నిజామాబాద్ జిల్లా టీఆరెస్ పార్టీ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డిని ముద్దుగా ‘లక్కీ అధ్యక్షుడ”ని పిలుచుకుంటారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు వేదికల మీద ఆయన్ను ఇలాగే సంబోధిస్తారు. పార్టీ అధ్యక్షుడిగా ఈగ ఉన్నప్పుడు రెండు సార్లు జిల్లాలో అన్ని స్థానాలూ క్లీన్ స్వీప్ చేశాయి. అందరు టీఆరెస్ అభ్యర్థులు గెలిచారు. టీఆరెస్ ఇందూరుకు కంచుకోట అని రెండు సార్లు ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఏడేండ్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఈగ గంగారెడ్డి శకం ఇక ఒడిసిన ముచ్చటగా మిగిలిపోనుంది. ఆయనను ఇక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశం లేదు.
గతంలో జిల్లా పార్టీ అధ్యక్ష నియామకాన్ని కేసీఆర్ వద్దన్నాడు. అయినా ఇందూరులో ఈగ గంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగానే చెలామణి అయ్యాడు. మిగిలిన నేతలు కూడా సరేలే పొమ్మని సర్దిచెప్పుకున్నారు. కొందరు ఎమ్మెల్యేలతో పాటు జడ్పీ చైర్మన్ విఠల్‌రావు .. ‘ఈగ గంగారెడ్డిని ఎలా జిల్లా పార్టీ అధ్యక్షుడి’గా సంబోధిస్తారని బాహాటంగానే విమర్శించారు. అయినా .. ఇన్ని రోజులూ నెట్టుకొచ్చాడు. జిల్లాలో టీఆరెస్ పార్టీ ఆఫీసు నిర్మాణం పూర్తయ్యింది. త్వరలో దీన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘ఆ కొత్త భవనంలో అధ్యక్ష హోదాలో ఆసీనులయ్యేదెవరు?’ ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. కొత్తగా ఈసారి పార్టీ కమిటీలలో జిల్లా కమిటీలకు అవకాశం ఇచ్చారు. గతంలో చేసిన పొరపాటు తెలుసుకున్నారు. ఇప్పుడాతప్పు దిద్దుకుంటున్నారు.
అయితే ఈగ గంగారెడ్డికి మళ్లీ అధ్యక్ష పదవి ఇవ్వడం కుదరకపోవచ్చు. ఎందుకంటే పార్టీలో చాలా మంది పదవుల్లేక ఎదురుచూస్తున్నారు. ఈగ గంగారెడ్డి పరిస్థితి ఇప్పుడు ఎటూకాని దిక్కు లేని దీన స్థితి అయ్యింది. ‘నాకు ఏదైనా పదవి ఇవ్వండి మొర్రో.. ‘అని చెప్పులరిగేలా తిరుగుతూనే ఉన్నాడు. ఎవరూ పట్టించుకోలేదు. ‘ఈసారైనా ఎమ్మెల్సీ ఇవ్వకపోతారా?’అని తనను కలిసినవారికి చెప్పుకుని సంతోషపడుతున్నాడు. తనకు తాను సర్ధిచెప్పుకుంటున్నాడు. పాపం.. అల్ప సంతోషి. కానీ అక్కడ పరిస్థితులు వేరు. సమీకరణలు వేరు. ఉద్యమకారులకు ఒక్కొక్కరికీ లేటైనా న్యాయం జరుగుందనే భావనలో చాలా మంది ఉన్నారు. అదే కేటగిరీలో ఉన్న ఈగ కూడా ఓపిగ్గా వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడీ ‘లక్కీ’ అధ్యక్షుడు తన లక్కీని పరీక్షించుకునేందుకు హైదరాబాద్లో పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు.