(మ్యాడం మధుసూదన్
సీనియర్ పాత్రికేయులు)
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదు. ఎప్పుడు టాప్ గేర్‌లో ఉండే మందుబాబుల జోరు తగ్గింది. లిక్కర్ ఆదాయానికి కూడా గండి పడింది. పన్నుల రాబడి పెరగలేదు. అప్పులు 60 శాతం.. ఆదాయం 30 శాతం అన్నట్టు తయారయ్యింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఏప్రిల్ నెల నుంచి ఆగస్టు నెలాఖరు వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనలర్ (కాగ్) ఈ రోజు తాజాగా నివేదిక విడుదల చేసింది. మొత్తం రెవెన్యూ ఆదాయం గతం కంటే 2 నుంచి 3 శాతం తగ్గినట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో దాదాపు 3 శాతం గండి పడింది. వాస్తవానికి, ప్రతి సంవత్సరం 10 శాతం నుంచి 17 శాతం వరకు ఆదాయం పెరిగితే తప్ప ఆర్థిక పరిస్థితి నిలదొక్కుకోలేదు. కానీ, గత కొన్ని నెలలుగా కారణాలేమైనా.. ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్ నివేదిక ద్వారా స్పష్టం అవుతున్నది. గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎక్సైజ్ ఆదాయము 3 శాతం తగ్గింది. వాస్తవానికి, ఈ ఏడాది ఆర్థిక సంక్షోభంలో మందుబాబుల జోరు కూడా తగ్గింది. ఈసారి వ్యాట్‌ను మినహాయించి కేవలం మద్యం అమ్మకాల ద్వారా 28వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు 7, 700 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఇది మొత్తంలో 28శాతం మించలేదు.
గత ఏడాది ఇదే సమయానికి మొత్తం అంచనాలో 30 శాతానికి పైగా ఉన్న అబ్కారీ ఆదాయం ఈసారి 28 శాతానికే పరిమితమైంది. కారణాలేమైనా.. ఈ ఆదాయంలో రివర్స్ గేర్ ప్రభుత్వాన్ని కొంత కలవరపర్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పరోక్షంగా, ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావం చూపే రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోకపోవడం ఖజానాను దెబ్బతీస్తున్నది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ ద్వారా 19వేల కోట్లు వస్తుందని అంచనా వేయగా.. ఈసారి ఐదు నెలల్లో కేవలం 6వేల కోట్లకే ఇది పరిమితమైంది. గత ఏడాదితో పోలిస్తే.. ఈసారి రియల్ ఆదాయంలో 3 శాతం తగ్గింది. ఇక విలువ ఆధారిత పన్ను (సేల్స్ టాక్స్) ఆదాయం కూడా అంతంత మాత్రమే. బడ్జెట్లో అంచనా వేసిన దానిలో కేవలం 37 శాతం మాత్రమే రాబడి సమకూరింది. 37వేల కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా.. రూ. 14వేల కోట్లు మాత్రమే ఖజానాకు చేరింది.
ప్రధాన ఆదాయ వనరైనా జీఎస్టీ ద్వారా దాదాపు రూ. 60వేల కోట్లు వస్తుందని అంచనా వేయగా.. ఇప్పటి వరకు రూ. 21వేల కోట్లు మాత్రమే సమకూరింది. ఈ ఆదాయం పెరగకపోగా.. గత ఏడాది కంటే ఒక శాతం తగ్గింది.
గుడ్డిలో మెల్లలా ఈసారి కేంద్ర పన్నులలో వాటా కాస్త పెరిగింది. రూ. 18వేల కోట్లు అంచనా వేయగా ఇప్పటికే రూ. 7, 600 కోట్లు వచ్చాయి. గత ఏడాది కంటే ఇది 7 శాతం వృద్ధి కనిపిస్తున్నది. పన్నేతర రాబడి విషయానికొస్తే.. పరిస్థితి అతి దారుణంగా ఉంది. నాన్ టాక్స్ రెవెన్యూ ద్వారా రూ. 31వేల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేయగా.. ఈ ఐదు నెలల్లో రూ. 1579 కోట్లు మాత్రమే వచ్చాయి. శాతంలో గత సంవత్సరానికి, ఈ సంవత్సరానికి పెద్ద తేడా లేదు.
