(దండుగుల శ్రీనివాస్)
తండ్రితో విభేదించి, అన్న ఆధిపత్యాన్ని ధిక్కరించి వేరు కుంపటి పెట్టుకున్న కవిత ప్రస్తుతం తన రాజకీయ అస్థిత్వ పోరాటంలో బిజీ బిజీగా ఉన్నది. అన్నీ తలకెత్తుకుంటున్నది. అన్నింట్లో తలదూరుస్తున్నది. అందరి కంటే తానే ముందుండే ప్రయత్నం చేస్తున్నది. సంబంధంలేని ఇష్యూలో కూడా తగుదునమ్మా అని తలదూర్చి వివాదాలు కొని తెచ్చుకుంటున్నది. బీసీ ఉద్యమం అలాంటిది. ఆమెను నమ్మింది లేదు ఎవరు. కానీ ఆమె ఆ లైన్ తీసుకుని తన దారిలో తాను కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నది. రైల్ రోకోకు పిలుపునిచ్చినప్పుడు నవ్వుకున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేష్లపై ప్రకటన రాగానే అది తన వల్లేననడం మరింత హాస్యస్పదమైంది. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ నుంచి మొదలైన మాటల దాడి పరంపర కవితపై కొనసాగుతున్నది. అసలు బీసీలకు నీకేమిటీ సంబంధం అనడం స్టార్ట్ చేశారు. ఈ మాటలు జర ముందు నుంచీ అంటే బాగుండేదేమో. కానీ ఆ పోరాట ఫలితం నాదంటే నాదని, ఆ క్రెడిట్ మా పార్టీదని కాంగ్రెస్ వాదనలు, ప్రతివాదనలకు దిగుతున్నది.
అన్న మీద కోపమో, తండ్రి మీద అసహనమో.. ఇంకేదైనా ఫ్రస్టేషనో.. కానీ ఆమె రాజకీయంగా దూకుడుగా పోవడం బీఆరెస్ పార్టీకే నష్టం చేకూరుస్తున్నది. కేసీఆర్, కేటీఆర్‌లకు తలనొప్పిగా మారింది కవిత ఇష్యూ. బీసీల కాన్సెప్ట్ అయితే మరీ ఇరుకున పెట్టింది బీఆరెస్‌ను. అప్పుడు 23 శాతానికే బీసీల రిజర్వేషన్లు కుదించిన ఘనుడు కేసీఆర్. మొన్నటి వరకు పదేళ్ల పాటు పాలించి.. ఇప్పుడు అన్నీ టక్కున గుర్తొచ్చినట్టు కవిత అండ్ టీమ్, కేటీఆర్ అండ్ టీమ్ పెడుతున్న డిమాండ్లు వారికే తిరిగి కొడుతున్నాయి. బీఆరెస్ పార్టీ గొడుగుకిందే ఉండి పనిచేస్తున్నానని కవిత చెబుతున్నది. తండ్రి ఆశీస్సులతోనే ముందుకు సాగుతున్నానని కూడా నమ్మబలికిస్తున్నది. కానీ జాగృతి పేరుతో ఆమె మొత్తంగా వేరు కుంపటే పెట్టింది. ఆ గొడుగు కింద చేస్తున్న ప్రతీ కార్యక్రమం ఆమెకే కాదు.. ఎవరికీ మైలేజీ తీసుకురావడం లేదు. పైగా నష్టం చేస్తున్నది. అభాసుపాలవుతున్నది. తలనొప్పి వ్యవహారంలా మారుతున్నది. ఎవరిస్తున్నారో సలహాలు తెలియదు. ఆలోచన లేకుండా, ఆవేశంగా వేస్తున్న ప్రతి అడుగూ వివాదస్పదమవుతోంది.
Dandugula Srinivas
Senior Journalist
8096677451
