(దండుగుల శ్రీ‌నివాస్‌)

బీజేపీకి అధికారం ప‌క్కా. మేమే ఇక రాబోవు కాలంలో. బీఆరెస్‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. కాంగ్రెస్‌పై వ్య‌తిరేక‌త పెరిగింది. మేమే మేమే. మాకే మాకే . బీజేపీ నేత‌లంతా ఇదే పాట. మొన్న‌టి దాకా. నిజ‌మేన‌నిపించింది చాలా మందికి ఇది. అట్ల‌నే ఉంది ప‌రిస్థితి అని కూడా అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో.. ఈ మ‌ధ్య‌కాలంలో జ‌రిగిన ప‌రిణామాలు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. ఆ పార్టీ తీసుకుంటున్న నిర్ణ‌యాలు నివ్వెర‌పోయేలా చేస్తున్నాయి. పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి మొద‌లైంది ఈ క‌థ‌. ఆ త‌రువాత చాలానే ప్ర‌చారాలు చేశారు. పార్టీని ముందుకు పోనీయ‌కుండా కావాల‌నే ఇది చేస్తున్నారా..? అనే ప్ర‌చారాలు ఆ పార్టీ నేత‌ల నుంచే రావ‌డం .. అధిష్టానం నిర్ణ‌యాలు ఎంత‌టి ప్ర‌భావాన్ని చూపుతున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.

 

తాజాగా రాజాసింగ్ రాజీనామా ఎపిసోడ్ పార్టీనికి మ‌రింత ఇబ్బందిపెట్టింది. వాస్త‌వానికి రాజాసింగ్ ఆవేద‌న‌లో అర్థం ఉంది. దీన్ని లైట్‌గా తీసుకుని బుజ్జ‌గిస్తే స‌రిపోయేది. కానీ గ్రూపుల వివాదాలు, ఆధిప‌త్య ధోరణ‌లు దీన్ని గోటితో పోయేదాన్ని గొడ్డ‌లి దాకా తెచ్చారు. రాజాసింగ్ రాజీనామాల‌ను అధిష్టానం ఆమోదించేలా చేసింది కిష‌న్‌రెడ్డే. పార్టీని అస్స‌లే ముందుకు పోనిస్త‌లేడ‌నే అప‌వాదు, ప్ర‌చారం మూట‌గ‌ట్టుకున్న కిష‌న్‌రెడ్డి.. రాజాసింగ్ విష‌యంలో ఇలాంటి దూకుడు నిర్ణ‌యాలు తీసుకోవ‌డం మ‌రింత ఇబ్బందిక‌రంగా మారింది. రాజాసింగ్‌పై సోష‌ల్ మీడియాలో సానుభూతి వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. అతన్ని స‌పోర్టు చేసేవాళ్లే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రాజీనామా ఆమోదం విష‌యంలో అధిష్టానం నిర్ణ‌యం స‌బ‌బే అని కూడా చెప్పే ప‌రిస్థితిలో ఎవరూ లేరు. అలా చెబితే పార్టీకి మ‌రింత డ్యామేజీ అవుతుంద‌నే భ‌యం వారిలో ఉంది.

12Vastavam.in (4)

ఇప్ప‌టికే స్టేట్ బీజేపీలో గ్రూపులు పార్టీని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నాయి. బండి సంజ‌య్‌, ఈట‌ల రాజేంద‌ర్‌, ర‌ఘునంద‌న్‌రావు, కిష‌న్‌రెడ్డి, తాజాగా రాంచంద్రారావు.. వీరే కాదు అర్వింద్ త‌ను నిజామాబాద్ పార్ల‌మెంటు ప‌రిధిలో స‌ప‌రెటే బీజేపీనే ర‌న్ చేస్తున్నాడు. ఎవ‌రికి వారే య‌మునా తీరే చందంగా మారిన నేత‌లు.. పార్టీని గాడిన ప‌డేయ‌డం అంటుంచి మ‌రింత కిందికి దిగ‌జారుస్తున్నారు. అంతా లీడ‌ర్ల రాజ‌కీయం న‌డుస్తున్న త‌రుణంలో .. హార్డ్ కోర్ క్యాడ‌ర్ మాత్రం పార్టీని భుజానేసుకుని ముందుకు భారంగా ఈడుస్తున్నారు. ఒక‌డుగు ముందుకు పోతే.. లీడ‌ర్ల కార‌ణంగా, వారి వ్య‌వహారం, చేష్ట‌ల మూలంగా నాలుగ‌డుగులు వెన‌క్కి ప‌డుతున్నాయి.

Dandugula Srinivas

Senior Journalist

8096677451