రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సమైఖ్య ఆంధ్రలో ఉన్న సమయంలో కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇంతలా హీనంగా తిట్టలేదు. ఘోరంగా మాట్లాడలేదు. వ్యక్తిగత దూషణలకు దిగలేదు. కానీ ఇప్పటి ప్రతిపక్షాలు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి. ఎంత తిడితే అంత మైలేజీ వస్తుందని భావిస్తున్నాయి.

బీజేపీ ఈ వ్యక్తిగత దూషణలకు అజ్యం పోస్తే.. కాంగ్రెస్ అందిపుచ్చుకుని దీంతోనే తన ఉనికి ఉందనే విధంగా వ్యవహరిస్తోంది. ఇది ఎక్కడి వరకు వెళ్లిదంటే.. వ్యక్తిగత విషయాల బట్ట కాల్చి మీదేసి బజారుకీడ్చి బద్నాం చేసేదాకా. కాంగ్రెస్ లీడర్ బక్క జడ్సన్ నిన్న ఈడీ జేడీకి కేటీఆర్ పై ఫిర్యాదు చేశాడు. డ్రగ్స్‌తో సంబంధాలున్నాయని, సినీ తారలతో లింకులున్నాయంటూ కేటీఆర్‌ను నైతికంగా దెబ్బతీసే విధంగా ఫిర్యాదు చేశాడు.
అదే రోజు గజ్వేల్‌లో జరిగిన సభలో రేవంత్ సైతం సీఎం కేసీఆర్‌ను తాగుబోతు అన్నాడు. కేటీఆర్‌ను డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు అని ఆరోపించాడు. ఇదిలా లెక్క పత్రం లేకుండా, హద్దూ పద్దు లేకుండా సాగుతున్న క్రమాన్ని కేటీఆర్ ఈ రోజు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. తనదైన శైలిలో ఘాటుగా స్పందించాడు. ఇది వరకే కేటీఆర్ పార్టీ శ్రేణులకు ఈ విషయంలో పిలుపు ఇచ్చి ఉన్నాడు.

 

ఈట్ కా జవాబ్ పత్తర్ సే అనే విధంగా ఒకటంటే పది అనాలని చెప్పి ఉన్నాడు. అయినా ప్రతిపక్షాలు ఎక్కడా తగ్గలేదు. మరింత రెచ్చిపోయాయి. ఏకంగా కేటీఆర్‌ను డ్రగ్స్ బురదలోకి దించేందుకు కూడా వెనుకాడలేదు. దీంతో కేటీఆర్ సహజంగానే ఆవేశానికి లోనయ్యాడు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. పరువు నష్టం దావా వేయడంతో పాటు రాజద్రోహం కేసులు కూడా పెడతామని స్పందించడం ఇదే మొదటి సారి. పరిస్థితి తీవ్రతకు ఇది అద్ధం పడుతుంది.

తనసై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ లీడర్‌ను బఫూన్ అని తిట్టిన కేటీఆర్.. ఎలాంటి పరీక్షలకైనా తాను సిద్ధమని ప్రకటించారు. రాహుల్ గాంధీ కూడా శాంపిల్ ఇస్తాడా అని రేవంత్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాడు. బట్టలు ఊడదీస్తానని, ఎవరిని వదిలిపెట్టనని, అందరి బాగోతాలు తమ దగ్గర ఉన్నాయని కేటీఆర్ ఘాటుగానే స్పందించాడు. కానీ తనకు తెలియకుండానే కేటీఆర్ ప్రతిపక్షాల ఉచ్చులో ఇరుక్కుపోతున్నానే విషయం తెలుసుకోలేకపోతున్నాడు.

కేటీఆర్ ఈ విధంగా స్పందించడం వల్ల ఒరిగే ప్రయోజనం ఏమి లేదు. ప్రతిపక్షాలు ఇంకా మరింత రెచ్చిపోయి కేటీఆర్‌ను మరింత రెచ్చగొడతాయి. ఎందుకంటే వారికి కావాల్సింది ఇదే. కేటీఆర్ ఎన్ని కేసులు పెడితే ఆ పార్టీలు అంత బలపడతాయని, వ్యక్తిగతంగా వారు మరింత ఫేమస్ అవుతారనే విషయాన్ని కేటీఆర్ విస్మరిస్తున్నాడు. ఆరోపణలను హుందాగా సబ్జెక్టుతో ఇరుకున పెట్టే విధంగా కౌంటర్ ఇవ్వవచ్చు.

కానీ కేటీఆర్ ఆవేశ పడుతున్నాడు. సమయం కోసం, సందర్భం కోసం ఓపిక పట్టే నైజం కేటీఆర్‌కు లేదు. దుందుడుకుగా వ్యవహరించే ధోరణి తమకే నష్టం చేస్తుందనే విషయం కేటీఆర్‌కు చెప్పే వారెవరూ? కేటీఆరే ఇలా అంటే ఇక కింద ఉన్న వాళ్లకు పట్టపగ్గాలుండవు. మరింత రెచ్చిపోయి మాట్లాడే క్రమంలో ఉన్న పరువు తీసుకుని ప్రజల వద్ద మరింత చులకన అవ్వడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. కేసీఆర్‌ను తాగుబోతు అని తిట్టడం తరహా ధోరణి గతంలో ఏ ప్రతిపక్ష నేత ఇలాంటి మాటలను వాడలేదు. కానీ తెలంగాణలో ట్రెండు మారింది. ఎంత తిడితే అంత మైలేజీ. ప్రజలు కూడా దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అధికారం కోసం ఏమైనా చేసేందుకు, ఏదైనా అనేందుకు సిద్ధపడ్డ ప్రతిపక్షాల ఎత్తుగడలకు అధికార పార్టీ కూడా చిత్తవుతున్నది. సోయి మరిచి తను కూడా అదే స్థాయికి దిగి బస్తీమే సవాల్ అంటున్నది.

 

You missed