ప్ర‌భుత్వం కొత్త పింఛ‌న్ల‌కు మంజూరి ఇవ్వ‌డం మానేసి రెండున్న‌రేండ్లు అవుతున్న‌ది. అవి అలాగే స‌ర్కారు ద‌గ్గ‌ర మూలుగుతూ ఉన్నాయి. దాదాపు రెండు ల‌క్ష‌ల‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇవ్వాల్సి ఉంది. దీని ఊసు లేదు. దీని గురించి ప్ర‌భుత్వం ఇప్ప‌ట్లో ప‌ట్టించుకునే దాఖ‌లాలు కూడా క‌నిపించ‌డం లేదు. కానీ హుజురాబాద్ ఎన్నిక‌ల సంద‌ర్భాన్ని దృష్టిలో ఉంచుకుని మొన్న వృద్ధాప్య పింఛ‌న్‌కు అర్హ‌త వ‌య‌స్సు త‌గ్గించి ఇచ్చిన హామీ మేర‌కు కొత్త ద‌ర‌ఖాస్తులు హ‌డావుడిగా తీసుకున్నారు. వాటిని స‌ర్కారుకు పంపారు. ఇవీ ఇప్ప‌ట్లో రావు. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కూ ప‌రిస్థితి ఇలాగే ఉండే అవ‌కాశం ఉంది.

కానీ ప్ర‌తీనెల కొత్త‌గా వ‌చ్చే ద‌ర‌ఖాస్తుల‌ను జిల్లాల్లో తీసుకుంటూనే ఉంటారు. ఒక‌టో తారీఖు నుంచి ప‌దిహేనో తారీఖు వ‌ర‌కు ఎంపీడీవోలు వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను తీసుకుని ఎంక్వైరీ చేసి డేటా ఎంట్రీ చేస్తారు. 16 నుంచి 22 తారీఖులోపు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అన్ని స‌రిగ్గా ఉన్నాయో లేదో చూసి వీటిని అప్రూవ్ చేస్తారు. ఈ ప్రాసెస్ ప్ర‌తీనెల జ‌రుగుతుంది. అప్రూవ్ చేసిన వాటిని స‌ర్కార్‌కు పంపించేస్తారు. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం ఎప్పుడు వీటికి సాంక్ష‌న్ ఇస్తుందో తెలియ‌దు. అయితే, ప్ర‌తీనెలా వ‌చ్చే ద‌ర‌ఖాస్తుల్లో 80 శాతం వితంతు పింఛ‌న్ల కోస‌మే వ‌చ్చే ద‌ర‌ఖాస్తులుంటున్నాయి. మిగిలిన వృద్ధాప్య‌, ఒంట‌రి మ‌హిళ‌లు, విక‌లాంగులు…ఇలా ఉంటున్నాయి. ఈ 80 శాతం వితంతు పింఛ‌న్ల కోసం వ‌చ్చిన వారిలో అత్య‌ధికంగా ముస్లిం మ‌హిళ‌లు ఉంటున్నార‌ట‌. చిన్న వ‌య‌స్సులోనే భ‌ర్త‌ల‌ను కోల్పోయి … పింఛ‌న్ మీద ఆధార‌ప‌డుతున్న మ‌హిళ‌ల సంఖ్య తెలంగాణ‌లో పెర‌గుతున్న‌ది. కార‌ణం.. గుండెపోటు, రోడ్డు ప్ర‌మాదాలే అత్య‌ధికంగా మ‌హిళ‌ల‌ను వితంతులుగా మారుస్తున్నాయ‌ని చెబుతున్నారు అధికారులు.

భ‌ర్త‌ను కోల్పోయి ప్ర‌భుత్వం ఇచ్చే ఈ చిన్న‌పాటి భ‌రోసా కోసం వారు పింఛ‌న్ కోసం అప్లై చేసుకుంటే.. ఏళ్ల త‌ర‌బ‌డి వాటిని అలాగే ఉంచేస్తున్న‌ది ప్ర‌భుత్వం. పైస‌ల్లేవ‌ని, ఖ‌జానా ఖాలీ అని ఏవేవో సాకులు చెబుతున్న‌ది. ఇత‌ర‌త్రా రాజ‌కీయ అవ‌స‌రాల‌కు, ఇవ్వ‌ని హామీల అమ‌లుకు మాత్రం దూకుడు ప్ర‌ద‌ర్శించి ఓట్ల ల‌బ్ది కోసం పాకులాడే తెలంగాణ స‌ర్కార్.. ఇలా పెద్ద దిక్కుకోల్పోయి భ‌రోసా కోసం ఎదురుచూస్తున్న వింతుతుల‌కు ఇక‌నైనా ఆస‌రా మంజూరు చేస్తే బాగుంటుంది. మాన‌వీయ పాల‌న అని చెప్పుకునే స‌ర్కార్‌కు ఈ సంఘ‌ట‌న ఓ మాయ‌ని మ‌చ్చే. ఓ ఆడ‌బిడ్డ చెప్పుల‌రిగేలా ఆఫీసుల చుట్టూ తిర‌గాలి.అప్రూవ్ అయినా.. ఇంకా రాలేదా అని క‌ళ్ల కాయ‌లు కాచేలా చూడాలి. ఇదీ మ‌న స‌ర్కార్ నీతి. రీతి.

You missed