తీన్మార్ మల్లన్నను మరోసారి పోలీసులు అరెస్టు చేయాలని విఫలయత్నం చేశారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు నిన్న ఇక్కడ నుంచి టీమ్‌గా బయలుదేరారు. హైదరాబాద్ లోకల్ పోలీసులకు సమాచారమిచ్చారు. వారిని అలర్ట్ చేశారు. పక్కా స్కెచ్ వేశారు. అంతా అనుకున్నట్టే జరిగితే తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేసి నిజామాబాద్‌కు తీసుకువచ్చేవారు. తీన్మార్ మల్లన్న చంచల్ గూడ జైళ్లో ఉన్నాడు. నిన్న ఎల్బీ నగర్ కోర్టులో బెయిల్ సంబంధించిన వాదనలు ఉండే. బెయిల్ దొరకగానే పీటీ వారెంట్ కింద మళ్లీ అరెస్టు చేయాలని పోలీసులు భావించారు. కానీ బెయిల్‌పై వాదనలు రేపటికి వాయిదా పడ్డాయి. దీంతో రేపు మళ్లీ ఎడపల్లి పోలీసులు అక్కడికి వెళ్లనున్నారు. కాపు కాసి మళ్లీ మల్లన్న ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో పోలీసులు అర్ధరాత్రి తిరుగుముఖం పట్టారు. మల్లన్న పాదయాత్ర కోసం కల్లు వ్యాపారి జయవర్దన్ గౌడ్ వద్ద 20 లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో ఏ1గా ఉప్పు సంతోష్‌ను, ఏ2,ఏ3లుగా లోకల్ గౌడ కులస్తులను, ఏ4గా తీన్మార్ మల్లన్నపై కేసులు పెట్టారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తీన్మార్ మల్లన్నను ఇదే కేసు విషయంలో మరోసారి అరెస్టు చేసేందుకు వారెంట్ కూడా రెడీ చేసుకున్నారు. దాదాపు 30కు పైగా మల్లన్నపై కేసులున్నాయి. జర్నలిస్టు ముసుగులో సీఎంను ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని , ఇక ఊరుకునేది లేదని కేటీఆర్ అన్న మరుసటి రోజే తీన్మార్ మల్లన్నను అరెస్టు చేశారు. ఇకపై మల్లన్నపై ఈ కేసుల వేట కొనసాగనుంది. పోలీసుల సర్చింగ్ వెంటాడనుంది.