(వాస్త‌వం ప‌త్యేక ప్ర‌తినిధి)

రెండు ద‌శాబ్దాల త‌రువాత మూసీ న‌ది మ‌హోగ్ర‌రూపం దాల్చింది. శుక్ర‌వారం సాయంత్రం నుంచి ఉధృతంగా ప‌రువ‌ళ్లు తొక్కిన మూసీ వ‌ర‌ద ధాటికి న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. న‌గ‌రానికి ఎగుర ప్రాంతంలో ఉన్న జంట జ‌ల‌శ‌యాలు ఉస్మాన్‌సాగ‌ర్‌, హిమాయ‌త్‌సాగ‌ర్ ఏక‌మై ఒకే స‌మ‌యంలో వ‌రుద గేట్లు తెరుచుకోవ‌డంతో మూసీ న‌ది ప‌ర‌వ‌శించింది. భారీ వ‌ర‌ద‌తో ఉప్పొంగింది.

ఈసా,మూసీ న‌దులు సంగ‌మించి ప‌ర‌వ‌ళ్లు తొక్క‌డంతో పురానా ఫూల్‌నుంచి న‌యాఫూల్ వ‌ర‌కు చాద‌ర్ ఘాట్ నుంచి ఉప్ప‌ల్ వ‌ర‌కు ప‌ల్ల‌పు ప్రాంతాలు ప్ర‌మాదంలో ప‌డ్డాయి. చాద‌ర్ ఘాట్ బ్రిడ్జి , కాజ్‌వే బ్రిడ్డి ప‌రిస‌ర ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ఈ సాయంత్రం నుంచే ప‌రివాహాక ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అధికారులు అప్ర‌మ‌త్తం చేస్తూ న‌దీ ప్ర‌వాహ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తున్నారు.

ఈ శుక్ర‌వారం ఉద‌యం నుంచి కురిసిన భారీ వ‌ర్షాల‌కు వికారాబాద్‌, శంక‌ర్‌ప‌ల్లి, చేవెళ్ల నుంచి భారీ వ‌ర‌ద ఉస్మాన్‌సాగ‌ర్‌లోకి ప్ర‌వ‌హించింది. అదే స‌మ‌యంలో దాని స‌మీపంలో ఉన్న హిమాయ‌త్ సాగ‌ర్‌లోకి శంషాబాద్‌, చాద్ న‌గ‌ర్ ప‌రిస‌ర ప్రాంతాల నుంచి భారీ వ‌ర‌ద చేరింది. దీంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మై గండిపేట్‌లో 12 గేట్ల‌ను, హియాయ‌త్‌సార‌గ్‌లో 10 గేట్ల‌ను ఎత్తారు. గండిపేట నుంచి 10వేల క్యూసెక్కులు, హిమాయ‌త్ సాగ‌ర్ నుంచి 9వేల క్యూసెక్కుల‌ను మూసీ న‌దిలోకి వ‌దిలారు.

మురికిగా ఉండే మూసీ ఒక్క‌రోజులోనే గోదావ‌రి, క్రిష్టా న‌దుల‌ను త‌ల‌పించింది. ఎగువ ప్రాంతాల్లో వ‌ర్షాలు కురుస్తున్నందున ఈ ప్ర‌వాహం మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం క‌నిపిస్తుంది.