తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కాంట్రాక్టర్ల వ్యవస్థ రోజురోజుకి దిగజారిపోతూ వస్తున్నది. మిషన్ కాకతీయ ప్రారంభ సమయంలో టీఆరెస్ కార్యకర్తలు, నాయకులే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారు. పనులు చేయించుకుని బిల్లులు లేపుకున్నారు. ఆ తర్వాత క్రమంగా రాష్ట్ర బడ్జెట్ తలకిందులవుతూ వచ్చింది. మధ్యలో కేసీఆర్ కొత్త పథకాల రూపకల్పన అమలుతో ఖజానాకు పెనుభారంగా మారింది. పథకాలు ఆపితే పరువు పోయే పరిస్థితి. దీంతో వేరే శాఖల బడ్జెట్‌లో కోతలు విధించక తప్పని దుస్థితి ఏర్పడింది.
దీంతో మున్సిపాలిటీ, ఆర్అండ్‌బీ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ తదితర శాఖలకు నిధుల కొరత ఏండ్ల తరబడి కొనసాగుతున్నది. కొత్తగా పనులకు టెండర్లు పిలిచినా వచ్చే దిక్కు లేదు. పనులు తీసుకోవాలంటనే కాంట్రాక్టర్లు భయపడి చస్తున్నారు. పాత బిల్లులు రాక.. అప్పులకు వడ్డీలు కట్టలేక బికారీలుగా మారిపోయారు. దీంతో టెండర్ల జోలికే వెళ్లడం లేదు. ఇక పరిస్థితి మారుతుందేమోనని దినదినం ఎదురుచూసినా పరిస్థితి నానాటికి మరింత దిగజారి పోతుంది.
కరోనా వచ్చిన సందర్భం నుంచి ఇప్పటి వరకు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా కాంట్రాక్టర్ల పరిస్థితి ఘోరంగా మారింది. దీంతో చిన్న తరహా పనులు చేసే కాంట్రాక్టర్లు ఆర్థికంగా పూర్తిగా చితికిపోయారు. ఉన్న ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఇక బడా కాంట్రాక్టర్లు రాష్ట్రం నుంచే పారిపోతున్నారు. ఆంధ్రా, తమిళనాడులో పనులు చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ల పరిస్థితి దారుణంగా తయారు కావడంతో పాటు.. అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం పడ్డది. ఎప్పటికి రాష్ట్ర ఆర్థిక స్థితి మెరుగుపడుతుందో తెలియదు. ఆలోపు కేసీఆర్ మదిలో ఓ కొత్త పథకం రూపుదిద్దుకుంటే ఈ నిధులన్నీ అటుపోవాల్సిందే. ఆ శాఖలన్నీ ఇలా నిర్వీర్యం కావాల్సిందే. ప్రగతి చక్రం పంక్చరై తుప్పుపట్టాల్సిందే.