సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ కవరేజీలో మన టీవీ ఛానళ్లు పోటీలు పడుతున్నాయి. కవరేజీలో అనుక్షణం మేమే ముందున్నామని చెప్పుకునేందుకు తంటాలు పడి అభాసుపాలవుతున్నాయి. యాక్సిడెంట్ జరిగిన తర్వాత క్షణం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఇక ఏ వార్తలు లేవన్నట్లుగా ఇదే ప్రపంచ సమస్య అయినట్టుగా పాపం మన మీడియా పాఠకులకు బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేందుకు తెగ కష్టపడి పోతున్నాయి.
టీవీ 9 అయితే అన్నింటికంటే ముందు వరుసలో చేరింది. మొన్నటికి మొన్న వర్షాన్ని ‘రుధిరం’ అని భారీ నామకరణం ఒకటి చేసి ఆ తర్వాత నాలిక కర్చుకుని, పొరపాటు గ్రహించి తప్పుదిద్దుకునే అవకాశం లేక తల్లడిల్లి.. సొమ్మసిల్లి.. ఆపై తెప్పరిల్లి ఇది మాకు సహజమే అనే రీతిలో మేలుకొని యథావిధిగా తన స్టై్మల్‌లోనే ఈరోజు మళ్లీ ఓ ఎక్స్‌క్లూజివ్ స్టోరీని వదిలింది. అదేంటంటే.. సాయిధరమ్ తేజ్ వాడిన స్పోర్ట్స్ బైక్ పూర్తి విశేషాలు, దాని మ్యానుప్యాక్చరింగ్ వివరాలతో ఓ అద్భుతమైన స్టోరీని పాఠకులకు అందించి ఔరా.. అనిపించుకుంది.
గతంలో సినీ నటి శ్రీదేవి చనిపోయినప్పుడు బాత్ టబ్బులో ఆమె ఏ విధంగా స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు చనిపోయిందో చెప్పేందుకు మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పడిన యాతన, తపన అంతాఇంతా కాదు. అప్పుడు కూడా ఈ వైఖరి పాఠకులకు రోత పుట్టించింది. ఎవరేమనుకుంటే మాకేంటి? మాకు నచ్చింది చేస్తాం.. చూస్తే చూడండి.. లేకపోతే చావండి.. మేమింతే.