(దండుగుల శ్రీనివాస్)
అపర మేధావిగా తనకు తాను ముద్రవేసుకునేందుకు ఇన్నాళ్లూ చేసుకున్న ప్రయత్నాలకు ఆయనే గండి కొట్టుకుంటున్నాడు. దేశపతి శ్రీనివాస్‌ను ఈ మధ్య సోషల్ మీడియా ఆడుకుంటున్నది. అందుకు కారణాలూ లేకపోలేదు. పెద్దల మెప్పు పొందేందుకు ఆయన చేస్తున్న చర్యలు.. కాదు కాదు దుశ్చర్యలు వివాదమై కూర్చుంటున్నాయి. పాపం ఆయనో మేధావి అని కూడా చూడకుండా తుక్కు తుక్కు పొట్టు పొట్టు తిడుతున్నారు చిన్నాపెద్దా అంతా కలిసి. ఇప్పుడు మళ్లీ ఆయన వివాదానికెక్కాడు. ఏ విషయంలో? అసలు ఉన్నదో లేదో తెలవని తెలంగాణ వికాస సమితి దుకాణం తెరిచాడాయన మళ్లీ కొత్తగా. ఇప్పుడు అర్జెంటుగా దానితో అవసరం పడింది ఆయనకు. తప్పలేదు.
అప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ అండ్ టీమ్‌కు చెక్ పెట్టేందుకు తెర మీదకు కేసీఆర్ తెచ్చిన దుకాణమే తెలంగాణ వికాస సమితి. దాన్ని పెట్టుకుని ఏం చేయాలో, దాని లక్ష్యమేమిటో తెలియక కోల్డ్ స్టోరేజీలో పెట్టేశారు అధికారంలో ఉన్న పదేండ్లు. ఇప్పుడు ప్రతిపక్షం కదా! దీన్ని పట్టుకుని మళ్లీ ఎలివేట్ కావడం ద్వారా పెద్దాయన దృష్టిలో పడాలనుకున్నట్టున్నాడు. ఈ మధ్య ఆయన చేసే ప్రతీ చర్య, కార్యక్రమాలు ఇలా ఫాల్స్ ప్రెస్టేజీ కోసం పాకులాడే లాగే ఉన్నాయి. తాజాగా తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో వైషమ్యాల సుడిలో వైవిధ్య భారతం .. అనే అంశంపై కార్యక్రమమొకటి నిర్వహించాడు. కొత్తపల్లి జయశంకర్ సార్ స్మారకోపన్యాసాన్ని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ చేత చేయించాలనుకోవడమే పెద్ద వివాదస్పదమైంది.
ఆయనను ఈ మధ్య బెట్టింగ్ యాప్‌లకు నటించాడనే కారణంతో ఈడీ విచారణ చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు కూడా చాలా విషయాల్లో కామెంట్లు చేసి వివాదస్పమయ్యాడు ప్రకాశ్ రాజ్. వివాదాలకు కేంద్ర బిందువైన ప్రకాశ్‌రాజ్ చేత వివాదాలకు కొని తెచ్చుకుంటున్న దేశ్‌పతి స్మారకోపన్యాసం ప్రోగ్రామ్ పెట్టించాడు. అదీ జయశంకర్ సార్ గురించి. ఔరా.. ఇది నీకు తగునా? అని సోషల్ మీడియాలో తుమ్మెత్తిపోస్తున్నారంతా. అంతకు ముందు ఏదో తనకు తెలిసిన మేధావి భాషలో ఏదో పోస్టు పెట్టాడు. తెలంగాణ సెంటిమెంట్ గురించి ఏదో చెప్పే ప్రయత్నంలో నాలుక తిరగని, జనాలకు అర్థంకాని భాషలో సహజంగా తనకున్న మేథావితనం పైత్యంలో ఏదో పోస్ట్ చేశాడు. దీనిపైనా ఆడుకున్నారు నెటిజన్లు.
అంతకు ముందు యాంకర్ స్వేఛ్చ ఆత్మహత్య వెనుక ఉన్న ప్రధాన నిందితుడు ఈయనకు ప్రియశిష్యుడనే విషయాన్ని విస్తృత ప్రచారం చేసి ఆడుకున్నది సోషల్ మీడియా. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా వార్తల్లో కేంద్రబిందువైతేనే కదా.. రచ్చకెక్కితేనే గదా పెద్దాయన దగ్గరికి తీసేది. తనతో పాటు హెలికాప్టర్‌లో కూర్చోబెట్టుకునేది. అంతే కదా. కాదంటారా?
