(దండుగుల శ్రీనివాస్)
ఆ తండ్రికి కొడుకే ముద్దు. ఆ తండ్రికే కాదు.. పితృస్వామ్య వ్యవస్థలో ఏ తండ్రికైనా అంతే. అందులోనూ ఇలా రాజకీయ వారసత్వాల విషయాకిస్తే మాత్రం కొడుకులే కదా ముందు వరుసలో ఉండేది. కూతర్లకు వారసత్వం కట్టబెట్టేంత సీన్ ఇంకా రాలేదు. రాదు. కేసీఆర్ లాంటి హిందూ సంప్రదాయాలను ఔపోసన పట్టిన నాయకుడు కొడుకుకు కాక బిడ్డెకు అధికారం ఇద్దామనుకుంటాడు. కానే కాదు. నెవ్వర్. ఒకదశలో హరీశ్ రావును ఆరేండ్లు ప్రగతిభవన్‌లోకి అడుగు పెట్టనీయలేదు. ఎందుకు..? కొడుకు కోసం. ఇప్పుడు కవితను అంత దూరం ఎందుకు చేసుకున్నాడు? ఆమె గురించి ఏమాత్రం పట్టించుకునే పరిస్థితిలో లేడు కేసీఆర్.. ఎందుకు? కొడుకు కోసం.
అంతే. కొడుకును సీఎం పీఠం ఎక్కించాలె. అంతే. అదొక్కటే ధ్యాస. శ్వాస. రాజకీయ చాణక్యుడననే చెప్పుకునే కేసీఆర్ .. ఆయన చాణక్యం ఇటు రాజకీయాల్లోనే కాదు.. కుటుంబ వ్యవహారంలో కూడా బెడిసి కొట్టింది. అదీ బిడ్డె కవిత రూపంలో. బిడ్డె రాజకీయంగా ఎదిగి ఎదిగి తన అస్తిత్వం కోసం తండ్రినే ఎదురించే స్థితికి వస్తుందని ఆయన ఊహించలేకపోయాడు. ఆస్తులు, అంతస్తుల్లో వాటానే కాదు. రాజకీయాల్లో కూడా సమానమైన వాటా అడుతోంది కవిత. అక్కడే కుటుంబ కథ తిరుగబడ్డది. ఆమెకు ఆస్తులే కాదు..పదవులూ పంచిచ్చేందుకు సిద్దంగా లేడు కేసీఆర్. ఒక్కసారి తన మాట మీరితే, జవదాటితే, తిరబడితే, ఎదురు ప్రశ్నిస్తే.. ఇక జన్మలో వారి ముఖం చూడడు కేసీఆర్.
అందులో ఇప్పుడు కవిత కూడా వచ్చి చేరింది. అదే ఆ కుటుంబ రాజకీయాల్లో విషాదం. అంతే కొన్ని కావాలంటే కొన్ని వదలుకోవాలి. ఇక్కడ కొడుకు కోసం కూతర్నే వదులుకున్నాడు కేసీఆర్.
DANDUGULA Srinivas
8096677451