ఇక అప్పులు మాత్రం జోరుగా పెరుగుతున్నాయి. ఈ సారి ఆదాయం 3 శాతం తగ్గితే అప్పులు 5 శాతం పెరిగాయి. బడ్జెట్ పరిధిలో ఈసారి రూ. 50వేల కోట్ల అప్పులు తీసుకోవాలని భావించగా.. ఈ ఐదు నెలలలోపే రూ. 33వేల కోట్లు దాటింది. ఇప్పటికే 60 శాతానికి పైగా అప్పులను సర్కార్ తీసేసుకున్నది. ఇంకా నెలల కోసం 40 శాతం మాత్రమే మిగిలి ఉంది. ఇక, అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల శాతం పెరగడం విశేషం. మౌళిక సదుపాయాలు, ప్రాజెక్టుల నిర్మాణం వంటి వాటికి కేటాయించే కాపిటల్ ఎక్స్పెండేచర్ గతంలో కంటే 10 శాతం పెరగడం సానుకూల పరిణామం. ఆదాయం పెరగకున్నా.. భవిష్యత్‌కు అవసరమయ్యే సదుపాయాల పై ఖర్చు పెరగడం మాత్రం కొంత మేర సర్కార్‌ను అభినందించాల్సి ఉంటుంది.
బడ్జెట్లో కేటాయించిన రూ. 36వేల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండేచర్ (పెట్టుబడి వ్యయం)ను ఇప్పటికే రూ. 14వేల కోట్లు ఖర్చు చేసినట్టు కాగ్ నివేదిక స్పష్టం చేస్తున్నది. రెవెన్యూ రాబడి మొత్తంలో ఒక శాతం తగ్గగా, సొంత పన్నుల రాబడిలో 3 శాతం వరకు గండి పడింది. ఈ గండిని ఎలా పూడ్చుకుంటారు? పెరుగుతున్న అప్పులను ఎలా కట్టడి చేస్తారనేది ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్
బాక్స్ ఐటెం
మందుబాబుల జోరు ఎందుకు తగ్గింది.
వాస్తవానికి, మద్యం రాబడిలో తెలుగు రాష్ట్రాలు టాప్ గేర్‌లో ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రత్యక్ష అమ్మకాలు, పరోక్ష వ్యాట్ ద్వారా దాదాపు రూ. 40 వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది. జీఎస్టీ తరువాత ఇదే అతి పెద్ద ఆదాయ వనరు కావడం విశేషం. ప్రతి సంవత్సరం ఈ ఆదాయం పెరుగుతుంది. కానీ, ఈ సారి దాదాపు ప్రత్యక్ష అమ్మకాల్లో 3 శాతం, పరోక్ష అమ్మకాల్లో 3 శాతం దాదాపు 6 శాతం గండి పడింది. అసలు మద్యం అమ్మకాలు ఎందుకు తగ్గాయి? అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం అన్వేషణ మొదలుపెట్టింది. ఒకటి… మందు వినియోగం తగ్గిందా? ఏదైనా సరకులు అక్రమంగా తరలుతున్నాయా? మారిన రాజకీయ పరిస్థితులు దీనికి కారణమా? అనే కోణంలో ప్రభుత్వం ఆరా తీస్తున్నది. వాస్తవానికి ఇటీవల మద్యం ధరలు పెరిగాయి. ఈ క్రమంలో వినియోగం తగ్గిందా? ఒకటే బాటిల్‌ను నలుగురు పంచుకుంటున్నారా? క్వాటర్లో వాటర్ ఎక్కువ కలుపుకుంటున్నారా? అనే ఫన్నీ ఆలోచనలు, విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ జోరు తగ్గడం కూడా దీనికి ప్రత్యక్ష కారణంగా చెబుతున్నారు. మరోవైపు .. ఏపీలో మారిన రాజకీయ పరిస్థితులు కూడా మద్యం ఆదాయంపై ప్రభావం చూపినట్టు స్పష్టం చేస్తున్నాయి. గతంలో ఏపీలో భూం భూం బ్రాండ్లు ఫేమస్ కావడం, నాసిరకం మద్యం పై దుమారం రేగడం వంటి కారణాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో అమ్మకాలు పెరిగాయి. తరువాత క్రమంలో ప్రభుత్వం మారడం, తెలంగాణకు తగ్గట్టుగా క్వాలిటీ బ్రాండ్లు అక్కడ రావడం.. దీనికొక ప్రత్యక్ష కారణంగా, మరో కారణంగా చెబుతున్నారు.
