అప్పుడ‌ప్పుడు జ‌ర్న‌లిస్టు సంఘాలు బ‌తికే ఉన్నాయ‌ని చెప్ప‌డం కోసం విన‌తిప‌త్రాలు ఇస్తూ ఉండాలె. చాంతాడంత అమ‌లు కానీ డిమాండ్ల‌ను పొందుప‌ర్చి సీఎంకు పంపుతూ ఉండాలె. ఏండ్ల త‌ర‌బ‌డి ఇవేవీ అమ‌లు కావు.. అన్నీ బుట్ట‌దాఖ‌లేన‌ని తెలిసినా అలా అప్పుడ‌ప్పుడు మ‌న ఉనికి చాటుకునేందుకు క‌లెక్ట‌ర్ల‌ను క‌ల‌వాలె. విన‌తిప‌త్రాలు విన‌యంగా ఇవ్వాలె. డ‌బుల్ బెడ్ రూంలు ఇవ్వండి సారూ.. మీకు దండం పెడ‌తామ‌ని మొక్కాలె. ఇండ్ల స్థ‌లాలు ఇవ్వండ‌ని వేడుకోవాలె. ఇవేవీ కావ‌ని తెలిసినా ప‌దేప‌దే అడుగుతూ ఉంటే ఇంకా కొన్నేండ్లకైనా ఎప్పుడో ఒక‌ప్పుడూ వ‌స్తాయ‌నే ఆశ‌తో అలా అల్ప‌సంతోషులుగా అలుపెరుగ‌ని పోరాటం చేస్తూనే ఉండాలె. జ‌ర్న‌లిస్టుల పై దాడులు అరిక‌ట్టాల‌ని, జ‌ర‌గ‌ని ప‌నిని గుర్తు చేయాలె.

హెల్త్ కార్డులు ఇవ్వాల‌ని, అన్ని ఆస్ప‌త్రుల్లో అవి ప‌ని చేయాల‌ని ప్రాణాలు పోయినంక కూడా ప‌దేప‌దే వేడుకోవాలె. క‌రోనాతో చ‌నిపోయిన కుటుంబాల‌కు 25ల‌క్ష‌లు ఇవ్వాల‌ని కోరుకోవాలె. 25 అడిగిన చోట ఐదైనా ఇవ్వ‌క‌పోతారా? అని ఆశ‌తో ఎదురుచూడాలె. దీర్ఘ‌కాలంగా, అప‌రిష్కృతంగా ఉన్న డిమాండ్ల అంటూ మ‌న‌మే ఆత్మ‌వంచ‌న చేసుకుని గుర్తు చేయాలె. ఎన్ని సార్లు చెప్పినా ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విష‌యాన్ని కొంచెం సిగ్గు విడిచైనా ఆ విన‌తిప‌త్రంలో చెప్పుకోవాలె. మ‌ళ్లీ మూడు నెల‌ల త‌రువాత ఇదే విన‌తిప‌త్రాన్ని అదే పెద్ద సారుకు అందించాలె. దీర్ఘ‌కాలంగా అప‌రిష్కృతంగా ఉన్నాయ‌నే విష‌యాన్ని మ‌రోసారి గుర్తు చేయాలె. మ‌రో ఆరు నెల్ల‌కు మ‌రో విన‌తిప‌త్రం త‌యారు చేయాలె.