్లాలో…? ఎక్కడ ఎలా ముగించాలో తెలియక కంగారు పడ్డాడు. కథను కిచిడీ చేసి చెప్పాలనుకున్నది ఇంకా బాగా చెప్పలేక చతికిలబడిపోయాడు. లవ్‌స్టోరీని ప్రేక్షకులు ఫీల్ కాకుండా చేశాడు. క్లైమాక్స్ అలా కిచిడీ కింద తయారు చేసి వదిలేశాడు. నాగచైతన్య నటనకు పేరు పెట్టాల్సిన పనిలేదు. నాచురల్‌గా నటించాడు. ఆర్మూర్ ప్రాంతం.. పిప్రి గ్రామంలో షూటింగ్ దీని ప్రత్యేకత. ఓ దళిత యువకుడిగా చై తన పాత్రలో ఒదిగిపోయాడు. అసలు ఇలాంటి పాత్రను ఒప్పుకోవడంలోనే అతను సక్సెస్ అయినట్టు.
సాయి పల్లవి కూడా కథ ఎంపికలో మంచి నిర్ణయమే తీసుకున్నది. కేరీర్ పరంగా ఇద్దరికీ ఉపయోగపడే సినిమా ఇది. ఇక కథలోకి వస్తే.. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన దళిత యువకుడు చై. అదే ఊరుకు చెందిన ఉన్నత వర్గానికి చెందిన యువతి సాయిపల్లవి. అనుకోకుండా హైదరాబాద్‌లో కలుసుకుంటారు. అప్పటికే ఫిట్నెస్ సెంటర్ నడుపుతుంటాడు చై. ఊరు విడచినా.. కులం జాడలు మాత్రం ఈ పాత్రను వీడవు. అంటరానివారిగా తమను చూస్తారని తల్లి నూరిపోయిన భావాలనే అంటిపెట్టుకుని.. అదే ఇన్ఫిరియారిటీతో బతుకుతుంటాడు హీరో. సాయిపల్లవిని ప్రేమించిన తర్వాత.. అదే ఊరు పటేల్ బిడ్డ అని తెలిసి భయపడతాడు.
కానీ హీరోయిన్ మనస్తత్వం, ప్రేమకు కరిగిపోతాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అంతకు ముందే దళితుడైన తన స్నేహితుడిని చంపేస్తారు అమ్మాయి తరపు పెద్దలు. ఇది చూసి హీరో భయపడతాడు. పోలీసు ఆఫీసర్ ఉత్తేజ్‌ను ఆశ్రియిస్తాడు. సాయిపల్లవి ఆత్మహత్యచేసుకున్నట్టు చేసి దూరంగా పారిపోతే తప్ప మిమ్మల్ని బతకనివ్వరనే ఉత్తేజ్ చెత్త సలహా పాటిస్తాడు హీరో. ఇదంతా వేస్ట్ ఎపిసోడ్. వృథా ఖర్చు. హీరోకు తనమీద తనకు నమ్మకం లేక భయంతో పారిపోయే మనస్తత్వాన్ని తెలియజెప్పేశాడు డైరెక్టర్. అంతా అనుకున్నట్టే జరిగిపోతుందనగా.. కొత్త ట్విస్ట్ పెట్టాడు.
సాయిపల్లవిని చిన్నతనంలోనే తన బాబాయి రాజీవ్ కనకాల అత్యచారం చేశాడనే విషయాన్ని చెప్పిస్తాడు. సాయిపల్లవి చెల్లెను కూడా అదే విధంగా బలాత్కరించే సీన్ పెట్టి..ఫ్లాష్‌బ్యాక్ చెప్పిస్తాడు. అప్పుడు గానీ హీరో రియలైజ్ కాడు. కులం గురించి కొన్ని డైలాగులు ఇక్కడ చెప్పించి.. తాడో పేడో తేల్చుకుందామని నేరుగా రాజీవ్ కనకాల ఇంటికి వెళ్తాడు. అక్కడ చిన్న ఫైటింగ్ సీన్. తోపులాటలో రాజీవ్ చనిపోతాడు. కోర్టు ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదని తీర్పిచ్చేస్తుంది. అంతే…..
కులం పేరుతో గ్రామాల్లో ఇప్పటికీ చిన్నచూపు ఎలా ఉంది. ఆ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే మెయిన్ కథతో లవ్‌స్టోరీని అల్లుకోవడంతో దర్శకుడు విఫలమయ్యాడు. ఏదో చెప్దామని ఏదో చెప్పేశాడు. పాటలు సోసో.. కుడిభుజం మీద కడవ లాస్ట్‌కు వచ్చింది కొంత రిలీఫ్.. కథ నుంచి. పాత్రలన్నింటికీ తెలంగాణ యాసనే వాడుకున్నాడు దర్శకుడు. బాగుంది. కానీ చాలా చోట్ల చాలా పాత్రలకు ఈ మాటలు అతకలేదు. అలా రాయలేదు. చైతన్యకు కూడా ఈ మాటలు పూర్తిగా ఆప్ట్ కాలేదు. చాలా చోట్ల డైలాగులు అతికినట్టు లేవు. కృతకంగా ఉన్నాయి.