(దండుగుల శ్రీనివాస్)
మొన్నటిదాకా క్లౌడ్ బరస్ట్ తెలంగాణను అతలాకుతలం చేసింది. ఇప్పుడు కవిత బరస్ట్ కూడా రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఆమె కుటుంబ వ్యవహారాలన్నింటినీ బయటపెట్టింది. కేసీఆర్‌పై సీబీఐ ఎంక్వైరీ వేయడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. మొన్నటి వరకు అసలు కేసీఆర్‌కు నోటీసులివ్వడం పై విరుచుకుపడిన కవిత.. ఇవాళ తండ్రికి సీబీఐ ఎంక్వైరీ అనే సరికి మొత్తం కుటుంబ వ్యవహారాలు బయటపెట్టడం.. కఠోర సత్యాలు చెప్పడం సంచలనం రేకెత్తించాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది నిజమేనని ఒప్పుకున్న ఆమె.. ఈ మరక అంటించింది మాత్రం.. హరీశ్‌రావు, సంతోష్‌రావులేనని తేల్చి చెప్పింది. వీరి పైసాపిచ్చే ఇక్కడ దాకా తెచ్చిందని కూడా ఆమె తీవ్రంగా మండిపడింది.
కేసీఆర్‌పై సీబీఐ ఎంక్వైరీ వేస్తే తెలంగాణ బంద్‌కు ఎందుకు పిలుపివ్వలేదు.. అని కేటీఆర్‌నుద్దేశించి కూడా ఆమె ఘాటుగానే స్పందించింది. ఇంత జరిగిన తరువాత పార్టీ ఉంటే ఏందీ.. పోతే ఏందీ అనే వైరాగ్యాన్ని ఆమె ప్రదర్శించడం వివాదస్పదమైంది. ఆమె తండ్రికి సపోర్టు చేస్తున్నట్టు మాట్లాడినా.. వాస్తవానికి ఘోష్ కమిషన్ నివేదికలో ఆయనే ప్రధాన దోషిగా ఉంది. కేసీఆర్ ఈ విషయంలో ఆయన ఎవరి మాటా వినలేదు. తనక్కావాల్సినట్టుగానే ఇంజినీరింగ్ ను మార్చుకున్నాడు. దీని వల్లే ఇది డ్యామేజీకి గురయ్యిందనేదే ప్రధాన ఆరోపణ. ఆ తరువాత అంచనా వ్యయం అవినీతికి పాల్పడ్డారనే మరో విషయాన్ని కూడా కమిషన్ లో పేర్కొన్నది. కానీ కవిత ఎంతగా తండ్రిని వెనుకేసుకొచ్చినా.. అక్కడ ఆమె వ్యూహం ఫలించలేదు.
తన కడుపులో ఎన్నో రోజుల నుంచి ఉన్న విషయాన్ని బయట చెప్పేందుకు ఇదే సరైన సమయమని ఆమె భావించి ఉంటుంది. అందుకే హరీశ్, సంతోష్‌ల ధనదాహాన్ని బయటపెట్టింది. వీరి పైసా పిచ్చితోనే ఈ ప్రాజెక్టుకు అవినీతి మరక అంటిందని ఆమె క్లారిటీ ఇచ్చింది. కాంట్రాక్టర్ మేఘ క్రిష్టారెడ్డితో జత కలిసి పెద్ద అవినీతే చేశారని కూడా ఆమె తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం రేపింది. హరీశ్ వెనుక సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నాడనే ఆరోపణ చేసింది. కానీ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు జనం. ఎందుకంటే.. కమిషన్ రిపోర్టులో చాలా సార్లు హరీశ్ పేరు కూడా ప్రస్తావించారు. మొత్తానికి కవిత చేసిన ఆరోపణలు, చెప్పిన కఠోర సత్యాలు ఆమెకు, ఆ పార్టీకి ఏమాత్రం మేలు చేయకపోగా.. మరింత నష్టాన్నే తెచ్చిపెట్టాయి. ఇక ఆమెను పార్టీ నుంచి అధికారికంగా సాగనంపడమే మిగిలుంది.