(దండుగుల శ్రీ‌నివాస్‌)

ట్విట్ట‌ర్‌లో గ‌ర్జించ‌డం.. లేదంటే ఫేస్‌బుక్కులో క‌విత‌ల‌తో కుమ్మేయ‌డం. ప్రెస్‌మీట్ల‌లో వీరావేశం చూపించ‌డం.. అదీ కాదంటే చిన్న‌పాటి స‌మావేశాలు పెట్టి పొట్టు పొట్టు తిట్టి తొడ‌లు చ‌ర‌చ‌డం. గ‌త ఏడాదిన్న‌ర కాలంగా పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ చేస్తున్న‌దిదే. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే ప‌రిమితం కావ‌డం, అన్ని బాధ్య‌త‌లూ కేటీఆర్‌పైనే వేయ‌డంతో అంతా తాననుకున్న‌దే చేస్తున్నాడు. జ‌నం ప‌క్షాన ఆందోళ‌న‌లు లేవు. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌న‌లూ లేవు. పార్టీ అనుబంధ క‌మిటీలు లేవు. పార్టీలో క్యాడ‌ర్‌కు కొత్త ఉత్సాహం ఇచ్చే ప‌నులూ లేవు. ఇవ‌న్నీ చేయ‌నే లేదు. ఇంకా బీఆరెస్ మేల్కోనే లేదు. అక్క‌డ కాంగ్రెస్ పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టింది.

పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జి మీనాక్షీ న‌ట‌రాజ‌న్‌, పీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్‌ల సార‌థ్యంలో ఉత్త‌ర తెలంగాణ‌లో పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డం, వారితో క‌లిసి శ్ర‌మ‌దానం చేయ‌డం, క్యాడ‌ర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింప‌డం, లోపాలు, స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని వాటిని సరిదిద్దుకునేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చించ‌డం, లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల్లో సాధ్య‌మైన‌న్ని ఎక్కువ సీట్లు గెలిచి స‌త్తా చాటడం.. ఇదీ ఈ పాద‌యాత్ర ఉద్దేశ్యం.

కేటీఆర్‌, హ‌రీశ్‌రావుల‌తో ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్ భేటీ అయ్యాడు. రైతుల ప‌క్షాన నిల‌వాలె. ఆందోళ‌న చేయాలె అని పిలుపిచ్చాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని ఆందోళ‌న‌లు చేశారు. క‌నీసం క‌విత వేరు కుంప‌టి పెట్టిన త‌రువాత తిరిగిన‌ట్టు కూడా కేటీఆర్ తిర‌గ‌లే. క‌విత చేసిన కార్య‌క్ర‌మాలూ పార్టీ చేయ‌లె. బీసీ ఎజెండా మొత్తంగా మాది కాద‌న్న‌ట్టుగానే పోతున్న‌ది బీఆరెస్. అప్పుడు బీసీల‌కు కేసీఆర్ మోసం చేశాడ‌నే ప్ర‌చారం ఎట్లాగూ ఉంది. దీన్ని కంటిన్యూ చేస్తున్నాడు కేటీఆర్‌. బీఆరెస్‌వీ లా క‌మిటీల‌న్నీ వేసుకోవాలె, అనుబంధ క‌మిటీల‌ను బ‌లోపేతం చేయాల‌ని కూడా కేసీఆర్ పిలుపునిచ్చాడీ సంద‌ర్బంగా. అస‌లు క‌మిటీలు లేక ఎన్నేండ్లైంది.

కేటీఆర్‌కు పార్టీ ప‌గ్గాలిచ్చిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఏవైనా క‌మిటీలు వేశారా? జిల్లా అధ్య‌క్షులు లేక‌, జిల్లా క‌మిటీలు, రాష్ట్ర క‌మిటీలు వేయ‌క‌, అనుబంధ క‌మిటీల‌ను గాలికొదిలేసి ఎన్నేండ్లైంది. ఇప్పుడు నిద్ర‌మ‌త్తు వీడి … వీటిని బ‌లోపేతం చేయాలని పిలుపునిచ్చాడు కేసీఆర్ చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పిన‌ట్టు. కానీ ఆ లోపు.. పాద‌యాత్ర పేరుతో కాంగ్రెస్ రాష్ట్రాన్ని చుట్టి వచ్చేలా ఉంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో అంతో ఇంతో కోపం ఉంది. అది కామ‌నే. దీన్ని కూడా కొంచెం త‌గ్గించుకునే ప‌ని చేస్తున్న‌ది కాంగ్రెస్‌. మ‌రి బీఆరెస్ ఏం చేస్తున్న‌ది? కేటీఆర్ ఏం చేస్తున్నాడు?? లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల్లో ఎట్లా గెలుద్దామ‌నుకుంటున్నారు???

DANDUGULA Srinivas

Senior Journalist

8096677451