మీడియా మొత్తం సెలబ్రిటీల చుట్టూ చక్కర్లు కొడుతూ తరిస్తున్న ప్రస్తుత తరుణంలో చైత్ర ఘటన ఓ చెంపపెట్టులా మారింది. మీడియా అసలు రంగు ఈ ఘటన బయట పెట్టింది. చాలా మంది ఆరేళ్ల చిన్నారి దారుణంగా రేప్‌కు గురై హత్య గావింపబడ్డా పట్టించుకోలేదు. ఏకంగా జర్నలిస్టు మూర్తి అయితే ఓ మూడడుగులు ముందుకేసి ఇలాంటివి కవర్ చేయడం మూలంగా బాధితులకు కష్టమవుతుందని ఓ సమర్ధింపు వివరణ ఇచ్చుకుని నవ్వుల పాలయ్యాడు.
రాజకీయ పార్టీల నేతలు కూడా దీన్ని లైట్‌గానే తీసుకున్నారు. మీడియా మొత్తం సాయిధరమ్ తేజ్ ఉన్న అపోలో హాస్పిటల్ ముందు తిష్టవేసింది. కానీ వీరందరికి భిన్నంగా వయసులో చిన్నవాడైనా సినీ నటుడు మంచు మనోజ్ స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకున్నది. సమయాన్ని బట్టి ఆ హీరో మాట్లాడిన మాటలు నిజంగా ఓ హీరోగానే నిలబెట్టాయి. వెండతెర పై హీరోలుగా చెలామణి అవుతున్న చాలా మందితో పోలిస్తే ఈ ‘మంచు’ కుర్రాడు చాలా బెటరే. పనిలో పని మీడియాను అరుసుకున్నాడు. మీడియా పోకడలనూ కడిగేసాడు. చురకలంటించాడు. సుతిమెత్తగానే హితబోధ చేశాడు. అయినా మనం మారుతామా ఏంటీ? మనం ఇంతే?