(దండుగుల శ్రీనివాస్)
వాస్తవం చెప్పిందే నిజమైంది. నిధులు లేవని తెలుసు. అయినా ఆర్బాటంగా రాజీవ్ యువ వికాసమనే పథకం మొదలు పెట్టారు. యాభై వేల నుంచి 4 లక్షల వరకు సబ్సిడీ రుణాలందించి యువత తన కాళ్లపై తను నిలబడేలా చేస్తామని నమ్మబలికారు. దరఖాస్తులు తీసుకున్నారు. ఇంటర్వ్యూలు అయిపోయాయి. లబ్దిదారుల సెలక్షన్ అయిపోయింది. జాబితా రెడీ అయ్యింది. జూన్ 2 ముహూర్తం ఫిక్స్ అయ్యింది. కానీ అర్థాంతరంగా ఆపేశారు. రైతు భరోసా కోసం నిధులన్నీ దారి మళ్లించారు. సేమ్ కేసీఆర్ లెక్కనే. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం పథకం ఇప్పట్లో లేనట్టేనని పరోక్షంగా సంకేతాలిచ్చింది సర్కార్.
దీనిపై సీఎం రేవంత్ స్పందించాడు. ఈ పథకం మాకొక చాలెంజ్ అన్నాడు. అంటే.. అప్పటి వరకు ఇగ వచ్చే అగ వచ్చే.. ఇచ్చేస్తున్నాం.. అని భారీ భారీ ప్రచారాలు చేసుకుని .. నిరుద్యోగులను ఆశల పల్లకీలో ఊరేగించి.. దరఖాస్తుల కోసం.. రుణం కోసం ఖర్చు పెట్టుకుని చెప్పులరిగేలా తిప్పించుకుని ఇప్పుడిలా ముఖం తిప్పేసుకున్నారు. నిధులు లేవు. కొత్త పథకాలు ఇప్పట్లో ఉండవు. అది తెలిసిపోతున్నది. కానీ ఎందుకీ ఆర్బాటం. ఆశలు పెట్టడం. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవడం. పైగా మేమే పదేళ్లు.. మాది గోల్డెన్ పీరియడ్. ఇప్పటికే చాలా చేశాం.. చర్చకు సిద్దమా..! అనై డైలాగులు అసలే సూట్ కాకపోగా.. భగ్గుమంటున్న యువతకు, ప్రజలకు అగ్నికి ఆజ్యం పోసినట్టుగానే ఉంది.